హిమాచల్‌ ప్రవేశ పన్నుపై పంజాబ్ టాక్సీ, ట్రక్‌ డ్రైవర్లు నిరసన

హిమాచల్‌ ప్రవేశ పన్నుపై పంజాబ్ టాక్సీ, ట్రక్‌ డ్రైవర్లు నిరసన
హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ప్రవేశ పన్ను నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా పంజాబ్‌కు చెందిన టాక్సీ, ట్రక్‌ యూనియన్లు శనివారం  నిరసన చేపట్టాయి. టాక్సీ, ట్రక్‌ డ్రైవర్లు చండీగడ్‌- మనాలి జాతీయ రహదారిని దిగ్బంధించారు. వారు రోడ్డుపై బైఠాయించడంలో రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో వేలాది మంది ప్రయాణీకులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి ఇబ్బందులుపడ్డారు. 
 
అయితే పోలీసులు వేర్వేరు మార్గాల ద్వారా ప్రయాణీకులను పంపారు. తమ డిమాండ్లు నెరవేర్చకోపోతే పరిస్థితి మరింత తీవ్రమవుతుందని ఆందోళనకారులు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ నిరసన సందర్భంగా పంజాబ్‌, ఇతర రాష్ట్రాల రవాణాదరులను తీవ్రంగా ప్రభావం చూపే వివక్షాపూరిత విధానాలను హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం అనుసరిస్తోందని ఆరోపిస్తూ వారు నినాదాలు చేశారు.

సరిహద్దు ప్రాంతాల్లో పనిచేస్తున్న రవాణాదారులకు కొత్త పన్ను విధానం వల్ల తమ వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ నిర్ణయం వల్ల మా ఆదాయానికి పెద్ద దెబ్బ తగిలింది. అదనపు ఛార్జీలను తప్పించుకోవడానికి పర్యాటకులు, హిమాచల్‌ వాహనాలనే ఇష్టపడుతున్నారు. ఇది పంజాబ్‌ ఆపరేటర్లకు జరిగిన తీవ్ర అన్యాయం అని నిరసన తెలుపుతున్న ఓ డ్రైవర్‌ మీడియాతో పేర్కొన్నారు.
 
హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న చర్య చట్టవిరుద్ధం అని నిరసనకు పిలుపునిచ్చిన నేతలు పరమ్‌జిత్‌ సింగ్‌ పమ్మా, గౌరవ్‌ రాణా విమర్శించారు. వాణిజ్య సూత్రాలకు విరుద్ధమని అని కూడా ఆరోపించారు. ఈ విధానం ఇతర రాష్ట్రాల ఆపరేటర్లను శిక్షిస్తూ, హిమాచల్‌ ఆధారిత ఆపరేటర్లకు అనవసర ప్రయోజనం కల్పించి గుత్తాధిపత్యాన్ని ప్రోత్సహిస్తుందని వారు ఆరోపించారు. 
 
ఆ నోటిఫికేషన్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలి. రిజిస్ట్రేషన్‌తో సంబంధం లేకుండా వాణిజ్య వాహనాలకు ఏకరీతి పన్ను విధానాన్ని అమలు చేయాలని టాక్సీ, ట్రక్‌ యూనియన్‌ నేతలు డిమాండ్‌ చేశారు. ఈ విషయలో జోక్యం చేసుకుని హిమాచల్‌ ప్రదేశ్‌ అధికారులతో చర్చలు జరపాలని పంజాబ్‌ ప్రభుత్వాన్ని కోరారు.