నిక్కై ఎసియా నివేదిక ప్రకారం ఈ ఏడాది జనవరి 1 నుంచి ఏప్రిల్ 1 వరకు ప్రపంచ వ్యాప్తంగా 78,557 మంది టెక్ ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయారు. ఇందులో అమెరికా ఒక్కటే సుమారు 76.7 శాతం వాటా కలిగి ఉంది. అమెజాన్, ఒరాకిల్, మెటా, డెల్ వంటి ప్రముక కంపెనీలు ఈ ఉద్యోగ కోతలను ‘పునర్ వ్యవస్థీకరణ (రీకన్స్ట్రక్టింగ్)’, వ్యూహ మార్పులలో భాగంగా వివరిస్తున్నప్పటికీ ఈ మార్పుల వెనుక ఎఐ కీలక పాత్ర పోషిస్తోంది.
ఈ మొత్తం ఉద్యోగ కోతల్లో దాదాపు 37,638 ఉద్యోగాలు నేరుగా లేదా పరోక్షంగా ఎఐ ఆటోమేషన్ వల్ల జరిగాయని అంచనా. కాగ్నిజెంట్ సంస్థ చీఫ్ ఏఐ ఆఫీసర్ బాబక్ హెూడ్జత్ ప్రకారం ప్రస్తుతం జరుగుతోన్న ఉద్యోగ కోతలు ఎఐ నిజంగా సాధించిన ఫలితాల కంటే భవిష్యత్తులో అది సాధిస్తుందనే అంచనాల ఆధారంగా జరుగుతున్నాయి. ఇక కొన్ని సంస్థలు కరోనా తర్వాత అధికంగా నియామకాలు చేసిన కారణంగా కూడా ఉద్యోగులను తగ్గిస్తున్నా, ఈ కోతలకు ఎఐను ఒక కారణంగా చూపుతున్నట్టు ఆయన వివరించారు.
ఇక గోల్డ్మెన్ సచ్స్ నివేదిక ప్రకారం వచ్చే పదేండ్లలో ఏఐ కారణంగా అమెరికాలో 6-7 శాతం ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇది నిరుద్యోగాన్ని సుమారు 0.5 శాతం వరకు పెంచవచ్చు. ఎఐ వల్ల ఉద్యోగాలు కోల్పోయినవారికి దీర్ఘకాలిక ఆర్థిక ప్రభావం కూడా ఉంటుంది. వారి ఆదాయం సుమారు 3 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. అలాగే పదేండ్లలో వారి ఆదాయ వృద్ధి సుమారు పది శాతం వరకు వెనుకబడే ప్రమాదం కనబడుతోంది.
ప్రత్యేకించి జెన్-జెడ్ ఉద్యోగులు తక్కువ నైపుణ్యం ఉన్న పనుల్లోకి మారే అవకాశం ఉండటంతో వారి కెరీర్ పురోగతి నెమ్మదించవచ్చు. దీంతో జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు ఆలస్యమయ్యే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎఐ ఆధారిత మార్పులు టెక్ ఉద్యోగులను వణికిస్తూ ఆందోళన కలిగిస్తున్నయి. ప్రస్తుతం కనిపిస్తున్న ఉద్యోగ కోతలు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగులు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం అత్యంత కీలకంగా మారిందని వివరిస్తున్నారు.

More Stories
భారత్కు మూడు రెట్లు రష్యా చమురు దిగుమతులు
భారత్ ఇంధన భద్రతకు పొంచి ఉన్న ముప్పు
బొగ్గు కుంభకోణంలో ఐ-ప్యాక్ డైరెక్టర్ వినేష్ చందేల్ అరెస్ట్