* 132వ మన్ కీ బాత్
పశ్చిమాసియాలో గత నెల రోజులుగా కొనసాగుతోన్న యుద్ధం ప్రపంచవ్యాప్తంగా అనేక సవాళ్లను సృష్టించిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 132 వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరారు. ఈ మార్చి నెలలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కీలక ఘటనలు జరిగాయని పేర్కొంటూ గతంలో కరోనా కారణంగా ప్రపంచమంతా అనేక సమస్యలు ఎదుర్కొందని, దాని నుంచి బయటపడిన తర్వాత దేశాల మధ్య కొనసాగుతోన్న యుద్ధాలు పరిస్థితులను మార్చేశాయని తెలిపారు.
ప్రస్తుతం అమెరికా- ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతోన్న యుద్ధం సందర్భంగా గల్ఫ్ దేశాల్లో ఉంటున్న ప్రవాస భారతీయులకు సాయం అందిస్తున్న ఆయా ప్రభుత్వాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇంధన సరఫరాకు కీలకమైన ప్రాంతాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ సంక్షోభం తలెత్తిందని వివరించారు. ఈ క్లిష్ట సమయంలో ప్రజలందరూ ఐక్యతతో ఉండాలని మోదీ పిలుపునిచ్చారు. తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని కోరారు.
సంక్షోభాన్ని రాజకీయం చేస్తున్నవారిని మోడి హెచ్చరించారు. తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని చెబుతూ ఇది 140 కోట్ల మంది ప్రజల ప్రయోజనాలకు సంబంధించిన విషయమని పేర్కొన్నారు. ఇక్కడ స్వార్థపూరిత రాజకీయాలకు తావు లేదని చెప్పారు. తప్పుడు ప్రచారాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం చేసే ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు.
“పశ్చిమాసియా ప్రాంతం అనేది ఇంధన వనరుల సప్లైలకు ప్రధాన నెలవు. అక్కడ జరుగుతున్న యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ సంక్షోభం ఏర్పడుతోంది. ప్రపంచ దేశాలతో ఉన్న బలమైన సంబంధాల వల్ల ఈ సవాళ్లను భారత్ నిబద్ధతతో ఎదుర్కొంటోంది. గత కొన్ని దశాబ్దాల వ్యవధిలో భారత్ ఏర్పర్చుకున్న అంతర్జాతీయ సంబంధాలు, వివిధ దేశాలు అందిస్తున్న సహకారం వల్ల ఈ సవాళ్లను ఎదుర్కొనే స్థితిలో భారత్ ఉంది” అని తెలిపారు.
ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతల కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోయినప్పుడు వేలాదిమంది భారతీయులను తమ దేశాల మీదుగా స్వదేశానికి పంపేందుకు గల్ఫ్ దేశాలు చూపిన చొరవ మరువలేనిదని ప్రధాని మోదీ చెప్పారు.
“తెలంగాణలోని మంచిర్యాల జిల్లా ముధిగుంట గ్రామంలోని 400 కుటుంబాలు తమ ఇళ్లలో ఇంకుడు గుంతలను నిర్మించుకున్నారు. దీంతో వర్షాకాలంలో ఆ గుంతల ద్వారా భూమిలోకి వర్షపు నీరు ఇంకింది. దీని ఫలితంగా మొత్తం ఊరిలో భూగర్భ జలాల లభ్యత బాగా పెరిగింది. కలుషిత నీటి వల్ల ఊరి ప్రజలకు వ్యాధులు ప్రబలే ముప్పు కూడా తగ్గిపోయింది” అని ప్రధాని మోదీ తెలిపారు.

More Stories
పుదుచ్చేరిలో ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం
దలైలామాను మర్యాదపూర్వకంగా కలిసిన దత్తాత్రేయ హోసబలే
కశ్మీరీ పండిట్ల భూములను తిరిగి వారికే ఇచ్చేశాం