హోర్ముజ్‌ను తిరిగి తెరవాలని 60 దేశాల పిలుపు

హోర్ముజ్‌ను తిరిగి తెరవాలని 60 దేశాల పిలుపు
* ‘నిరాటంకమైన రవాణా’కు యుకె చర్చలలో భారత్ 
 
హోర్ముజ్ జలసంధిలో నౌకాయానానికి అంతరాయం కలగడంతో భారతదేశానికి ఇంధన సరఫరాపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో, ఈ కీలక జలమార్గాన్ని తిరిగి తెరవడంపై యూకే గురువారం ఏర్పాటు చేసిన 60కి పైగా దేశాల సమావేశంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన “నౌకాయాన స్వేచ్ఛ”, “నిరాటంక రవాణా” సూత్రాలను నొక్కి చెప్పారు. 
 
సమావేశం అనంతరం ఛైర్మన్ విడుదల చేసిన ప్రకటనలో మిశ్రీ వ్యాఖ్యలే ప్రతిధ్వనించాయి. జలసంధిని “తక్షణమే, బేషరతుగా తిరిగి తెరవాలని”, అలాగే “నౌకాయాన స్వేచ్ఛ, సముద్ర చట్టం ప్రాథమిక సూత్రాలను” గౌరవించాలని భాగస్వామ్య దేశాలు పిలుపునిచ్చినట్లు బ్రిటిష్ ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనలో పేర్కొంది.  “హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం ప్రపంచ శ్రేయస్సుకు ప్రత్యక్ష ముప్పు” అని, “ఇరాన్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బందీగా ఉంచడానికి ప్రయత్నిస్తోంది. దాని ప్రయత్నం ఫలించకూడదు” అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 
 
యూకే విదేశాంగ కార్యదర్శి యెవెట్ కూపర్ టెహ్రాన్‌పై తీవ్ర విమర్శలతో చర్చలకు నాంది పలికారు. “ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బందీగా ఉంచడానికి ఇరాన్ ఒక అంతర్జాతీయ నౌకా రవాణా మార్గాన్ని సమర్థవంతంగా హైజాక్ చేస్తోందని” ఆమె ఆరోపించారు. జలసంధిని “సురక్షితంగా మరియు నిరంతరాయంగా తెరిచేందుకు” దౌత్య, ఆర్థిక సాధనాలను “సమిష్టిగా సమీకరించాలని” ఆమె పిలుపునిచ్చారు.
 
సమావేశానికి ముందు, బ్రిటీష్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ మాట్లాడుతూ, బ్రిటీష్ విదేశాంగ కార్యదర్శి యెవెట్ కూపర్ అధ్యక్షతన జరిగే ఈ వర్చువల్ సమావేశం, “నౌకాయాన స్వేచ్ఛను పునరుద్ధరించడానికి, చిక్కుకుపోయిన ఓడలు, నావికుల భద్రతకు హామీ ఇవ్వడానికి, కీలకమైన వస్తువుల రవాణాను తిరిగి ప్రారంభించడానికి మనం తీసుకోగల అన్ని ఆచరణీయమైన దౌత్య , రాజకీయ చర్యలను అంచనా వేస్తుంది” అని తెలిపారు. 
 
ఈ సమావేశాన్ని ఒక మొదటి అడుగుగా పరిగణిస్తున్నారు. దీని తర్వాత వివరాలను ఖరారు చేయడానికి అధికారులతో “కార్యనిర్వాహక స్థాయి సమావేశాలు” జరుగుతాయి. నౌకాయానాన్ని తిరిగి ప్రారంభించడం “సులభం కాదు,” అని, దీనికి సముద్ర పరిశ్రమతో భాగస్వామ్యంతో పాటు “సైనిక శక్తి, దౌత్యపరమైన కార్యకలాపాల ఐక్య కూటమి” అవసరమని స్టార్మర్ చెప్పినట్లు ఆ ప్రకటన పేర్కొంది. 
 
ఒక ప్రకటనలో, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇలా తెలిపింది, “పశ్చిమ ఆసియాలోని పరిస్థితిపై యూకే విదేశాంగ కార్యదర్శి ఏర్పాటు చేసిన సమావేశంలో విదేశాంగ కార్యదర్శి (మిశ్రీ) భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. ఈ సమావేశంలో 60కి పైగా దేశాలు పాల్గొన్నాయి.”
 
విదేశాంగ కార్యదర్శి (మిస్రీ) అంతర్జాతీయ జలమార్గాల ద్వారా స్వేచ్ఛా నౌకాయానం మరియు నిరాటంకమైన రవాణా సూత్రాల ప్రాముఖ్యతను గుర్తించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అమెరికా-ఇజ్రాయెల్,  ఇరాన్ మధ్య కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా భారతదేశ ఇంధన భద్రతపై పడుతున్న ప్రభావాన్ని, అలాగే భారతీయ నావికులు ఎదుర్కొంటున్న నష్టాన్ని కూడా ఆయన తెలియజేశారు.
 
 “ఈ సంక్షోభం భారతదేశ ఇంధన భద్రతపై చూపే ప్రభావాన్ని, అలాగే గల్ఫ్‌లో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులలో నావికులను కోల్పోయిన ఏకైక దేశం భారతదేశమేనన్న వాస్తవాన్ని ఆయన (మిస్రీ) నొక్కి చెప్పారు,” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ముగ్గురు భారతీయ నావికులు మరణించగా, ఒకరు గల్లంతయ్యారు.  భారత జెండా కలిగిన మొత్తం 18 నౌకలు, వాటిలో ఉన్న 485 మంది భారతీయ నావికులతో సహా, పశ్చిమ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోనే కొనసాగుతున్నాయి. “ఈ సంక్షోభం నుండి బయటపడే మార్గం ఉద్రిక్తతలను తగ్గించడం, సంబంధిత పక్షాలన్నింటి మధ్య దౌత్యం, సంభాషణల మార్గానికి తిరిగి రావడం” అని మిస్రి నొక్కి చెప్పారు. 
 
ప్రపంచ ఇంధన సరఫరాలో 20 శాతం – అలాగే ఖతార్ నుండి వచ్చే గ్యాస్ సరఫరాలో అత్యధిక భాగం  భారీ నౌకల ద్వారా ప్రయాణించే కీలకమైన జలమార్గం ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’. ఈ జలమార్గం మూసివేయబడటం వల్ల ఖతార్, యుఎఈ, కువైట్ దేశాలన్నీ ప్రభావితమయ్యాయి. దీని ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ ధరలు పెరిగాయి. అంతేకాక భారతదేశంతో పాటు ఇతర దేశాలలో వంటగ్యాస్ సరఫరాపైనా దీని ప్రభావం పడింది.
పరిస్థితిలోని ఆవశ్యకత సమాంతర దౌత్య ప్రయత్నాలను కూడా ప్రేరేపించింది. ప్రస్తుతం ముదురుతున్న సంక్షోభాన్ని పరిష్కరించేందుకు, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, కువైట్, ఒమన్, బహ్రెయిన్‌లతో సహా కీలక చమురు ఉత్పత్తి దేశాలను ఒకచోట చేర్చుతూ, జి7 దేశాల కూటమి వచ్చే వారం గల్ఫ్ సహకార మండలితో చర్చలు జరపనుంది.