సీట్ల సర్దుబాటుపై మిత్రపక్షాలతో కొనసాగుతున్న చర్చలు, రాజకీయ వ్యూహాల నడుమ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తన అభ్యర్థుల జాబితాను శుక్రవారం ప్రకటించింది. న్యూఢిల్లీలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయం మొత్తం 27 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేయగా, సీట్లు దక్కించుకున్నవారిలో మాజీ తెలంగాణ గవర్నర్ తమిళశై సౌందరాజన్, కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ ఉన్నారు.
అయితే, తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పేరు ఈ జాబితాలో లేదు. కోయంబత్తూరు నార్త్ స్థానం కావాలని ఆయన డిమాండ్ చేయగా అక్కడ సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే, మహిళా మోర్చా అజాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్‌కు బీజేపీ మళ్లీ అవకాశం కల్పించింది. కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ అవినాషి (ఎస్సీ) స్థానం నుంచి పోటీచేస్తుండగా, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు మైలాపూర్ టిక్కెట్ దక్కింది. గత ఎన్నికల్లో ఆమె ఇక్కడ నుంచే పోటీచేసి ఓటమి చవిచూశారు.
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ సత్తూరు నుంచి పోటీచేస్తున్నారు. తమిళనాడు ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తులో భాగంగా బీజేపీకి 27 సీట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. మొదకురిచ్చి నుంచి కీర్తికా శివకుమార్, విలవంకోడ్ నుంచి విజయధరణి, తల్లి స్థానం నుంచి నగేష్కుమార్లను పార్టీ అభ్యర్థులుగా ప్రకటించింది. మొత్తం జాబితాలో తమిళశై సౌందరాజన్ తో పాటు ఐదుగురు మహిళా అభ్యర్థులు ఉండగా, ప్రస్తుత ఎమ్యెల్యేలు ముగ్గురికి తిరిగి సీట్లు ఇచ్చారు.
కాగా, అన్నామలై సోషల్ మీడియా ద్వారా పోటీచేస్తున్న పార్టీ అభ్యర్థులు అందరికి అభినందనలు తెలియజేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ విజయాన్ని సాధించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. “మన గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ వారి దూరదృష్టితో కూడిన నాయకత్వంలో…”పనిచేస్తానని చెప్పారు.

More Stories
16 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
ఆప్ రాజ్యసభ ఉప నేతగా రాఘవ్ చద్దా తొలగింపు
న్యాయాధికారులనే నిర్బంధిస్తారా? బెంగాల్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం