* పాక్ ప్రాయోజిత ఉగ్రవాద ముఠాలపై అమెరికా కాంగ్రెస్ రిసెర్చ్ సర్వీస్నివేదిక
ప్రపంచంలో ఏ మూలన ఉగ్రదాడి జరిగినా దాని మూలాలు పాక్‌లోనే ఉంటాయనేది బహిరంగ రహస్యమే. ఒక విధంగా చెప్పాలంటే ఉగ్రవాదం పాక్ ప్రభుత్వ విధానం. కానీ, ఎవరు తీసిన గొయ్యిలో వాళ్లే పడతారన్న సామెత దాయాదికి సరిగ్గా సరిపోతుంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్.. దాని కారణంగానే ఇప్పుడు అంతర్గత భద్రత ముప్పును ఎదుర్కొంటోంది.
తాజాగా, అమెరికా నివేదిక ఒకటి ఇదే విషయాన్ని బయటపెట్టింది. పాకిస్థాన్ ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా ఉందని, పలు ఉగ్రవాద గ్రూపులు భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకోవాలని, జమ్మూ కాశ్మీర్‌ను కూడా విలీనం చేసుకోవాలని చూస్తున్నాయని అమెరికా కాంగ్రెస్ రీసెర్చ్ గ్రూప్ (సిఆర్ఎస్) నివేదిక పునరుద్ఘాటించింది. భారత్‌ను లక్ష్యంగా చేసుకునే మూకలు సహా తన భూభాగంపై ఉగ్రవాదులకు పాకిస్థాన్ ఆశ్రయం కల్పిస్తూనే ఉందని గుర్తించింది.
మార్చి 25, 2026 నాటి నివేదిక ప్రకారం, పాకిస్తాన్, దాని సైన్యం ఉగ్రవాద గ్రూపులపై “అస్థిరంగా” వ్యవహరించాయని, “కొన్ని ఉగ్రవాద గ్రూపులు, వ్యక్తులు దేశంలో బహిరంగంగా కార్యకలాపాలు సాగించకుండా నిరోధించడానికి అధికారులు తగిన చర్యలు” తీసుకోవడంలో విఫలమయ్యారని పేర్కొంది.
“దేశంలో ఏ సాయుధ మిలీషియాలు పనిచేయడానికి అనుమతించరాదని” పిలుపునిచ్చే ఇస్లామాబాద్ జాతీయ కార్యాచరణ ప్రణాళిక ఉన్నప్పటికీ, ముంబయి 26/11 దాడులకు పాల్పడిన లష్కర్-ఎ-తయ్యిబా (ఎల్ఈటి), 2001 నాటి భారత్ పార్లమెంట్‌పై దాడితో సంబంధం ఉన్న జైష్-ఎ-మొహమ్మద్ (జెఈఎం) పాకిస్తాన్ గడ్డపై నుంచే తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని ఆ నివేదిక తెలిపింది.
1980ల చివరలో మర్కజ్ ఉద్ దవా ఉల్-ఇర్షాద్ యొక్క ఉగ్రవాద విభాగంగా ఏర్పడిన ఎల్ఈటి, 1993 నుండి భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుంటూ వస్తోందని ఆ నివేదిక పేర్కొంది. ఈ గ్రూపు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లలో కూడా దాడులు చేసిందని, జమాత్-ఉద్-దవా మీడియా సంస్థల ద్వారా తన సందేశాన్ని వ్యాప్తి చేస్తుందని ఆ నివేదిక తెలిపింది.
“లష్కర్-ఎ-తైబా (ఎల్ఈటి) పాకిస్తాన్, గల్ఫ్ దేశాలతో పాటు మధ్యప్రాచ్యం, యూరప్‌లోని ఇతర దాతల నుండి, ముఖ్యంగా యూకే నుండి విరాళాలు సేకరిస్తుంది. యూకేలో దీనిని ఒక ఉగ్రవాద సంస్థగా ప్రకటించారు. 2019లో, ఎల్ఈటి, దాని అనుబంధ సంస్థలు పాకిస్తాన్‌లో తమ కార్యకలాపాలను కొనసాగిస్తూ నిధులు సేకరించాయి,” అని అది పేర్కొంది.
పాక్ స్థావరాలుగా వాడుకుంటున్న ఉగ్రమూకలు
ఈ ఉగ్రమూకలు పాక్‌ను తమ స్థావరాలుగా, లక్ష్యాలకు వేదికగా రెండూ విధాలా వాడుకుంటున్నాయని నివేదిక పేర్కొంది. ఇటీవలి సంవత్సరాలలో తీవ్రవాదంలో భారీ పెరుగుదలను పాకిస్థాన్ ఎదుర్కొంటోంది. ‘వరుసగా ఐదు సంవత్సరాలు తగ్గుతూ, 2019లో 365కు పడిపోయిన ఉగ్రవాదుల మరణాల సంఖ్య, ఆ తర్వాత ఏటా పెరుగుతూ 2025 నాటికి 4,001కి చేరుకుంది. గత 11 ఏళ్లలే ఇదే అత్యధికం’ అని తెలిపింది.
నివేదిక ప్రకారం పాకిస్థాన్ తీవ్రవాదానికి అత్యధికంగా ప్రభావితమైన దేశం. 2021లో అఫ్గనిస్థాన్‌లో తాలిబన్ల తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత గడ్డపై ఉగ్రవాదం పునరుజ్జీవనాన్ని ప్రతిబింబిస్తుంది. చాలా వరకు ఉగ్రవాద సమూహాలు ఇస్లామిక్ తీవ్రవాద భావజాలంతో ప్రేరేపితమైనవేనని సిఆర్ఎస్ గుర్తించింది. ఈ ఉగ్ర సమూహాలను ఐదు విస్తృత వర్గాలుగా విభజించింది.
ప్రపంచవ్యాప్తంగా దాడులు, అఫ్గనిస్థాన్‌ను లక్ష్యంగా చేసుకున్నవి, భారత్- కశ్మీర్, స్వదేశంలో, మతతత్వ సంస్థలను టార్గెట్ చేసేవి అనే వర్గాలుగా పేర్కొంది. అల్ ఖైదా అనేది అలాంటి ఒక ఉగ్ర సమూహం. దాని ప్రధాన బలం తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ ఆ ప్రాంతంలో ఇంకా తన కార్యకలాపాలను కొనసాగిస్తూ, ఇతర తీవ్రవాద సంస్థలతో పొత్తులను కొనసాగిస్తోంది.
ఇస్లామిక్ స్టేట్ ప్రాంతీయ అనుబంధ సంస్థ అయిన ఇస్లామిక్ స్టేట్-ఖొరాసన్ ప్రావిన్స్‌లో 4,000-6,000 మంది ఫైటర్లు ఉన్నారని అంచనా. ఇది ఇతర తీవ్రవాద సమూహాల మాజీ సభ్యులను చేర్చుకుని అఫ్గన్, పాకిస్థాన్‌లలో తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దేశీయంగా తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్‌ను (టీటీపీ) పాక్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద సమూహంగా భావిస్తారు.
నివేదిక అంచనా ప్రకారం ఇందులో 2,500–5,000 మంది ఉండగా.. పాకిస్థాన్ ప్రభుత్వాన్ని కూల్చివేసి షరియా చట్టాన్ని అమలు చేయడమే తమ లక్ష్యమని ప్రకటించింది. సిఆర్ఎస్ అనేది అమెరికా కాంగ్రెస్‌కు చెందిన ఒక స్వతంత్ర పరిశోధనా విభాగం. కాంగ్రెస్ సభ్యులు సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడటానికి ఇది వివిధ సమస్యలపై కాలానుగుణ నివేదికలను సిద్ధం చేస్తుంది. దీని నివేదికలను కాంగ్రెస్ అధికారిక వైఖరిగా మాత్రం పరిగణించరు.

More Stories
కశ్మీరీ పండిట్ల భూములను తిరిగి వారికే ఇచ్చేశాం
తెలుగుదేశం ఆవిర్భావం …ఘనమైన నేపథ్యం
ఫైళ్లకే పరిమితమైన ప్రాజెక్టులను పట్టాలెక్కించాం