* స్వదేశీ విమానాలకు పెంపు 8.6 శాతం మాత్రమే
పశ్చిమ ఆసియాలో విస్తరిస్తున్న సంఘర్షణ కారణంగా ప్రపంచ చమురు ధరలు పెరగడంతో, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఎటిఎఫ్) లేదా జెట్ ఫ్యూయల్ ధర బుధవారం కిలోలీటరుకు రికార్డు స్థాయిలో రూ. 2.07 లక్షలకు, రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగింది. అదే సమయంలో, వాణిజ్య ఎల్‌పిజి ధరలు సిలిండర్‌కు రూ. 195.50 పెరిగాయి. ఎటిఎఫ్ ధరలు కిలోలీటరుకు రూ. 2 లక్షల మార్కును దాటడం చరిత్రలో ఇదే మొదటిసారి.
అయితే, దేశీయ విమానయాన సంస్థల కోసం ఎటిఎఫ్ ధరను 8.6% మేర పెంచి, కిలోలీటరుకు రూ.1.04 లక్షలకు చేర్చినట్లు, అలాగే జెట్ ఇంధన ధరలను రెట్టింపు చేసి రూ. 2.07 లక్షలకు పెంచడం అనేది కేవలం షెడ్యూల్ లేని, తాత్కాలిక, చార్టర్ విమానయాన సంస్థలకు మాత్రమే వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత చమురు ధరలు పెరగడంతో, 2022లో ధరలను కిలోలీటరుకు రూ. 1.1 లక్షలు పెంచినప్పుడు ఇదే అత్యధిక స్థాయి. ఈ పెరుగుదల ప్రభావం విమాన ప్రయాణ ఖర్చులు మాత్రమే కాకుండా, వాణిజ్య కార్యకలాపాలు మరియు సాధారణ వినియోగదారులపై కూడా పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. దేశంలో వంటగ్యాస్ కొరత తీవ్రతరం కావడంతో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరను ఒక్కో సిలిండర్‌కు రూ.195.50 పెంచారు.
దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాలపై గణనీయమైన భారం పడనుంది. వాణిజ్య రంగానికి చెందిన వ్యయాలు పెరగడంతో ఆహార పదార్థాల ధరలు కూడా పెరిగే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. ఇదే సమయంలో 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్ ధర రూ.51 పెరిగి రూ.549కు చేరింది. నెల రోజుల క్రితం (మార్చి 1న) సిలిండర్ పై రూ.114.5 పెంచిన విషయం విదితమే. కాగా గృహ అవసరాల కోసం వాడే వంటగ్యాస్ ధరలో ఎలాంటి మార్పు లేదు.

More Stories
చైనా సీసీటీవీ కెమెరాలపై భారత్ లో నిషేధం!
2.5 శాతంకు పెరిగిన యూరప్ ద్రవ్యోల్బణం రేటు
ఇండిగో సిఇఒ గా బ్రిటీష్ ఎయిర్వేస్ మాజీ చీఫ్ విలియం వాల్ష్