బీహార్ గుడిలో తొక్కిసలాట.. 8 మంది మహిళలు మృతి

బీహార్ గుడిలో తొక్కిసలాట.. 8 మంది మహిళలు మృతి
బీహార్‌లోని న‌లంద జిల్లా మాఘ్రా గ్రామంలో ఉన్న షీత‌లాష్ట‌మి ఆల‌యంలో జరిగిన తొక్కిస‌లాట‌లో సుమారు 8 మంది భ‌క్తులు ప్రాణాలు కోల్పోయారు. చ‌నిపోయివారిలో అంద‌రూ మ‌హిళ‌లే ఉన్నారు. మ‌రో డ‌జ‌ను మంది వ‌ర‌కు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. న‌లంద జిల్లాలోని బీహార్ ష‌రీఫ్‌కు 5 కిలోమీట‌ర్ల దూరంలో ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.  శీతలామాత ఆలయానికి ప్రతి మంగళవారం భక్తులు వస్తుంటారు. అయితే ఈసారి మహావీర జయంతి, చైత్ర మాసం చివరి మంగళవారం కావడంతో ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు.
ఉదయం 9 గంటల నుంచి భక్తుల రాక పెరుగుతూ వచ్చింది. ఉదయం సుమారు 10:30 గంటల సమయంలో ఒక్కసారిగా రద్దీ పెరగడంతో భక్తులు ఒకరిపై ఒకరు పడిపోవడంతో తొక్కిసలాట జరిగింది.  ఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానిక గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిసమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ కూడా సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.6 లక్షల ఎక్స్​గ్రేషియా ప్రకటించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఘటన అనంతరం ఆలయంలో పూజలు, దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేశారు. 

మరోవైపు ఈ ప్రమాదంపై ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌధరీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ, ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం అందిస్తుందని చెప్పారు. గాయపడిన వారికి సరైన చికిత్స కోసం ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  ఈ ఘటనపై బిహార్ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.

గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను ఆదేశించడంతో పాటు, ఆలయంలో సాధారణ పరిస్థితులు త్వరగా పునరుద్ధరించాలని సూచించింది. ఘటన తీవ్రత దృష్ట్యా ఆలయం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన దుకాణాలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు.  ఆలయం వద్ద 25,000 మందికి పైగా జనసమూహం గుమిగూడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఒక వ్యక్తి అకస్మాత్తుగా తన కుటుంబం కోసం కేకలు వేయడంతో అక్కడ గందరగోళం నెలకొని తొక్కిసలాట జరిగిందని అంటున్నారు.