ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నక్సల్ ప్రభావిత కాంకేర్ జిల్లాలో భద్రతా బలగాలు భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. చోటే బెటియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు ఈ ఆపరేషన్ చేపట్టాయి. ఈ సందర్భంగా మావోయిస్టులు తారసపడటంతో భీకర ఎదురుకాల్పులు జరిగాయి.
ఈ ఎన్కౌంటర్ లో పార్థాపూర్ ఏరియా కమాండర్, మోస్ట్ వాంటెడ్ మావో నేత ‘రూపి’ అలియాస్ రంగబోయిన భాగ్య మృతి చెందారు. ప్రభుత్వం ఆమెపై గతంలో రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది. కాగా ఈ ఎన్కౌంటర్లో మరణించిన రూపి 2025లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టు అగ్రనేత విజయ్ రెడ్డి భార్య. ఎన్కౌంటర్ అనంతరం ఘటనా స్థలం నుంచి ఒక ఆటోమెటిక్ తుపాకీతోపాటు విప్లవ సాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు కాంకేర్ జిల్లా ఎస్పీ నిఖిల్ రాఖేచా వెల్లడించారు.
కాల్పుల అనంతరం మరో 10 మంది మావోయిస్టులు తప్పించుకున్నారు. వారి కోసం మాచ్పల్లి అడవుల్లో గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశారు.బస్తర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్రాజ్ పట్టిలింగం, ఈ ఎన్కౌంటర్ను మావోయిస్టు నెట్వర్క్లపై నిరంతరం కొనసాగిస్తున్న ఒత్తిడి ఫలితంగా అభివర్ణించారు.
“మావోయిస్టు కార్యకర్తలకు లొంగిపోయి, తమ జీవితాలను పునర్నిర్మించుకునే అవకాశాన్ని ప్రభుత్వం నిరంతరం కల్పిస్తూనే ఉంది. చాలామంది ఆ మార్గాన్ని ఎంచుకున్నారు. కానీ హింసా మార్గంలోనే కొనసాగేవారు మాత్రం ఇటువంటి పర్యవసానాన్నే ఎదుర్కొంటున్నారు,” అని ఆయన పేర్కొన్నారు. అడవుల్లో ఉన్న మావోయిస్టులకు సమయం చాలా తక్కువగా ఉందని, ఇప్పటికైనా ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని హెచ్చరించారు. హింసా మార్గాన్ని వీడి గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని సూచించారు.
హతమైన రూపి స్వస్థలం తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంగా గుర్తించారు. ఆమె వయసు 46 సంవత్పరాలు. 2004లో మావోయిస్టు పార్టీలో చేరిన ఆమె తొలుత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేశారు. ఆ తర్వాత అబూజ్మడ్ వంటి కఠినమైన ప్రాంతాల్లో విధులు నిర్వహించారు.
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన క్రియాశీల మావోయిస్టుల జాబితాలో కూడా రూపి పేరు ఉంది. గతంలో లొంగిపోవాలని పోలీసులు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఆమె తన సాయుధ పోరాటాన్నే కొనసాగించారు. కీలకమైన ఏరియా కమాండర్ మరణించడంతో మావోయిస్టు నెట్వర్క్కు తీరని లోటు అని భద్రతా దళాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో అదనపు బలగాలతో వేట కొనసాగుతోంది.
కాంకేర్ ప్రాంతంలో సుమారు పది మంది మావోయిస్టు కార్యకర్తలు ఇంకా చురుకుగా ఉన్నారని భద్రతా అధికారులు అంచనా వేస్తున్నారు. మిగిలిన కార్యకర్తల ఆచూకీ కనుగొనేందుకు భద్రతా దళాలు చుట్టుపక్కల అడవుల్లో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.

More Stories
కొత్త చరిత్ర సృష్టించేందుకు వేదిక కానున్న పార్లమెంట్
కాంగ్రెస్ నేత పవన్ ఖేరాపై సుప్రీంకు అస్సాం ప్రభుత్వం
మావోయిస్టుల నిష్క్రమణతో ఛత్తీస్గఢ్ అడవుల్లో ఉషోదయం