నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ఇండియా కూటమి వ్యతిరేకించినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. బుధవారం వామపక్షాల నేతలు సహా కాంగ్రెస్, డిఎంకె, టిఎంసి, సమాజ్ వాది పార్టీ, ఆర్జెడి నేతలు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో సమావేశమయ్యారు. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ఈ రెండు బిల్లులను ప్రభుత్వం గురువారం పార్లమెంట్ లు ప్రవేశపెట్టనుంది.
సమావేశం అనంతరం ఖర్గే మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై ఇండియా బ్లాక్ నేతల చర్చలు ముగిశాయని, ఈ బిల్లును వ్యతిరేకించాలని ఐక్యంగా నిర్ణయించారని తెలిపారు. 2010, 2013లలో కాంగ్రెస్ మద్దతుతో మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని గుర్తు చేశారు. ‘‘మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రతిపక్షాలు సానుకూలమే. కానీ, ఈ బిల్లును కేంద్రం తీసుకొస్తున్న విధానంలోనే మాకు అభ్యంతరాలున్నాయి. ఈ బిల్లు రాజకీయ ప్రేరేపితమైందిగా కనిపిస్తోంది. ప్రతిపక్షాల్ని అణచివేసేందుకే కేంద్రం ఈ పని చేస్తుంది. అయినప్పటికీ మేం ఈ బిల్లుకు మద్దతు ఇస్తూ వస్తున్నాం” అని ఖర్గే తెలిపారు.
“కానీ, గతంలో చేసిన మార్పుల్ని అమలు చేయాలని కోరాం. నియోజకవర్గాల పునర్విభజన అంశంలో కూడా కేంద్రం కొన్ని మెలికలు పెడుతోంది. ఈ అంశంపై అన్ని పార్టీలు పార్లమెంట్లో పోరాడుతాయి. ఈ బిల్లును వ్యతిరేకిస్తాం. కానీ, మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతిస్తాం” అని స్పష్టం చేశారు. “నియోజకవర్గాల పునర్విభజకు సంబంధించి జనాభా గణన అంశంపై స్పష్టత లేదు. రాజ్యాంగంలోని అన్ని హక్కుల్ని తీసేసుకుంటున్నారు. ఇప్పటికే అస్సాం, జమ్ము కాశ్మీర్లో ఈ విషయంలో మోసం చేశారు. ప్రతిపక్షంగా మేం ఐక్యంగా ఉన్నాం’’ అని ఖర్గే వెల్లడించారు.
లోక్ సభ సీట్లు 50 శాతం పెరుగుతాయని ఈ బిల్లులో పేర్కొన్నారని కాంగ్రెస్ కమ్యూనికేషన్ ప్రతినిధి జైరామ్ రమేష్ తెలిపారు. ప్రస్తుత నిష్పత్తిని కొనసాగిస్తూనే ప్రతి రాష్ట్రంలో సీట్ల సంఖ్యను ఏకరీతిన పెంచుతామని కేంద్రం హామీ ఇచ్చిందని చెప్పారు. అయితే రాష్ట్రాల దామాషా బలాన్నికొనసాగించేందుకు ఈ బిల్లులో ఎలాంటి నిబంధనలు లేవని, దీంతో అనేక రాష్ట్రాలు లోక్ సభలో తమ ప్రాతినిథ్యాన్ని కోల్పోతాయని అయన ఆందోళన వ్యక్తం చేశారు.
తాము నియోజకవర్గాల పునర్విభజన బిల్లుని వ్యతిరేకిస్తున్నామని చెబుతూ తాము ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని కాంగ్రెస్ నేత కె.సి.వేణుగోపాల్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఖర్గే, రాహుల్ గాంధీలతో పాటు డిఎంకె నుండి టి.ఆర్.బాలు, టిఎంసి నుండి సాగరిక ఘోష్, ఆర్జెడి నుండి తేజస్వీయాదవ్, శివసేన (యుబిటి) నేతలు సంజయ్ రౌత్, అరవింద్ సావంత్, ఎన్ సిపి (ఎస్ పి)నుండి సుప్రియా సూలేలు పాల్గొనగా, సమాజ్ వాది పార్టీ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ వర్చువల్ గా హాజరయ్యారు.

More Stories
సంస్కరణల పేరిట మతాన్ని నిర్వీర్యం చేయలేం
తెలంగాణ బీసీల్లో అత్యధికులు ముస్లింలే
దేశంలో మావోయిస్టు ప్రభావిత జిల్లాలు లేవు