అపస్మారక స్థితిలో ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా

అపస్మారక స్థితిలో ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా
ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖ‌మేనీ స్పృహ‌లో లేన‌ట్లు తెలిసింది. తీవ్ర‌మైన వైద్య స‌మ‌స్య‌తో ఆయ‌న ఇబ్బందిప‌డుతున్నాడు.  ఇరాన్ మతపరమైన రాజధానిగా పిలవబడే పవిత్ర నగరం కోమ్‌లో అత్యంత రహస్యంగా చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అలాగే ఆయన ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోలేని స్థితిలో ఉన్నట్లు  ద టైమ్స్ క‌థ‌నంలో పేర్కొన్నారు. దేశాన్ని ఆయ‌న పాలించ‌లేక‌పోతున్న‌ట్లు ఆ కధనంలో చెప్పారు. ఇంటెలిజెన్స్ అంచ‌నాల ప్ర‌కారం మొజ్తాబాకు ర‌హ‌స్య చికిత్స జ‌రుగుతున్న‌ట్లు తెలిసింది. 
 
కోమ్ న‌గ‌రంలో మొజ్తాబాకు చికిత్స అందిస్తున్న విష‌యాన్ని తొలిసారి ఇరాన్ బ‌హిరంగంగా అంగీక‌రించింది. తీవ్ర అస్వ‌స్థ‌త‌తో ఉన్న మొజ్తాబా ప్ర‌భుత్వ నిర్ణ‌యాల్లో పాలుపంచుకోవ‌డం లేద‌ని ఆ కధనంలో చెప్పారు. మొజ్తాబా ఆరోగ్య ప‌రిస్థితిపై అమెరికా-ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్‌తో పాటు గ‌ల్ఫ్ దేశాల ప్ర‌తినిధుల‌కు కూడా స‌మాచారాన్ని చేర‌వేశారు. 
కాళ్లు విరగాయని అలాగే ముఖానికి తీవ్ర గాయాలు అయ్యాయని కొందరు చెబుతుంటే.. ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని మరికొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి.
ఫిబ్ర‌వ‌రి 29వ తేదీన జ‌రిగిన దాడిలో మొజ్తాబా తండ్రి అయ‌తుల్లా అలీ ఖ‌మేనీ హ‌త‌మైన విష‌యం తెలిసిందే. అయితే ఆ దాడిలోనే మొజ్తాబా కూడా గాయ‌ప‌డ్డారు. కానీ చాన్నాళ్ల నుంచి అత‌ని లొకేష‌న్ బ‌హిర్గ‌తం కాలేదు. అత‌ను కోమ్ పట్ట‌ణంలో ఉన్న‌ట్లు మొద‌టిసారి సంకేతాలు అందాయి.  
పవిత్ర నగరం కోమ్‌లో అలీ ఖమేనీ అంత్యక్రియల కోసం భారీ సమాధి నిర్మాణ పనులు జరుగుతున్నట్లు శాటిలైట్ సమాచారం ద్వారా తెలుస్తోంది.  ఇక్కడ విశేషం ఏమిటంటే.. కేవలం ఒక్కరి కోసమే కాకుండా ఒకటి కంటే ఎక్కువ సమాధుల కోసం స్థలాన్ని సిద్ధం చేస్తున్నారట. అదే దాడిలో  మొజ్తాబా తల్లి, భార్య, ఒక కుమారుడు కూడా  మరణించారు. ఇప్పుడు మోజ్తబా పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో ఆయనను కూడా అక్కడే ఖననం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
 
ఇరాన్ అధికారులు మాత్రం తమ సుప్రీం లీడర్ క్షేమంగా ఉన్నారని.. దేశ బాధ్యతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారని నొక్కి చెబుతున్నారు. అయితే వాస్తవ పరిస్థితులు దానికి భిన్నంగా ఉండటంతో ఇరాన్ నాయకత్వంలో గందరగోళం నెలకొంది.