దేశంలో మావోయిస్టు ప్రభావిత జిల్లాలు లేవు

దేశంలో మావోయిస్టు ప్రభావిత జిల్లాలు లేవు

ఐదు దశాబ్దాలకు పైగా దేశాన్ని పీడించిన నక్సలిజం అంతమైందని కేంద్రం అధికారిక ప్రకటన చేసింది. దేశంలో ఇప్పుడు నక్సల్స్ ప్రభావిత జిల్లా ఏదీ లేదని కేంద్ర హోం శాఖ రాష్ట్రాలకు అధికారికంగా సమాచారం పంపింది. ఈ మేరకు తొమ్మిది రాష్ట్రాలకు లేఖలు రాసిన కేంద్రం, మార్చి 31 నాటికి దేశం నక్సల్‌ నుంచి విముక్తి పొందిందని పేర్కొంది. గతంలో నక్సల్‌ ప్రభావిత ప్రాంతాలుగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్, ఝార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాల్లో కూడా ఇప్పుడు హింస నియంత్రణలోకి వచ్చిందని కేంద్రం తెలిపింది.

నక్సలిజం పూర్తిగా అంతమైనా, తిరిగి అది పుట్టకుండా ఉండేందుకు కేంద్రం జిల్లాలను రెండు కేటగిరీలుగా వర్గీకరించింది. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా, తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలతో పాటు మొత్తం 37 లెగసీ అండ్ థ్రస్ట్ జిల్లాలుగా ప్రకటించింది. అక్కడ నక్సలిజం అంతమైనప్పటికీ భద్రతను పటిష్ఠం చేయడానికి అభివృద్ధిని కొనసాగించడానికి ప్రత్యేకంగా పర్యవేక్షణ కొనసాగించనున్నారు. 

ఝార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లా ఒక్కదాన్ని మాత్రమే డిస్ట్రిక్ట్ ఆఫ్ కన్సర్న్ కేటగిరీలో ఉంచారు. ఇక్కడ నక్సల్స్ వ్యవస్థ చిన్నాభిన్నమైనా, సమీప భవిష్యత్తులో నిరంతర భద్రత అవసరమని పేర్కొన్నారు. అధికారిక గణాంకాల ప్రకారం, నక్సల్ హింసలో ఇప్పటివరకు 17 వేలకుపైగా మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో పౌరులు, భద్రతా సిబ్బంది ఉన్నారు. 

ఈ నేపథ్యంలో నక్సలిజం నిర్మూలనను ఒక పెద్ద విజయంగా కేంద్రం అభివర్ణిస్తోంది. మరోవైపు, దశాబ్దాలుగా వేళ్లూనుకున్న నక్సలిజం నుంచి దేశానికి విముక్తి కల్పించామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా లోక్​సభలో ప్రకటించారు. సాయుధ తీవ్రవాద ఉద్యమానికి మూలమైన మావోయిస్టు కేంద్ర కమిటీ నిర్మాణాన్ని దాదాపు విచ్ఛిన్నం చేశామని తెలిపారు. అలాగే, మావోయిస్టుల పొలిట్‌బ్యూరో, కేంద్ర వ్యవస్థను దాదాపు తుడిచిపెట్టేశామని, దీంతో నక్సల్స్ ముప్పు నుంచి దేశం విముక్తి పొందిందని షా ఇదివరకే ప్రకటించారు.

మావోయిస్టులకు ఒకప్పుడు కంచుకోటగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో నక్సలిజం దాదాపు అంతమైందని పేర్కొన్నారు.  అదేవిధంగా ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలిసిన వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన ప్రయోజనాలను అందిస్తామని చెప్పారు. పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే, ఆయుధాలు పట్టుకుంటే మాత్రం మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. నక్సలిజాన్ని సమర్థించే వారు ఈ విషయాన్ని తెలుసుకోవాలని షా స్పష్టం చేశారు. 

అలాగే ఎన్​డీఏ వచ్చాకే గిరిజనుల జీవితాల్లో మార్పులు వచ్చాయని తెలిపారు. నక్సలిజాన్ని దెబ్బతీసిన ఘనత ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర బలగాలకే దక్కుతుందని పేర్కొన్నారు. కాగా, ఆపరేషన్​ కగార్​ పేరుతో చాలా మంది నక్సలైట్లను మట్టుబెట్టింది. కర్రె గుట్ట వంటి పలు ప్రాంతాల్లో నిరంతర కూంబింగ్​తో ఆపరేషన్​ చేపట్టింది.  పోలీసులు కథనాల ప్రకారం, గతేడాది జనవరి నుంచి ఛత్తీస్‌గఢ్‌లో ఆయా ఎన్‌కౌంటర్‌లలో నంబాల కేశవరావు వంటి అగ్ర నేతలతో సహా 500 మందికిపైగా మావోయిస్టులు హతమయ్యారు. అదే విధంగా, రాష్ట్రంలో దాదాపు 1,900 మంది నక్సలైట్లు అరెస్టయ్యారు. మరో 2,500 మందికి పైగా లొంగిపోయారు.