వంట గ్యాస్ సమస్య తగ్గించేందుకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సుపీరియర్ కిరోసిన్ పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సుపీరియర్ కిరోసిన్ పంపిణీ చేయాలని భావిస్తోంది. సర్వీస్ స్టేషన్లలో 2,500 లీటర్ల వరకు కిరోసిన్ నిల్వకు కేంద్రం వెసులుబాటు ఇచ్చింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 60 రోజులపాటు లేదా తదుపరి ఉత్తర్వుల వరకు తాజా ఆదేశాలు అమలులో ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది.
ఇక, సుపీరియర్ కిరోసిన్ అయిల్ అనేది ముడిచమురు రిఫైనరీ ప్రక్రియ నుంచి వచ్చే ఉప ఉత్పత్తి. ఇది అత్యంత శుద్ధి చేసిన కిరోసిన్ ఆయిల్. దీన్ని ప్రధానంగా వంటకు, దీపాలు వెలిగించేందుకు ఉపయోగిస్తారు. సాధారణ లో-గ్రేడ్ కిరోసిన్‌తో పోలిస్తే ఇందులోనుంచి వెలువడే వాయువులు చాలా తక్కువ. అంతేకాదు, దీని వెలిగించినప్పుడు వచ్చే పొగ కూడా తక్కువ. మరోవైపు, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల వల్ల దేశంలో ఇటీవల కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఉన్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది.
దీంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఈ విషయంపై ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు సైతం ఈ వదంతులను తీవ్రంగా ఖండించాయి. దేశంలో ఇంధన కొరత లేదని, సరఫరా సజావుగానే జరుగుతోందని స్పష్టం చేశాయి. ప్రజలు అనవసరంగా భయాందోళనలకు గురై ఎక్కువ మొత్తంలో కొనుగోళ్లు చేయవద్దని కేంద్రం సూచించింది. అదేవిధంగా, దేశంలో ప్రస్తుతానికి వంట గ్యాస్ సమస్యలేకున్నా, భవిష్యత్తులో ఎలాంటి సమస్య తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
దేశంలోని శుద్ధి కర్మాగారాలు తగినంత ముడి చమురు నిల్వలతో అధిక సామర్థ్యంతో పని చేస్తున్నాయని తెలిపింది. చమురు నిల్వలపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ మేరకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మారుతున్నవారికి అనుమతులు సులభతరం చేసింది. దీని ద్వారా నగర గ్యాస్ పంపిణీ నెట్‌వర్క్‌ల విస్తరణను వేగవంతం చేస్తున్నట్లు తెలిపింది. అయితే, రోజువారి రీఫిల్ సిలిండర్ డెలివరీలు దాదాపు 55 లక్షలు దాటాయని, వాటిని దారి మళ్లించకుండా కట్టడి చేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.

More Stories
రైల్వేలో మద్యం, పొగాకు ప్రకటనలపై నిషేధం
భారత్ కు మరో రెండు ఎల్పీజీ నౌకలు
గల్ఫ్ యుద్ధంతో ఇంధన సంక్షోభంతో పాటు ఎరువుల సంక్షోభం