ఇరాన్‌లో రివల్యూషనరీ గార్డ్ స్వాధీనంలో ప్రభుత్వం?

ఇరాన్‌లో రివల్యూషనరీ గార్డ్  స్వాధీనంలో ప్రభుత్వం?
ఇరాన్ తీవ్రమైన నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది, అసలు అధికారం ఎవరి చేతిలో ఉందనే దానిపై గందరగోళం పెరుగుతోంది. ఈ సంఘర్షణ ప్రారంభంలో జరిగిన దాడుల్లో ఇరాన్ సర్వోన్నత నాయకుడు అలీ ఖమేనీ మరణించడంతో ఈ సమస్య మొదలైంది. ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీని వెంటనే తదుపరి సర్వోన్నత నాయకుడిగా ప్రకటించారు. 
 
కానీ అప్పటి నుండి ఆయన బహిరంగంగా కనిపించలేదు. ఆయన గైర్హాజరు అనేక ప్రశ్నలను లేవనెత్తింది. టెలివిజన్‌లో ఆయన పేరుతో సందేశాలు ప్రసారం అవుతున్నాయి, కానీ ఆయన ఆరోగ్య పరిస్థితికి ప్రత్యక్ష రుజువు లేదు. కొన్ని నివేదికలు ఆయన తీవ్ర అనారోగ్యంతో ఉండవచ్చని సూచిస్తుండగా, మరికొన్ని ఆయన అపస్మారక స్థితిలో ఉండవచ్చని చెబుతున్నాయి. 
 
అత్యున్నత స్థాయిలో స్పష్టమైన నాయకత్వం లేకపోవడంతో, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) రంగంలోకి దిగి కీలక నిర్ణయాలను తన నియంత్రణలోకి తీసుకుంది. సాధారణ సైన్యం నుండి విడిగా పనిచేసే ఈ దళం, ఇప్పుడు సైనిక, రాజకీయ వ్యవహారాలు రెండింటినీ నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. పాలకవర్గానికి, సైనిక నాయకత్వానికి మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్‌ను పూర్తిస్థాయి రాజకీయ సంక్షోభంలోకి నెట్టాయని, ఈ క్రమంలోనే ఇరాన్ ప్రభుత్వాన్ని  ఐఆర్‌జీసీ తమ అధీనంలోకి తీసుకుందని ఇరాన్ ఇంటర్నేషనల్ నివేదించింది. 
 
అధ్యక్షుడి నియామకాలు, నిర్ణయాలను ఐఆర్జీసీ అడ్డుకుని, అధికారాన్ని చేజిక్కించుకుందని, తద్వారా పాలనను కార్యనిర్వాహక శాఖ నుంచి సమర్థవంతంగా తొలగించిందని సమాచారం.  కొత్త ఇంటెలిజెన్స్ మంత్రిని నియమించేందుకు అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ చేసిన ప్రయత్నాలు రివల్యూషనరీ గార్డ్ చీఫ్ కమాండర్ అహ్మద్ వాహిది ఒత్తిడి కారణంగా విఫలమయ్యాయని ఆ నివేదిక తెలిపింది. 
 
హుస్సేన్ దేహ్‌ఘాన్‌తో సహా ప్రతిపాదిత అభ్యర్థుల నియామకాలను వాహిది తిరస్కరించారు. యుద్ధ పరిస్థితుల దృష్ట్యా, తదుపరి ఉత్తర్వులు వెలువడనే వరకూ ముఖ్యమైన, సున్నితమైన నాయకత్వ పదవులకు సంబంధించిన అన్ని నియామకాలను సైన్యమే నేరుగా చేపట్టాలని, నిర్వహించాలని వాహిది పట్టుబట్టారని ఆ నివేదిక పేర్కొంది.  ఇరాన్ రాజకీయ వ్యవస్థలో సుప్రీం లీడర్  ఆమోదం పొందిన తర్వాతే నిఘా మంత్రులను అధ్యక్షుడు నామినేట్ చేసేవారు. కీలకమైన భద్రతా విభాగాలపై తుది అధికారం ఆయనకే ఉండేది. 
 
కానీ, యుద్ధం ప్రారంభమైన రోజునే సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించడం, ఆయన స్థానంలో వచ్చిన కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ హోదా, స్థానంపై అనిశ్చితి నెలకుంది. దీంతో అధ్యక్షుడిని  ఐఆర్‌జీసీ నియంత్రిస్తోంది. ఇది దేశ పరిపాలనపై దాని నియంత్రణను మరింత బలపరుస్తుంది.  ఇటీవలి సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీని అత్యవసరంగా కలిసేందుకు అధ్యక్షుడు పలుసార్లు ప్రయత్నించినప్పటికీ, ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు. 
 
రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ సీనియర్ అధికారులతో కూడిన ఒక మిలటరీ కౌన్సిల్ కీలక నిర్ణయాలపై పూర్తి నియంత్రణను కలిగి ఉందని, దేశంలో ప్రస్తుత పరిస్థితిపై ప్రభుత్వ నివేదికలను సుప్రీం లీడర్‌కు చేరకుండా ఆయన చుట్టూ భద్రతా వలయం ఏర్పాటు చేశారని ఆ నివేదిక వెల్లడించింది  ఇదిలా ఉండగా, మోజ్తాబా ఖమేనీ సన్నిహిత వర్గాల్లో అంతర్గత సంక్షోభం తలెత్తినట్లు సమాచారం. 
 
సుప్రీం లీడర్ ఆఫీసులో కీలకంగా వ్యవహరించే అలీ అస్గర్ హిజాజీని తొలగించేందుకు  మోజ్తాబా సన్నిహిత సహాయకులు కొందరు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. మోజ్తాబా నియమాకాన్ని హిజాజీ తీవ్రంగా వ్యతిరేకించడమే ఇందుకు కారణం.  విశ్వసనీయ వర్గాల ప్రకారం వారసత్వానికి అవసరమైన అర్హతలు మోజ్తాబాకు లేవని, వంశపారంపర్యంగా నియామకం ఆయతుల్లా అలీ ఖమేనీ నిర్దేశించిన సూత్రాలకు విరుద్ధమని ఎక్స్‌పర్ట్ అసెంబ్లీని హిజాబీ హెచ్చరించారు.
 
 సుప్రీం లీడర్‌గా మోజ్తాబాను ఎంపిక చేయడం వల్ల సైన్యానికి దేశంపై పూర్తి నియంత్రణ వస్తుందని, సాధారణ ప్రజా సంస్థలు శాశ్వతంగా మూతబడతాయని హిజాజీ హెచ్చరించినట్లు సమాచారం. యుద్ధం ప్రారంభమైన మొదటి వారంలోనే హిజాజీని లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడిచేసినట్టు ఇజ్రాయెల్ మీడియా నివేదించింది. ఆ దాడి నుంచి ఆయన తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాడని తర్వాతి నివేదికలు పేర్కొన్నాయి.