ఆసియా పారా గేమ్స్ 2026లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. జపాన్‌లోని ఐచి-నగోయాలో జరుగుతున్న ఈ క్రీడా సంబరాల్లో రెండవ రోజు ముగింపు నాటికి భారత్ ఖాతాలో 35 పతకాలు చేరాయి. ఇందులో 9 స్వర్ణాలు, 11 రజతాలు, 15 కాంస్యాలు ఉన్నాయి. మొత్తం పతకాల పట్టికలో భారత్ ఆరో స్థానంలో కొనసాగుతోంది. అథ్లెటిక్స్‌లో భారత క్రీడాకారులు అత్యధిక పతకాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారు
ఆసియా పారా గేమ్స్‌లో భారత పతకాల వేటలో అథ్లెటిక్స్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ విభాగంలో ఇప్పటివరకు 20 పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. ఇందులో 8 స్వర్ణాలు, 6 రజతాలు, 6 కాంస్యాలు ఉన్నాయి. నిషాద్ కుమార్ లాంగ్ జంప్, హైజంప్ విభాగాల్లో స్వర్ణాలు సాధించి సత్తా చాటారు. దీప్తి జీవాంజి, సౌమ్య, రింకు, ప్రణవ్ సూర్మా, దేవేందర్ కుమార్, సిమ్రన్ కూడా స్వర్ణ పతకాలతో మెరిశారు.
పారా షూటింగ్‌లో మోనా అగర్వాల్ స్వర్ణ పతకం సాధించగా, అవని లేఖర రజతంతో మెరిశారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 విభాగంలో మనీష్ నర్వాల్ రజత పతకం గెలుచుకున్నారు. మహిళల విభాగంలో శ్రిష్టి అరోరా కాంస్య పతకాన్ని సాధించారు. పారా టేబుల్ టెన్నిస్‌లో భారత క్రీడాకారులు ఐదు కాంస్య పతకాలు సాధించారు. పారా స్విమ్మింగ్‌లో మూడు, పారా జూడోలో రెండు, పారా పవర్‌లిఫ్టింగ్‌లో ఒక పతకం భారత్‌కు దక్కాయి.
భారత పారా అథ్లెట్ నిషాద్ కుమార్ పురుషుల హైజంప్ టి47 విభాగంలో 2.04 మీటర్ల ఎత్తు దూకి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించాడు. ఆయన దరిదాపుల్లో మరే అథ్లెట్ నిలవలేకపోయారు. ఇక మొదటిరోజు నిషద్ మెన్స్ లాంగ్ జంప్ టి47లోనూ బంగారు పతకం సాధించారు. దీంతో ఒకే ఏషియన్ గేమ్స్ ఎడిషన్‌లో రెండు గోల్డ్ మెడల్స్ సాధించిన మూడో భారత అథ్లెట్‌గా నిలిచాడు.
దీప్తి జీవాంజి మహిళల 400 మీటర్ల టి20 విభాగంలో స్వర్ణం గెలిచింది. పురుషుల డిస్కస్ త్రో ఎఫ్51/ఎఫ్52/ఎఫ్53 విభాగంలో ప్రణవ్ సూర్మ స్వర్ణం సాధించగా, రామ్ రతన్ సింగ్ రజత పతకాన్ని అందుకున్నాడు. మహిళల 200 మీటర్ల టి12 విభాగంలో సిమ్రన్ స్వర్ణం గెలవగా, తేజల్‌బెన్ దామోర్ కాంస్యం సాధించింది. మహిళల 200 మీటర్ల టి35 విభాగంలో ప్రీతి పాల్ రజత పతకం గెలుచుకుంది. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్53/ఎఫ్54 విభాగంలో ప్రదీప్ కుమార్ రజతం, ఆయుష్ వర్మ కాంస్యం సాధించారు.
పురుషుల షాట్‌పుట్ ఎఫ్11 విభాగంలో ప్రవీణ్ శర్మ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. పురుషుల పారా పవర్‌లిఫ్టింగ్ 65 కిలోల లోపు విభాగంలో అశోక్ రజత పతకాన్ని సాధించాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్ హెచ్1 విభాగంలో మనీష్ నర్వాల్ రజతం గెలవగా, మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్ హెచ్1 విభాగంలో సృష్టి అరోరా కాంస్య పతకాన్ని అందుకుంది.
పారా టేబుల్ టెన్నిస్‌లో సోనల్‌బెన్ పటేల్, భావినా పటేల్, ప్రాచీ పాండే, సహానా రవి, జెహాన్ మదన్ కాంస్య పతకాలను సాధించారు. పారా స్విమ్మింగ్‌లో పురుషుల 400 మీటర్ల ఫ్రీస్టైల్ ఎస్11 విభాగంలో హిమాన్షు నందల్, పురుషుల 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లీ ఎస్ఎం7 విభాగంలో నిరంజన్ ముకుందన్ కాంస్య పతకాలు గెలుచుకున్నారు.

More Stories
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు ‘త్వరలోనే’
అణు విద్యుత్ ఉత్పాదక దేశాల సరసన బంగ్లాదేశ్
తీవ్రవాద వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడానికి సమిష్టి కృషి