పాక్‌లో అమెరికా ప్రతినిధులను కలిసేందుకు ఇరాన్ నిరాకరణ

పాక్‌లో అమెరికా ప్రతినిధులను కలిసేందుకు ఇరాన్ నిరాకరణ
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ఆదిలోనే హంసపాదు ఎదురవుతోంది. అమెరికా, ఇరాన్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కోసం జరుగుతున్న మధ్యవర్తిత్వ ప్రయత్నాల్లో ప్రతిష్టంభన నెలకొన్నట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. ఈ మేరకు మధ్యవర్తుల ప్రకటనలను ఉటంకిస్తూ ఓ నివేదిక ప్రచురించింది.
పాకిస్తాన్ నేతృత్వంలో జరుగుతున్న ఈ ప్రయత్నం ఎటువంటి పురోగతి సాధించలేదని, రాబోయే రోజుల్లో చర్చల కోసం ఇస్లామాబాద్‌కు తమ ప్రతినిధులను పంపడానికి తాము సుముఖంగా లేమని మధ్యవర్తులకు ఇరాన్ అధికారికంగా తెలియజేసింది. అమెరికా డిమాండ్లు తమకు ఆమోదయోగ్యం కాదని నొక్కి చెప్పిన ఇరాన్ తద్వారా ప్రస్తుత చర్చల ప్రక్రియకు వాస్తవంగా తెరదించింది. ఈ ప్రతిష్టంభన దౌత్య ప్రయత్నాలను అనిశ్చితిలో పడేసింది.
దీంతో టర్కీ, ఈజిప్టు తదుపరి చర్చల కోసం పాకిస్థాన్ వెలుపల ప్రయత్నించాలని భావిస్తున్నాయి. కాల్పుల విరమణ ప్రయత్నంలో ఖతార్, టర్కీ కీలకంగా వ్యవహరిస్తుండగా ఆ రెండు దేశాలు ఇప్పుడు చర్చలు నిర్వహణకు ప్రత్యామ్నాయ వేదికలను అన్వేషిస్తున్నాయి. అటు, అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందం సాధించే దిశగా చర్చలు జరుగుతున్నట్టు యాక్సిస్ నివేదిక తెలిపింది.

అమెరికా కాల్పుల విరమణకు బదులుగా హార్ముజ్ జలసంధిని తిరిగి ఇరాన్ ఒప్పుకునే అవకాశం ఉందని పేర్కొంది. అంతేకాదు, బుధవారం సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్‌లో మాట్లాడినప్పుడు కూడా కాల్పుల విరమణ గురించి చర్చించినట్టు తెలిపింది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ కాల్పుల విరమణ కోరుకుంటున్నారని, కానీ, హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిస్తేనే అది సాధ్యమని చెప్పానని అదే రోజున డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ పెట్టారు. 

అటు, యుద్ధం విషయంలో ట్రంప్ బెదిరింపుల కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్‌పై ఇప్పటి వరకూ పూర్తిస్థాయి దాడులకు తాము దిగలేదని, మరో రెండు మూడు వారాల్లో వారిపై భీకర దాడులు చేస్తామని మరోసారి అమెరికా అధ్యక్షుడు బెదిరింపులకు దిగారు. బ్రిడ్జిలను, విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారు. ఈ క్రమంలో ఇరాన్‌లో అతి ఎత్తైన వంతెనను అమెరికా శుక్రవారం కూల్చేసింది.