* హార్ముజ్ జలసంధి దిగ్బంధనంకై ట్రంప్ ఆదేశం.. అది సుడిగుండమే అంటూ ఇరాన్ హెచ్చరిక
పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో ఇస్లామాబాద్‌లో శనివారం (ఏప్రిల్ 11) జరిగిన అమెరికాఇరాన్ శాంతి చర్చలు 21 గంటలపాటు కొనసాగినప్పటికీ ఎటువంటి నిర్ణయానికి రాలేకపోయాయి. అణు కార్యక్రమం, హార్మూజ్ జలసంధి, ఆంక్షలు, ఆస్తుల విడుదల వంటి కీలక అంశాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ చర్చలు విఫలమైనట్టు స్పష్టమవుతోంది.
ఈలోగా, వ్యూహాత్మకంగా కీలకమైన హోర్ముజ్ జలసంధిని లక్ష్యంగా చేసుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నావికా దిగ్బంధన ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో, ఇరాన్ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. ఈ కీలకమైన సముద్ర మార్గంపై తమ బలగాలకు పూర్తి నియంత్రణ ఉందని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) పేర్కొంది. ఎలాంటి శత్రు చర్య అయినా ప్రత్యర్థులను “ప్రాణాంతక సుడిగుండం”గా అభివర్ణించే దానిలో చిక్కుకునేలా చేస్తుందని హెచ్చరించింది.
ఎక్స్ లో పర్షియన్ భాషలో పెట్టిన ఒక పోస్ట్‌లో, జలసంధిలోని రాకపోకలన్నింటినీ ఇరాన్ సాయుధ దళాలు నిశితంగా పర్యవేక్షిస్తూ, నియంత్రిస్తున్నాయని ఐఆర్‌జీసీ నావికాదళ కమాండ్ స్పష్టం చేసింది. “అన్ని రాకపోకలు… సాయుధ దళాల పూర్తి నియంత్రణలో ఉన్నాయి,” అని అది పేర్కొంది. అమెరికా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ, తమ బృందం చివరి, ఉత్తమ ప్రతిపాదనను సమర్పించిన తర్వాత చర్చల నుంచి నిష్క్రమించిందని తెలిపారు.
21 గంటలపాటు జరిగిన రహస్య చర్చల వివరాలను వెల్లడించడానికి వాన్స్ నిరాకరించినప్పటికీ, ప్రధాన విభేదం అణ్వాయుధాల అంశంపైనేనని స్పష్టం చేశారు. ఇరాన్ లోని యురేనియం శుద్ధి కేంద్రాలు ఇప్పటికే ధ్వంసమయ్యాయని అంటూనే ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని విరమించడానికి సిద్ధంగా లేకపోవడమే చర్చల విఫలం కావడానికి ప్రధాన కారణమని వాన్స్ తెలపడం గమనార్హం.
ఇరాన్ మాత్రం తాము అణుబాంబు తయారీ ప్రయత్నాలు చేయడం లేదని స్పష్టం చేస్తున్నా తమకు ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయదనే స్పష్టమైన హామీ కావాలని పట్టుబట్టడం గమనిస్తుంటే ఇరాన్ చెప్పినట్లు యుద్ధం ద్వారా సాధింపలేని అంశాలను చర్చల ద్వా రా సాధించాలని అమెరికా ప్రయత్నిస్తున్నట్లు అవుతుంది. ఈ యుద్ధాన్ని ముగించేందుకు చేసిన శాంతి చర్చలు విఫలం కావడానికి ఇరాన్ అణు ఆశయాలే ప్రధాన కారణమని డోనాల్డ్ ట్రంప్ సహితం మండిపడ్డారు.
ఇస్లామాబాద్ చర్చల్లో అనేక అంశాలపై ఏకాభిప్రాయం కుదిరినా అణు కార్యక్రమాన్ని విడిచిపెట్టేందుకు ఇరాన్ సిద్ధంగా లేకపోవడం వల్లే ఒప్పందం కుదరలేదని ట్రంప్ వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ చేతికి అణ్వాయుధాలు చిక్కనివ్వనని ట్రంప్ తేల్చిచెప్పారు. ప్రమాదకరమైన వ్యక్తుల చేతుల్లో అణుశక్తి ఉండటానికి అంగీకరించలేమని స్పష్టం చేశారు.
ఇరాన్ వార్తా సంస్థ ప్రెస్ టీవీ ప్రకారం, హార్మూజ్ జలసంధి నియంత్రణ సహా పలు అంశాలు రెండు దేశాల మధ్య విభేదాలకు కారణమయ్యాయి.
చర్చల్లో అమెరికా ఇరాన్ విశ్వాసాన్ని పొందడంలో విఫలమైందని ఇరాన్ బృందానికి నాయకత్వం వహించిన పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘర్ ఘాలిబాఫ్ తెలిపారు. తమ బృందం ముందుచూపుతో కూడిన ప్రతిపాదనలు చేసిందని, అయితే ఈ చర్చల దశలో ప్రత్యర్థి పక్షం తమ విశ్వాసాన్ని సంపాదించలేకపోయింది అని పేర్కొన్నారు. చర్చలకు ముందు తాము సత్సంకల్పంతో ముందుకు వచ్చామని, కానీ గత రెండు యుద్ధ అనుభవాల కారణంగా అమెరికాపై విశ్వాసం లేకపోయిందని ఘాలిబాఫ్ స్పష్టం చేశారు.
మరోవంక, హర్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలను అడ్డుకునేలా తక్షణమే సముద్ర దిగ్బంధనాన్ని ప్రారంభించాలని అమెరికా నౌకాదళాన్ని ట్రంప్ ఆదేశించారు. ఈ కీలక జలమార్గంపై వ్యూహాత్మక నియంత్రణ సాధించడం ద్వారా, ఇరాన్ ఆర్థిక వనరులను, వారికున్న ప్రధాన బలాన్ని పూర్తిగా దెబ్బతీయాలని ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ జలాల్లో ఇరాన్‌కు సుంకం చెల్లించిన ప్రతి నౌకను వెంబడించి అడ్డుకోవాలని తమ నౌకాదళానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు ట్రంప్ వెల్లడించారు.
‘‘హార్ముజ్ జలసంధిని దిగ్బంధించాలని యూఎస్ నేవీని ఆదేశించా. ఈ మార్గంలో వెళ్లే నౌకల్ని అడ్డుకుంటాం. ఈ జలసంధి నుంచి వెళ్లే, వచ్చే నౌకల్ని యూఎస్ నేవీ అడ్డుకుంటుంది. ఇరాన్ అన్ని షరతులకు అంగీకరించింది. ఒక్క అణు ఒప్పందం అంశంలో మాత్రమే అంగీకరించడం లేదు. అణు కార్యక్రమాల్ని ఆపేసేందుకు ఇరాన్ సిద్ధంగా లేదు. ప్రమాదకరమైన దేశం వద్ద అణ్వాయుధం ఉండటానికి వీల్లేదు. ఆ దేశం ఎప్పటికీ అణ్వాయుధాన్ని సాధించలేదు. సరైన సమయంలో ఇరాన్‌ను అంతం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం” అని ట్రంప్ ప్రకటించారు.

More Stories
మావోయిస్టుల నిష్క్రమణతో ఛత్తీస్‌గఢ్ అడవుల్లో ఉషోదయం
సైబరాబాద్, మల్కాజిగిరి కార్పోరేషన్లకు రూ 500 కోట్లు ఏమైన్నట్లు!
సౌదీకి 13 వేల మంది పాక్ సైనికులు, యుద్ధ విమానాలు