నియోజకవర్గాల పునర్విభజన బిల్లులో దక్షిణాది రాష్ట్రాలకు 50 శాతం సీట్లు పెంపుపై కొందరు అనవసర దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీలో ఎన్డీయే కూటమి నేతలు నిర్థారించుకున్నారు. జనాభాతో సంబంధం లేకుండా దక్షిణాదికి రాజకీయంగా నష్టం లేకుండానే బిల్లు రూపొందిందని కేంద్ర పెద్దల నుంచి నేతలు ఈ మేర స్పష్టత తీసుకున్నారు.
బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జనసేన అధిపతి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావులతో సుమారు రెండున్నర గంటలపాటు సమావేశమయ్యారు.
అసెంబ్లీ స్థానాలను గుండుగుత్తగా 50 శాతం పెంచుతారనే స్పష్టత ఉన్నప్పటికీ, లోక్‌సభ స్థానాల విషయంలో సందేహాలున్నాయని, 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటే మనకు నష్టం జరిగే అవకాశముందనే అంశంపై చర్చించారు. దక్షిణాది రాష్ట్రాల్లో నెలకొన్న ఆందోళనలూ ప్రస్తావనకు వచ్చాయి. దీంతో చంద్రబాబు `ఇప్పుడే స్పష్టత తీసుకుందాం’ అంటూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు, కేంద్ర న్యాయ శాఖమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌లతో ఫోన్‌లో మాట్లాడారు.
లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచుతున్నట్లుగా బిల్లులో పొందుపరచకపోవడంతో నెలకొన్న సందిగ్ధత గురించి ప్రశ్నించారు. దీంతో అన్ని వివరాలను బిల్లులో పొందుపరచలేమని, అన్ని రాష్ట్రాల్లో పార్లమెంటు సీట్లు 50 శాతం పెరుగుతాయని ఇద్దరు కేంద్ర మంత్రులు స్పష్టం చేసినట్లు తెలిసింది. సభలో చర్చ సందర్భంగా ఈ విషయాన్ని పార్లమెంటు వేదికగానే ప్రభుత్వం ప్రకటిస్తుందని పేర్కొన్నట్లు సమాచారం. అనంతరం కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడులతో కూడా సీఎం ఫోన్‌లో మాట్లాడారు.
కేంద్ర మంత్రుల నుంచి స్పష్టత తీసుకున్న అనంతరం నేతలు బిల్లుపై సంతృప్తి వ్యక్తం చేశారు. 50శాతం నియోజకవర్గాల పెంపుతో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదని, దీనిని రాజకీయంగా కలిసి కట్టుగా స్వాగతించాలని ముగ్గురు నేతలు నిర్ణయించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత చేపట్టాల్సిన కార్యక్రమాలపైనా నేతలు చర్చించారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు కలసి కట్టుగా మద్దతు తెలిపేందుకు రావాలని వైఎస్సార్సీపీ సహా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించాలని నిర్ణయించారు. ఈ నెల 17న అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి అమరావతి వేదికగా మహిళా బిల్లును ప్రత్యక్షంగా వీక్షించే ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. ప్రజాప్రతినిధులతో పాటు మహిళా ప్రముఖుల్ని ఈ వేడుకకు ఆహ్వానించాలనే ఏకాభిప్రాయానికి నేతలు వచ్చారు.
జిల్లా, నియోజకవర్గాల స్థాయిలోనూ భారీ ఎత్తున కార్యక్రమాలు చేపట్టి మహిళా సోదరీమణులకు, ప్రధానికి ధన్యవాదాలు తెలపాలని నిర్ణయించారు. అన్ని నియోజకవర్గాల్లో లైవ్ స్ట్రీమింగ్లు ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. లోక్‌సభ స్థానాలకు జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటారనే వాదనలు వినిపించాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో రాష్ట్ర వాటా 4.08 శాతం. ఆ నిష్పత్తి ప్రకారం ఏపీకి వచ్చే లోక్‌సభ స్థానాలు 33 మాత్రమే. ఉత్తరాదితో పోల్చితే మనకు అన్యాయం జరుగుతుంది.
అయితే… జనాభా ప్రాతిపదికన కాకుండా, గుండుగుత్తగా 50 శాతం సీట్లు పెంచాలన్న కేంద్ర నిర్ణయం ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాలన్నింటికీ మేలు చేసేదే. దీని ప్రకారం… రాష్ట్రంలో లోక్‌సభ స్థానాల సంఖ్య ఇప్పుడున్న 25 నుంచి 37 లేదా 38కి చేరుతుందని భావిస్తున్నారు.
అదేవిధంగా, రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి 175 స్థానాలు, తెలంగాణకు 119 సీట్లు వెళ్లాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలను పెంచుతామని రాష్ట్ర విభజన చట్టంలోనే పేర్కొన్నారు. ఈ లెక్కన ఏపీలోని అసెంబ్లీ స్థానాల సంఖ్య 175 నుంచి 225కు పెరగాలి. ఇప్పుడు అసెంబ్లీ స్థానాలను గుండుగుత్తగా 50 శాతం పెంచనుండటంతో ఏపీలో నియోజకవర్గాలు 175 నుంచి ఒకేసారి 263కు చేరుకుంటాయి. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న 225 స్థానాలతో పోల్చితే ఇది చాలా ఎక్కువ.

More Stories
తెలంగాణ బీసీల్లో అత్యధికులు ముస్లింలే
దేశంలో మావోయిస్టు ప్రభావిత జిల్లాలు లేవు
నియోజకవర్గాల పునర్విభజనకు ఇండియా కూటమి వ్యతిరేకం