నోయిడాలో హింసాత్మకంగా మారిన కార్మికుల నిరసనలు

నోయిడాలో హింసాత్మకంగా మారిన కార్మికుల నిరసనలు
* ఓ ప్రణాళికాబద్ధ కుట్రలో భాగమే ఈ అల్లర్లు!
దేశ రాజధాని న్యూఢిల్లీ ముంగిట ఉన్న నోయిడా కార్మికుల నిరసనలతో దద్దరిల్లింది. జీతాలు పెంచాలంటూ కార్మిక సంఘాలు చేపట్టిన ఆందోళన సోమవారం తీవ్రరూపం దాల్చింది. మూడురోజులుగా నోయిడా పారిశ్రామికవాడలో నిరసన చేస్తున్న కార్మికులంతా ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ వేలాది మంది కార్మికులు ఢిల్లీ-నోయిడా ప్రాంతంలోని వీధులు, రహదారుల్ని దిగ్బంధం చేశారు.
 
నిరసనకారులపై పోలీసుల లాఠీచార్జ్‌లు, పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వటం తదితర ఘటనలతో నోయిడా రణరంగంగా మారింది. ఆగ్రహానికి గురైన కార్మికులు పలు చోట్ల వాహనాలకు నిప్పుపెట్టారు. మరికొన్నింటిని ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ-నోయిడా సరిహద్దులో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  శాంతి, శ్రేయస్సు దిశగా రాష్ట్రం సాధిస్తున్న పురోగతికి ఆటంకం కలిగించే ప్రయత్నంలో కొందరు వ్యక్తులు అశాంతిని రెచ్చగొట్టడానికి కుట్ర పన్నుతున్నారని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. కార్మికులు శాంతంగా ఉండాలని, అటువంటి ప్రయత్నాలకు బలికావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. 

మంగళవారం కూడా నోయిడాలోని సెక్టార్-121, ఫేజ్ 2 ప్రాంతంలో కొనసాగుతున్న కార్మికుల నిరసనల సందర్భంగా తాజాగా హింస చెలరేగింది. ఈ దాడిలో పలువురు పోలీసు సిబ్బంది గాయపడ్డారు. నిరసనకారులు ఒక పోలీసు బస్సుపై దాడి చేసి, వాహనాన్ని తీవ్రంగా ధ్వంసం చేసినట్లు సమాచారం. సెక్టార్-70, 71, 80లలో కూడా కార్మికులు పోలీసు సిబ్బందితో ఘర్షణ పడ్డారు. ఆ ప్రాంతంలో భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని రాళ్ల దాడి కొనసాగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘర్షణల్లో గాయపడిన వారిలో పలువురు మహిళా పోలీసు అధికారులు కూడా ఉన్నారు.

గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో తీవ్రమవుతున్న పారిశ్రామిక అశాంతిని పరిష్కరించేందుకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నారు. కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించడం, సాధారణ పరిస్థితులను పునరుద్ధరించడం, సంబంధిత వర్గాలన్నిటితో సమర్థవంతమైన సంప్రదింపుల ద్వారా పారిశ్రామిక సామరస్యం, ప్రజా శాంతిభద్రతలను నిర్ధారించడం లక్ష్యంగా రాష్ట్ర కార్మిక శాఖ చర్యలు తీసుకుంటోంది.
 
కాగా, నోయిడా హింసాకాండలో అల్లర్లు ఆకస్మికంగా జరిగినవి కావని, ఇది ఒక ప్రణాళికాబద్ధమైన కుట్రలో భాగమని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అందిన సమాచారం ప్రకారం, పోలీసులు సుమారు 300 మందిని ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా అదుపులోకి తీసుకుని, జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. అదుపులోకి తీసుకున్న వారిలో చాలామంది హింసాత్మక ప్రదర్శనలలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు తేలింది. 
 
తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడంలో, అశాంతిని రెచ్చగొట్టడంలో పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అనేక వాట్సాప్ గ్రూపులపై దర్యాప్తు అధికారులు విచారణ ప్రారంభించారు. కార్మికుల నిరసన సమయంలో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నించిన వారిని గుర్తించడానికి సైబర్ బృందం చాట్‌లు, డిజిటల్ ఫుట్‌ప్రింట్‌లను విశ్లేషిస్తోంది. 
 
హింసను ప్రేరేపించడానికి కార్మికుల మధ్య చొప్పించిన కార్మికులు కానివారు హింసాకాండ సమయంలో అరెస్టు అయిన వారిలో చాలామంది అసలు కార్మికులే కాదని ఆ వర్గాలు వెల్లడించాయి. ఆందోళనను తీవ్రతరం చేసే కుట్రలో భాగంగా వారిని కార్మికుల మధ్య “చొప్పించినట్లు” ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యక్తులు రాళ్ల దాడి, విధ్వంసం, ఇతర హింసాత్మక చర్యలలో పాల్గొన్నారని వారు తెలిపారు. 
 
వాహనాలకు నిప్పు పెట్టడానికి ప్రత్యక్షంగా బాధ్యులని భావిస్తున్న ఐదు నుంచి ఆరుగురు అనుమానితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అగ్నిప్రమాదం అత్యంత వ్యవస్థీకృతంగా జరిగిందని, ఈ అశాంతి వెనుక ఒక పెద్ద కుట్ర ఉందని అధికారులు తెలిపారు. ప్రాథమిక పరిశోధనల ప్రకారం, అతివాద వామపక్ష శక్తులు కార్మికుల నిరసనలోకి చొరబడి, దానిని హింసాత్మకంగా మార్చాయని తెలుస్తోంది. 
 
వీరే గుంపును రెచ్చగొట్టడం, పోలీసు సిబ్బందిపై దాడి చేయడం, ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేయడం వంటి చర్యలకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఈ పారిశ్రామిక కేంద్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే లక్ష్యంతో ఒక పెద్ద కుట్ర జరిగినట్లు బలమైన ఆధారాలు లభించాయని అధికారులు తెలిపారు. ఈ అశాంతి వెనుక ఉన్న సూత్రధారులను గుర్తించేందుకు తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని వారు తెలిపారు. 

కార్మికుల ఆందోళనతో నోయిడా అంతటా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రద్దీగా ఉండే డీఎన్‌డీ ఫ్లైఓవర్‌తో సహా కీలకమైన ప్రధాన మార్గాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. రహదారులపై ఎక్కడి వాహనాలు అక్కడే గంటల కొద్దీ నిలిచిపోయాయి. నోయిడా లింక్‌ రోడ్‌ను నిరసనకారులు దిగ్బంధించారు. నోయిడా ఫేజ్‌-2 ప్రాంతంలో ముఖ్యంగా సెక్టార్‌-1, సెక్టార్‌-84లో ఆందోళనలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఢిల్లీ, నోయిడా నుంచి పోలీస్‌ బలగాలను తరలించాల్సి వచ్చింది. గౌతమ్‌ బుద్ధనగర్‌ కమిషనరేట్‌ పరిధి పారిశ్రామిక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.