ప్రముఖ పారిశ్రామికవేత్త, దేశీయ వస్త్ర ప్రపంచంలో ‘రేమండ్’ అనే బ్రాండ్‌ను ప్రతి ఇంటికి చేర్చిన, సంస్థ మాజీ చైర్మన్, పద్మభూషణ్ డాక్టర్ విజయ్ పత్ సింఘానియా (87) కన్నుమూశారు. శనివారం రాత్రి ముంబైలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఒక వ్యాపారవేత్తగానే కాకుండా, అసాధారణ సాహసిగా, దాతగా ఆయన చెరగని ముద్ర వేశారు.
సాధారణ మధ్యతరగతి భారతీయుడికి సూట్ ధరించడం అనే కలను పరిచయం చేసిన వ్యక్తి విజరుపత్ సింఘానియా. 1980లలో ఆయన బాధ్యతలు చేపట్టినప్పుడు రేమండ్ ఒక చిన్న సంస్థ. అయితే తన వ్యూహాలతో దానిని పురుషుల ఫ్యాషన్ ప్రపంచంలో తిరుగులేని గమ్యస్థానంగా మార్చారు. ‘ది కంప్లీట్ మ్యాన్’ అనే ట్యాగ్‌లైన్‌కు నిలువెత్తు రూపంగా ఆయన నిలిచారు.
విజయ్ పత్ సింఘానియా జీవితం కేవలం బోర్డ్‌రూమ్ మీటింగ్‌లకే పరిమితం కాలేదు. 2005 లో, తన 67వ ఏట, హాట్ ఎయిర్ బెలూన్‌లో సుమారు 69,000 అడుగుల ఎత్తుకు ఎగిరి ప్రపంచ రికార్డు సృష్టించారు. 60 ఏళ్ల వయసులో లండన్ నుండి అహ్మదాబాద్ వరకు ఒంటరిగా విమానాన్ని నడుపుతూ వచ్చిన ఆయన సాహసం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.
వస్త్ర పరిశ్రమ రంగానికి ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2006 లో పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది. అంతేకాకుండా, ఆయన ముంబయి నగరానికి గౌరవ ‘షెరీఫ్’గా కూడా పనిచేశారు. తన జీవితంలో ఎన్నో శిఖరాలను అధిరోహించిన విజయ్ పత్ సామాజిక సేవలోనూ తనదైన ముద్ర వేశారు. కోట్ల విలువైన సామ్రాజ్యాన్ని నిర్మించిన ఆయన జీవితంలో పలు వ్యక్తిగత సంఘర్షణలను ఎదుర్కొన్నారు.
తన ఆస్తులను కుమారుడు గౌతమ్ సింఘానియాకు బదిలీ చేసిన తర్వాత, తండ్రీ కొడుకుల మధ్య తలెత్తిన చట్టపరమైన వివాదాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అద్దె ఇంట్లో గడపడం నుండి కోర్టు మెట్లు ఎక్కడం వరకు, ఒక దిగ్గజం ఎదుర్కొన్న ఈ ఒడిదుడుకులు ఎందరినో కలచివేసాయి. ఈ నేపథ్యంలో విజయ్‌పత్ తన సొంత పరిస్థితిని ఒక గుణపాఠంగా ఉదహరిస్తూ తల్లిదండ్రులు తమ జీవితకాలంలో తమ ఆస్తి మొత్తాన్ని పిల్లలకు బదిలీ చేయవద్దని బహిరంగంగా హెచ్చరించారు.
సంవత్సరాల తరబడి సాగిన మనస్పర్థల తర్వాత, 2024లో తండ్రీకొడుకులు మళ్లీ ఒక్కటవడం అభిమానులను, వ్యాపార వర్గాలను సంతోషపరిచింది. విజయ్ పత్ సింఘానియా మరణం భారత పారిశ్రామిక రంగానికి తీరని లోటు. శూన్యం నుండి సామ్రాజ్యాన్ని నిర్మించడం, ఆకాశంలో రికార్డులు సృష్టించడం, జీవితపు ఒడిదుడుకులను ధైర్యంగా ఎదుర్కోవడం మొదలైనవి ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. ‘కంప్లీట్ మ్యాన్’ ప్రయాణం ముగిసినా … ఆయన సృష్టించిన బ్రాండ్ ప్రతి భారతీయుడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.

More Stories
రూ. 2.38 లక్షల కోట్లతో యుద్ధ విమానాల కొనుగోలు
ఎరువుల కొరత లేదు.. ఆందోళన వద్దు
పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గించిన కేంద్రం