కశ్మీరీ పండిట్ల భూములను తిరిగి వారికే ఇచ్చేశాం

కశ్మీరీ పండిట్ల భూములను తిరిగి వారికే ఇచ్చేశాం
ఇప్పటివరకు కశ్మీరు లోయలో కశ్మీరీ పండిట్లకు చెందిన 466.15 ఎకరాల (3,729 కనాల్స్, 4 మర్లాస్) భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, అసలైన హక్కుదారులకు అప్పగించిందని  జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు. శనివారం అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే యుధ్‌వీర్ సేథీ అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ ఈవివరాలను ఒమర్ అబ్దుల్లా తెలిపారు. 

2024 నవంబరు నుంచి ఇప్పటివరకు కశ్మీరు లోయలో కశ్మీరీ పండిట్లకు చెందిన 105.525 ఎకరాల ( 844 కనాల్స్, 4 మర్లాస్) భూమిని గుర్తించి, హక్కుదారులకు అప్పగించామని చెప్పారు. అంతకుముందు 2023 డిసెంబరు నాటికే 365.5 ఎకరాల(2,924 కనాల్స్) కశ్మీరీ పండిట్ల భూమిని గుర్తించి, హక్కుదారులకు అప్పగించారని సీఎం గుర్తు చేశారు. 

ఈవిధంగా ప్రభుత్వ చొరవతో ఇప్పటివరకు 466.15 ఎకరాల భూమిని కశ్మీరీ పండిట్లు తిరిగి పొందారని తెలిపారు. కాగా, జమ్మూకశ్మీరు విపత్తు నిర్వహణ, సహాయం, పునరావాసం, పునర్నిర్మాణ శాఖ మంత్రిగానూ సీఎం ఒమర్ అబ్దుల్లాయే వ్యవహరిస్తున్నారు. 1 కనాల్ అంటే అర పావు ఎకరం (0.125 ఎకరాలు). 1 మర్లా అంటే 30.25 గజాల స్థలం (0.00625001 ఎకరాలు).

“జమ్మూకశ్మీరు వలసదారుల స్థిరాస్థి పరిరక్షణ చట్టంలోని నిబంధనల ప్రకారం కశ్మీరీ పండిట్ల భూములను ప్రభుత్వం గుర్తించి స్వాధీనం చేసుకుంది. కశ్మీరు లోయలోని డిప్యూటీ కమిషనర్ల సారథ్యంలో అన్ని జిల్లాల అధికార యంత్రాంగాలు కశ్మీరీ పండిట్ల భూములను గుర్తించాయి. అసలైన యజమానులకు వాటిని అప్పగించాయి” అని చెప్పారు. 

“ఈ భూముల అసలైన హక్కుదారులను (కశ్మీరీ పండిట్లను) గుర్తించి, వారికి భూములను అప్పగించే ప్రక్రియకు నోడల్ ఆఫీసర్లుగా అదనపు డిప్యూటీ కమిషనర్లు వ్యవహరించారు. ఈ భూముల అప్పగింత ప్రక్రియను పర్యవేక్షించి, వేగవంతం చేసేందుకు 2026 జనవరిలో ఒక స్టీరింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేశాం” అని ముఖ్యమంత్రి వివరించారు. 

“2024 నవంబరు నుంచి ఇప్పటివరకు షోపియన్ జిల్లాలో 35.375 ఎకరాలు(283 కనాల్స్), బారాముల్లా జిల్లాలో 28.125 ఎకరాలు(225 కనాల్స్), గండేర్బల్ జిల్లాలో 18.25 ఎకరాల(146 కనాల్స్) కశ్మీరీ పండిట్ల భూములను కబ్జాల చెర నుంచి అధికారులు విడిపించారు. అనంత్ నాగ్, బందీపొర, బుడ్గామ్, కుల్గామ్, కుప్వారా, పుల్వామా, శ్రీనగర్ జిల్లాల్లోనూ కొంతమేర కశ్మీరీ పండిట్ల భూములను ప్రభుత్వం గుర్తించి స్వాధీనం చేసుకుంది” అని తెలిపారు. 

“కశ్మీరు నుంచి వలస వెళ్లిపోయిన కశ్మీరీ పండిట్లు తమ భూములను క్లెయిమ్ చేసుకునేందుకు ఒక ఆన్‌లైన్ గ్రీవెన్స్ రిడ్రెసల్ పోర్టల్‌ను ప్రభుత్వం నిర్వహిస్తోంది. దానికి ఇప్పటిదాకా 10,173 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 9,713 దరఖాస్తులను అధికారులు పరిష్కరించి, 7,829 మందికి భూములను తిరిగి అప్పగించారు. కశ్మీరీ పండిట్ల ఇంకో 24 దరఖాస్తులే పెండింగ్ దశలో ఉన్నాయి” అని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చెప్పారు.

“కశ్మీరీ పండిట్ల భూములను కబ్జా చేసిన వారిపై ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేయాలని నేను డిప్యూటీ కమిషనర్లను ఆదేశించాను. ఆ భూములను గుర్తించిన వెంటనే జియో ట్యాగింగ్ చేయాలని సూచించాను. తద్వారా వాటిని కశ్మీరీ పండిట్లకు అప్పగించే వరకు అవకతవకలు జరిగే అవకాశాలు ఉండవు” అని స్పష్టం చేశారు. 

“కశ్మీరీ పండిట్ల భూముల వివరాల ప్రకారం రెవెన్యూ రికార్డులను అప్‌డేట్ చేయిస్తున్నాం. ఆయా భూములను చౌకగా అమ్ముకునే ఘటనలను కూడా నిశితంగా పర్యవేక్షించమని అధికారులకు చెప్పాను. కశ్మీరీ పండిట్ల కోసం ఏప్రిల్ 1 నుంచి 28 వరకు జమ్మూలో ఆన్ ది స్పాట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ క్యాంపులను నిర్వహించాలని మేం భావిస్తున్నాం” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

“కశ్మీరీ పండిట్ల కోసం మేం చాలా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. ఒక్కో కశ్మీరీ పండిట్‌కు ప్రతినెలా రూ.3,250 చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాం. అయితే ఒక్కో కుటుంబానికి ఈ నెలవారీ ఆర్థిక సాయం పరిమితి రూ.13వేలుగా ఉంటుంది. నేరుగా వాళ్ల బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు జమ అవుతాయి” అని తెలిపారు. 

“ఉచిత రేషన్ సరుకులను కూడా ప్రతినెలా ఇస్తాం. కశ్మీరీ పండిట్ల కోసం 5,248 డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించాం. మరో 6వేల తాత్కాలిక నివాసాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే 4,112 తాత్కాలిక నివాసాల పనులు పూర్తయ్యాయి. కశ్మీరీ పండిట్లకు 6వేల ప్రభుత్వ ఉద్యోగాలను మంజూరు చేశాం. వీటిలో 5,896 ఉద్యోగాల భర్తీ ఇప్పటికే పూర్తయింది” అని చెప్పారు.  కశ్మీరుకు తిరిగి వచ్చే కశ్మీరీ పండిట్ల సంక్షేమం విషయంలో రాజీపడేది లేదని ఒమర్ అబ్దుల్లా హామీ ఇచ్చారు.