ఆలయాల్లో కొందరికే అనుమతిస్తే హిందూమతంకే నష్టం 

* కొన్ని ఆలయాల్లో పురుషులకూ ప్రవేశం లేదు

ఆలయాలు, మఠాల్లోకి అందరికీ ప్రవేశం ఉండాలని, కొన్ని వర్గాలకే అనుమతి ఇచ్చి మరికొన్ని వర్గాలను నిరాకరించటం వల్ల హిందూమతంపై ప్రతికూల ప్రభావం పడుతుందని, సమాజంలో చీలికలు వస్తాయని సుప్రీంకోర్టు పేర్కొంది. శబరిమలతోపాటు దేశంలోని కొన్ని ఆలయాల్లో మహిళలకు ప్రవేశంపై ఉన్న ఆంక్షలకు సంబంధించి దాఖలైన పిటిషన్ల మీద 9 మంది సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణను గురువారం కొనసాగించింది. 
 
అయ్యప్ప సేవా సమాజం, నాయర్‌ సేవా సమాజం, క్షేత్ర సంరక్షణసమితి తరఫున సీనియ ర్‌ న్యాయవాది వైద్యనాథన్‌ వాదనలు వినిపిస్తూ కొన్నివర్గాల కోసం ఉన్న ఆలయాలు ఆ వర్గాలకే అనుమతి ఇస్తాయని స్పష్టం చేశారు.  ఈ సందర్భంగా ధర్మాసనంలో ఒకరైన జస్టిస్‌ నాగరత్న స్పందిస్తూ ‘ఏ ఆలయంలోనైనా, మఠంలోనైనా ఏదో ఒక వర్గానికే అనుమతి ఉందని, ఇతరులకు లేదని, ఇది ఆ ఆలయం, మఠం సంప్రదాయంలో భాగమని ఎవరైనా చెబితే అది హిందూ మతానికి మంచిది కాదు. అనుమతి ఉన్న ఆ ప్రత్యేక వర్గానికి కూడా ఇది నష్టదాయకంగా పరిణమిస్తుంది’ అని తెలిపారు. 
 
1957లో ‘వెంకటరమణ దేవరు, మైసూరు రాష్ట్రం’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్‌ నాగరత్న ప్రస్తావించారు. కర్ణాటకలోని వెంకటరమణ దేవరు ఆలయంలోకి గౌడ సారస్వత బ్రాహ్మణులకు తప్ప ఇతరులెవరికీ అనుమతి ఉండేది కాదు. ఈ ఆచారాన్ని సుప్రీంకోర్టు పక్కనపెట్టి హిందువులు అందరికీ ప్రవేశం కల్పిస్తూ నాడు తీర్పు చెప్పిందని గుర్తు చేస్తూ  ఆలయాల్లోకి అందరికీ ప్రవేశం ఉండాలని పేర్కొన్నారు. ఈ అభిప్రాయంతో జస్టిస్‌ అరవింద్‌కుమార్‌ ఏకీభవించారు.

కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు కొనసాగిస్తూ శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై ఎలాంటి నిబంధన ఉందో, కేరళలోని కొన్ని దేవాలయాల్లో పురుషుల ప్రవేశంపైనా నిషేధముందని తెలిపారు. శబరిమల ఆలయంలో ప్రవేశంపై ఆంక్షల్ని కేవలం లింగబేధంతో చూడరాదని వాదించారు. 

పురుషులను అనుమతించని, ఆంక్షలతో మాత్రమే అనుమతించే ఆలయాల గురించి చెబుతూ కేరళలోని అట్టుకల్‌ భగవతి, చక్కులతుకవు, కొట్టన్‌కులంగర శ్రీదేవి ఆలయాలు, పుష్కర్‌లోని బ్రహ్మ ఆలయం, కన్యాకుమారిలోని భాగవతి అమ్మన్‌ ఆలయం, బిహార్‌ ముజఫర్‌పూర్‌లోని మాతా ఆలయం, అసోంలోని కామరూప కామాఖ్య ఆలయాల్లో అమలవుతున్న సంప్రదాయాలను వివరించారు.

హిందూమతం మహిళలకు పురుషులతో సమానస్థాయి మాత్రమే కాదు, అంతకంటే గౌరవనీయమైన స్థానం ఇచ్చిందని, చారిత్రకపూర్వ కాలం నుంచి కూడా స్త్రీత్వాన్ని పూజించే సంప్రదాయం ఉందని తెలిపారు. స్త్రీ దేవతల్ని పూజించి, వారికి పురుషులు కూడా భక్తులుగా మారే సంప్రదాయం హిందూమతంలో తప్ప ప్రపంచంలో మరెక్కడా లేదని చెప్పారు. 

About The Author