ఎపిలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్న నేపధ్యంలో ఎండ తీవ్రత, పిడుగులతో కూడిన అకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. తెలంగాణ, రాయలసీమ, అంతర తమిళనాడు మీదుగా మన్నార్ వరకు ద్రోణి కొనసాగుతుందని తెలిపారు. దీని ప్రభావంతో గురువారం కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు, పశు కాపరులు చెట్ల కింద నిలబడకూడదని హెచ్చరించారు. మరోవైపు రాయలసీమ జిల్లాల్లో ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పారు. ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఉదయం ఎండలు, సాయంత్రం సమయంలో ఉరుములతో కూడిన జల్లులు పడతాయని తెలిపారు. ఒక్కో ప్రాంతంలో భారీగా పిడుగులు పడతాయని పేర్కొన్నారు. రాబోయే మూడు రోజులు పాటు ఇదే పరిస్థితి ఉంటుందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులు తెలుపుతామని వివరించారు. కాగా, తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి.
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సూర్యుడు మండిపోతున్నాడు. దీంతో జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. రెండు ఆవర్తన ద్రోణుల ప్రభావంతో వచ్చే వారంపాటు పొడి వాతావరణం నెలకొంటుందని తెలిపింది. బుధవారం రాష్ట్రంలోని 20 జిల్లాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది.
దీంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్జ్ జారీ చేసినట్టు తెలిపింది. వచ్చే మూడ్రోజులు ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరుగుతాయని వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే అన్ని జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వివరించింది. ప్రజలు బయటకు వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

More Stories
అమరావతిలో రూ.2,534 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్
ఆంధ్ర తీరంలో తమిళనాడు బోట్ల ఆగడాలు
అమరావతే రాజధాని.. చట్టబద్ధ రక్షణ ప్రక్రియ సంపూర్ణం