నారీ శక్తి వందన్ అభినియం చట్టం రూపకల్పన 21వ శతాబ్ధంలోనే అత్యంత కీలకమైన అంశమని పేర్కొంటూ కొత్త చరిత్ర సృష్టించేందుకు పార్లమెంట్ వేదిక కానున్నదని, గత విజన్‌ను దృష్టిలో పెట్టుకుని, భవిష్యత్తు ఆశయాలను తీర్చనున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఢిల్లీలో జరుగుతున్న నారీ శక్తి వందన సమ్మేళనం కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ మహిళా సాధికారత చట్టాన్ని 2029 నాటి వరకు అమలు చేయాలని డిమాండ్లు వస్తున్నట్లు ప్రధాని చెప్పారు.
అందుకనే 2029 డెడ్‌లైన్‌ను దృష్టిలో పెట్టుకున్నామని, దీనిలో భాగంగానే ఏప్రిల్ 16వ తేదీ నుంచి మహిళా సాధికారత చట్టం గురించి పార్లమెంట్లో చర్చించనున్నట్లు ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరి కృషిని దృష్టిలో పెట్టుకుని మహిళా సాధికార బిల్లుకు ఆమోదం జరిగేలా చూడాలని ప్రధాని కోరారు. దేశంలోని ప్రతి మహిళ సంతోషపడుతుందని, ప్రతి మహిళకు లబ్ధి చేకూరుతుందని ఆయన స్పష్టం చేశారు.
మహిళల ప్రాతినిధ్యం పెరగడం ద్వారా ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందని మోదీ చెబుతూ సామాజిక న్యాయం కేవలం నినాదంగా కాకుండా, పాలనలో సహజ భాగంగా మారాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. ఈ బిల్లు ఆ దిశగా ఒక పెద్ద అడుగు అవుతుందని తెలిపారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో మహిళల పాత్రను ఉదాహరణగా చూపిస్తూ, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లక్షలాది మహిళలు స్థానిక సంస్థల్లో సమర్థవంతంగా పనిచేస్తున్నారని చెప్పారు.
సుమారు 14 లక్షలకుపైగా మహిళలు స్థానిక సంస్థల్లో సేవలందిస్తున్నారని, కొన్ని రాష్ట్రాల్లో వారి ప్రాతినిధ్యం 50 శాతానికి చేరుకుందని వివరించారు. మన దేశంలో పంచాయతీ రాజ్ వ్యవస్థలన్నీ మహిళల నాయకత్వానికి అసాధారణ వేదికలయ్యాయని ప్రధాని గుర్తు చేశారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న మహిళా రిజర్వేషన్ అంశంపై ఇప్పుడు స్పష్టమైన ముందడుగు పడబోతోందని పేర్కొన్నారు.
“ఇది కేవలం ఒక బిల్లు కాదు. మహిళల శక్తికి అంకితమైన నిర్ణయం. దేశ భవిష్యత్తు సంకల్పాలను నెరవేర్చే దిశగా ఇది కీలకమైన అడుగు” అని తెలిపారు. మహిళా రిజర్వేషన్ అవసరం దాదాపు నాలుగు దశాబ్దాలుగా చర్చలో ఉందని, అన్ని రాజకీయ పార్టీలూ తమ తమ స్థాయిలో ఈ అంశాన్ని ముందుకు తీసుకువచ్చాయని మోదీ గుర్తు చేశారు.
ప్రసంగాలతో చైతన్యపరచడానికి ఇక్కడకు రాలేదని, ఈ దేశ మహిళల ఆశీర్వాదం తీసుకునేందుకు ఇక్కడకు వచ్చినట్లు ప్రధాని చెప్పారు. భారతీయ మహిళలు ఈ దేశానికి ఎంతో మేలు చేశారని పేర్కొంటూ ప్రజాస్వామ్య విధానంలో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని కొన్ని దశాబ్ధాలుగా అందరూ అనుకున్నారని, 2023లో నారీశక్తి వందన్ అభినియం బిల్లును అన్ని పార్టీలు ఏకపక్షంగా ఆమోదించాయని ఆయన పేర్కొన్నారు.
2029 నాటికి మహిళా కోటా బిల్లును అమలు చేయాలన్న అభిప్రాయాన్ని ప్రతిపక్షంగా గట్టిగా గతంలో వ్యక్తం చేసిందని, ఆ బిల్లుపై సుదీర్ఘమైన రీతిలో చర్చలు జరగాలని, సహకారం, భాగస్వామ్యం కూడా ఉండాలని ప్రధాని మోదీ తెలిపారు. నిర్ణయాత్మక అంశాల్లో మహిళ భాగస్వామ్యం పెరిగితే, వ్యవస్థలో మార్పు వేగంగా ఉంటుందని అధ్యయనాలు వెల్లడించినట్లు ఆయన పేర్కొన్నారు. జల జీవన్ మిషన్‌లో మహిళల పాత్ర ప్రశంసనీయమని ఆయన కొనియాడారు.

More Stories
కాంగ్రెస్ నేత పవన్ ఖేరాపై సుప్రీంకు అస్సాం ప్రభుత్వం
మోస్ట్‌వాంటెడ్ మహిళా మావోయిస్టు రూపీ మృతి
మావోయిస్టుల నిష్క్రమణతో ఛత్తీస్‌గఢ్ అడవుల్లో ఉషోదయం