అమెరికాకు చెందిన మరో ఎఫ్-35ను కూల్చేశాం

అమెరికాకు చెందిన మరో ఎఫ్-35ను కూల్చేశాం

* ఇరాన్ బ్రిడ్జిపై అమెరికా దాడి దాడి.. 8 గల్ఫ్‌ బ్రిడ్జీలపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరిక 

అమెరికాకు చెందిన మరొక ఐదోతరం ఎఫ్-35 యుద్ధ విమానాన్ని కూల్చేశామని ఇరాన్‌ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ప్రకటించింది. సెంట్రల్ ఇరాన్ గగనతలం మీదుగా వెళ్తున్న ఎఫ్-35 ఫైటర్ జెట్‌ను ఒక అధునాతన గగనతల రక్షణ వ్యవస్థతో కూల్చినట్లు వెల్లడించింది.  తమ ఇంటర్‌సెప్టర్ మిస్సైల్ తాకగానే అమెరికా యుద్ధ విమానం ఎఫ్-35 భారీ పేలుడుతో కూలిపోయే స్థితికి చేరిందని, అందులోని పైలట్ బతికి బయటపడటం కష్టమేనని ఇరాన్ సైన్యం ప్రధాన కార్యాలయం ఖతం అల్ అంబియా అధికార ప్రతినిధి తెలిపారు.

ఐఆర్‌జీసీ ఏరోస్పేస్ దళానికి చెందిన సరికొత్త గగనతల రక్షణ వ్యవస్థ ఈ దాడి చేసిందని చెప్పారు.  అయితే ఇరాన్ వాదనలను అమెరికా సెంట్రల్ కమాండ్  కొట్టిపారేసింది. తమ విమానాలన్నీ క్షేమంగా ఉన్నాయని వెల్లడించింది. అంతకుముందు, మార్చి 19న ఇరాన్ దాడిలో ఒక ఎఫ్-35 యుద్ధ విమానం దెబ్బతిన్నట్లు కథనాలు వచ్చాయి.  మరోవంక, తాజాగా ఇరాన్‌లోని కరాజ్ ప్రాంతంలో ఉన్న బీ1 అనే ఒక పెద్ద బ్రిడ్జిపై గురువారం అమెరికా వైమానిక దాడి చేసింది. ఇది పశ్చిమాసియాలోనే అతిపెద్ద బ్రిడ్జి. ఈ దాడుల్లో బ్రిడ్జి చాలావరకు దెబ్బతింది. 

దీనిపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ దేశంలోని ప్రధాన బ్రిడ్జిపై అమెరికా చేసిన దాడికి ప్రతిగా.. తాము కూడా గల్ఫ్ దేశాల్లోని ప్రధాన బ్రిడ్జిలపై దాడులకు దిగుతామని ప్రకటించింది. అంతేకాదు.. గల్ఫ్‌ దేశాల్లో దాడిచేయబోయే ఎనిమిది బ్రిడ్జిల వివరాలు వెల్లడించింది. కువైట్‌లోని షేక్ జబెర్ అల్ అహ్మద్ అల్ సబా బ్రిడ్జి, యూఏఈలోని షేక్ జాయెదే బ్రిడ్జి, అల్ మక్తా బ్రిడ్జి, షేక్ ఖలిఫా బ్రిడ్జి, సౌదీ అరేబియా-బహ్రెయిన్‌లోని కింగ్ ఫాహద్ కాజ్‌వే, జోర్డాన్‌లోని డామియా బ్రిడ్జి, అబ్డోన్ బ్రిడ్జిలను పేల్చేస్తామని ప్రకటించింది.

ఈ ప్రాంతంలో ఈ బ్రిడ్జిలు రవాణాకు చాలా కీలకం. అందుకే ఇరాన్ వీటిని లక్ష్యంగా ఎంచుకుంది.  ఐఆర్‌జీసీ ఆధ్వర్యంలో దాడులు చేస్తామని హెచ్చరించింది. అమెరికా పాక్షికంగా కూల్చేసిన బీ1 బ్రిడ్జి ఇరాన్‌కు చాలా కీలకం. ఇది 136 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇంకా కొంత ప్రాంతం నిర్మాణంలో ఉంది. ఇది టెహ్రాన్, కరాజ్‌ పట్టణాలను కలుపుతుంది. ఈ బ్రిడ్జిపై రెండుసార్లు జరిగిన వైమానిక దాడిలో ఎనిమిది మంది మరణించారు. 95 మంది గాయపడ్డారు. ఈ దాడులపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ పౌర నిర్మాణాల్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం సరికాదని మండిపడ్డారు.