* తెలంగాణ ప్రజలకు బిజెపి అధ్యక్షుడు నబిన్ శుభాకాంక్షలు
హైదరాబాద్‌లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బిజెపి జాతీయ నాయకులు మురళీధర్ రావు, శాసన మండలి బిజెపి ఫ్లోర్ లీడర్ ఏవీఎన్ రెడ్డి, ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, బిజెపి రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, ఇతర ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కోట్లాది మంది కార్యకర్తల నిస్వార్థ త్యాగం, అంకితభావం వల్లే బిజెపి నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ శక్తిగా ఎదిగిందని, అందుకు కృషిచేసిన ప్రతి కార్యకర్తకు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలని రాంచందర్ రావు తెలిపారు. ఇది కేవలం సంబరాలు చేసుకునే రోజు మాత్రమే కాదని, దేశమే ప్రథమం అనే సిద్ధాంతం పట్ల నిబద్ధతను చాటుకునే గర్వకారణమైన రోజని ఆయన పేర్కొన్నారు.
సామాన్య కార్యకర్తలే బలగంగా, దేశ హితమే పరమావధిగా ప్రారంభమైన బిజెపి నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ శక్తిగా ఎదిగిందని చెప్పారు. నాడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్‌పేయి వంటి మహనీయులు వేసిన పునాదులపై నేడు పార్టీ అప్రతిహతంగా దూసుకుపోతోందని తెలిపారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ప్రజల గొంతుకగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపిచ్చారు. ప్రధాని మోదీ గారి నాయకత్వంలో దృఢమైన, స్వయం సమృద్ధమైన ‘వికసిత్ భారత్’ నిర్మాణంలో ప్రతి కార్యకర్త భాగస్వామి కావాలని కోరారు.
కాగా, బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు కు ఫోన్ చేసి బిజెపి పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, కార్యకర్తలకు బిజెపి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. బిజెపి తెలంగాణ రాష్ట్రంలో బలోపేతమై రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలని పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజల వద్దకు వెళ్లి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.
తెలంగాణలో బిజెపి ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని, రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తుందన్న ఆశాభావం జాతీయ పార్టీకి ఉందని ఆయన తెలిపారు కార్యకర్తలు నాయకులు ప్రజలతో సమిష్టిగా పనిచేస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

More Stories
తారామతిలో బాలీవుడ్ నటుడితో పాటు ఓ జంటకు పాజిటివ్
పదవులకోసం పార్టీ మారే వ్యక్తిని కాదు
మున్సిపల్ ఛైర్మన్గా బిజెపి అభ్యర్థి అంకం మౌనిక