హామీలు అమలు చేశాకే గూగుల్ డేటా సెంటర్ పనులు చేపట్టాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు. నష్టపరిహారం చెల్లింపు, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా పనులు చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన కోసం నిర్వహిస్తున్న పనులను నిర్వాసిత రైతులు గురువారం అడ్డుకున్నారు.
బంజరు భూముల పథకం కింద గ్రామానికి చెందిన సుమారు 580 మందికి ప్రభుత్వం పాస్‌పుస్తకాలు మంజూరు చేసిందని, ఆ భూముల్లో జీడి, మామిడి తోటలు సాగు చేస్తూ జీవనోపాధి పొందుతున్నామని తెలిపారు. ఇప్పుడు ఈ భూములను గూగుల్ డేటా సెంటర్ నిర్మాణం కోసం స్వాధీనం చేసుకుంటున్నా ఇప్పటివరకు నష్టపరిహారం చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
నష్టపరిహారం ఇస్తామని స్థానిక నాయకులు, ఎమ్మెల్యే హామీ ఇచ్చారని, ఉడా లేఅవుట్ ద్వారా ప్రతి రైతుకూ మూడు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఇప్పటివరకు ఏవేవీ అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి పరిహారం చెల్లించిన తర్వాతే పనులు కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో డేటా సెంటర్ శంకుస్థాపన జరగనివ్వబోమని హెచ్చరించారు. రైతుల ఆందోళనతో కొంతసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.
సమాచారం అందుకున్న తహశీల్దార్ శ్రీనుబాబు, సిఐ వాసునాయుడు పోలీసు సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. రైతులతో చర్చలు జరిపారు. వారి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పనులు రెండు రోజులు ఆపుతామని ప్రకటించడంతో రైతులు ఆందోళన విరమించారు. గూగుల్ డేటా సెంటర్‌కు ఈ నెల 28న శంకుస్థాపన చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పనులను అధికారులు అక్కడ చేపట్టారు.

More Stories
ఎండ తీవ్రత, పిడుగులతో కూడిన అకాల వర్షాలు
అమరావతిలో రూ.2,534 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్
ఆంధ్ర తీరంలో తమిళనాడు బోట్ల ఆగడాలు