తెలుగుదేశం ఆవిర్భావం …ఘనమైన నేపథ్యం

తెలుగుదేశం ఆవిర్భావం …ఘనమైన నేపథ్యం
టి.డి జనార్ధన్, మాజీ ఎమ్యెల్సీ,  
విక్రమ్ పూల, అధ్యక్షుడు, మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా సంఘం  
 
* నేడే 44వ ఆవిర్భావ దినోత్సవమ్ 
 
1982 మార్చి 29న నందమూరి తారక రామారావు స్థాపించిన రాజకీయ పార్టీ ‘తెలుగుదేశం’ 9 నెలల స్వల్ప వ్యవధిలోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించింది. తెలుగుదేశం ఆవిర్భావానికి దారితీసిన నేపథ్యం ఎంతో ఘనమైంది. 1981 అక్టోబర్ నెలలో ఊటీలో ఒకరోజు నందమూరి తారకరామారావు నటిస్తున్న ‘సర్దార్ పాపారాయుడు’ చిత్రం షూటింగ్ జరుగుతోంది. సమాజంలోని అన్యాయాల్ని, అక్రమాల్ని తుదముట్టించే పాపారాయుడు అనే పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు.
షూటింగ్ విరామంలో ఎన్టీఆర్ కుర్చీలో కళ్లుమూసుకొని కూర్చొని తర్వాత సన్నివేశంలోని డైలాగులు గుర్తు తెచ్చుకుంటున్నారు. అప్పుడే అక్కడకు వచ్చిన కొందరు పాత్రికేయులు ఆయన చుట్టూ చేరారు. హఠాత్తుగా ఓ పాత్రికేయుడు ‘సార్! మరో ఆరు నెలల్లో మీకు 60 సంవత్సరాలు పూర్తవుతున్నాయి షష్టిపూర్తి చేసుకోబోతున్నారు కదా! ఆ శుభ సందర్భంలో ఏదైనా నిర్ణయం తీసుకోబోతున్నారా?’ అని ప్రశ్నించాడు.
ఎన్టీఆర్ ఒక క్షణం ఆలోచించి ‘ఎక్కడో నిమ్మకూరులో పుట్టి పెరిగిన నన్ను తెలుగు ప్రజలు సినిమా నటుడిగా, తమ ‘అన్న’గా గత 30 సంవత్సరాలుగా నాపై అంతులేని అభిమానాన్ని, ప్రేమను చూపుతున్నారు. నా చిత్రాల్ని అభిమానంతో ఆదరించి నాకెంతో పేరు ప్రఖ్యాతులనిచ్చారు. ఇప్ప్పుడా రుణాన్నంతటినీ ఏదో ఒక రూపంలో తీర్చవలసిన బాధ్యత నాపై ఉంది. వచ్చే నా పుట్టిన రోజునాటి నుంచి సంఘసేవకు అంకితమవుతాను’ అని చెప్పారు.
ఎన్టీఆర్ ఎప్పుడూ ఏ విషయాన్నీ తేలిగ్గా చెప్పరు. చెప్పారంటే అది చేసి తీరుతారు. ఆ నిజం తెలిసిన పత్రికలు ఆయన ప్రకటనను ప్రముఖంగా ప్రచురించాయి. ఆ వార్త రాష్ట్రమంతటా కార్చిచ్చులా వ్యాపించింది. అంతటా పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి. ఎన్టీఆర్ అభిమానుల్లో ఉత్సాహం ఉరకలు వేసింది. రాజకీయ వర్గాల్లో పెను సంచలనం కలిగింది.
నాటి రాష్ట్ర రాజకీయ దుస్థితి
ఎన్టీఆర్ ప్రాంతీయ పార్టీ స్థాపించనున్నారన్న వార్త వెలువడే నాటికి ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులు అత్యంత దయనీయంగా ఉన్నాయి. 1978లో కేవలం 37% ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో ఎగిసిన గ్రూపు తగాదాలు భయంకరంగా తయారయ్యాయి. ముఖ్యమంత్రి చెన్నారెడ్డి తన షష్ఠిపూర్తి మహోత్సవాన్ని అత్యంత ఆడంబరంగా జరుపుకున్నారు. అందుకు పెద్ద మొత్తంలో అక్రమంగా నిధులు వసూలు చేశారనే ఆరోపణలొచ్చాయి.
జాతీయ కాంగ్రెస్ పార్టీకి నిధులు సమకూర్చే నెపంతో చెన్నారెడ్డి విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సొంత పార్టీ నేతలే ఆయనపై విమర్శలు చేశారు. ఆ సమయంలోనే హైదరాబాద్ పాత నగరంలో రమీజాబీ అనే మహిళపై ఓ పోలీస్ స్టేషన్‌లో జరిగిన అత్యాచార ఘటన దరిమిలా రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పి మత ఘర్షణలు రేగాయి. ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 50 రోజులపాటు కర్ఫ్యూ నీడలో పాతనగరం ప్రజలు బిక్కుబిక్కుమని గడిపారు.
అసమ్మతి కారణంగా మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి గద్దె నుంచి దిగాల్సి వచ్చింది. ఆ పదవికి టంగుటూరి అంజయ్యను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. 61 మందితో అంజయ్య భారీ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీపై గెలిచిన ప్రతి ఎమ్మెల్యేకు కార్పొరేషన్ పదవో, మరో పదవో ఇచ్చి తనకు అసమ్మతి లేకుండా చేసుకోవడానికి అంజయ్య తంటాలు పడ్డారు.
అంజయ్యను ఎవరు బెదిరిస్తే వారికి ప్రభుత్వంలో పదవి దక్కేది. రాష్ట్ర ఖజానా దివాళా తీస్తుందని పత్రికలు ఘోషించాయి. ఇంత చేసినా, శ్రీమతి ఇందిరాగాంధీ అండదండలున్నా అసమ్మతి కారణంగా అంజయ్య ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పు కోవాల్సి వచ్చింది. అంజయ్య స్థానంలో ఎమ్మెల్సీగా ఉన్న భవనం వెంకట్రామ్ రాష్ట్రానికి 3వ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన పాలనలో అవినీతి కొత్త పోకడలు పోయింది. రాష్ట్ర యంత్రాంగం పూర్తిగా సుషుప్తావస్థలోకి జారిపోయింది.
అసెంబ్లీ కాలపరిమితి మరో రెండు, మూడు నెలల్లో ముగుస్తుందనగా భవనంను తప్పించి కోట్ల విజయభాస్కర్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు. ఆ విధంగా ఐదేళ్ల వ్యవధిలో నలుగురు ముఖ్యమంత్రిలు మారారు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా, సీల్డు కవర్లో తాము నిర్ణయం చేసినవారే ముఖ్యమంత్రులయ్యే ఓ దుష్ట సాంప్రదాయాన్ని కాంగ్రెస్ అధిష్టానం నెలకొల్పింది. ముఖ్యమంత్రులైన వారిలో కొందరు సీఎం కుర్చీ ఎక్కేవరకు వారెవరో ప్రజలకే తెలియని పరిస్థితి ఉండేది.
ఐదేళ్ళ కాంగ్రెస్ పాలన ప్రజల్లో తీవ్రమైన ఏవగింపు
ఆ ఐదేళ్ళ కాంగ్రెస్ పాలన ప్రజల్లో తీవ్రమైన ఏవగింపు కలిగించింది. ముఖ్యమంత్రులను తరచుగా మార్చడం, ప్రభుత్వం అవినీతి కుంభకోణాల్లో ఇరుక్కోవడం పైకి కనిపించే కారణాలు. నిజానికి రాష్ట్రంలోని ఆర్థిక, రాజకీయ పరిపాలనా రంగాల్లో వైఫల్యం, నెలకొన్న సంక్షోభాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించగలిగారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా స్తంభించి పోయాయి. అభివృద్ధేతర ఖర్చులు దాదాపు రెట్టింపయ్యాయి. ఆ ఐదేళ్ళను కొందరు అవినీతికి స్వర్ణయుగంగా అభివర్ణించారు.
ముఖ్యమంత్రిగా ఎవరిని, ఎప్పుడు, ఎందుకు నియమిస్తారో, ఎందుకు తొలగిస్తారో ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి. రాజకీయ నాయకులతో, అధికారులు చేతులు కలిపిన రోజులవి. బహిరంగంగా, దౌర్జన్యంగా లంచాలు వసూలు చేస్తోంటే, కోట్లాది రూపాయల కుంభకోణాల్ని సృష్టిస్తోంటే పట్టించుకొనే వారే లేకుండా పోయారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఢిల్లీ అధిష్టానాన్ని కాకాపట్టి పదవులు కాపాడుకోవడానికి ఢిల్లీ చుట్టూ తిరుగుతూ, అధినాయకుల దర్శన భాగ్యం లభించక రోజుల తరబడి అక్కడి స్టార్ హోటళ్లలో, గెస్ట్ హౌస్‌లలో కాలక్షేపం చేస్తూంటే, ఇక్కడ రాష్ట్రంలో ఎవరికీ అడ్డూ అదుపు లేకుండా పోయింది.
రాష్ట్రంలో ఒక న్యాయం, చట్టం, ప్రభుత్వం అంటూ ఉన్నాయా అన్న సంశయం రాష్ట్ర ప్రజందరిలోనూ కలిగిన సందర్భం అది. అధికార పార్టీలో పరిస్థితులు ఆ విధంగా ఉంటే ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న కొందరు అధికార పక్షం కంటే అధ్వాన్నంగా పదవులకు ఆశపడి అధికారపక్షంలోకి ఎటువంటి సంకోచం లేకుండా చేరిపోయారు. అంతకుముందు రోజు వరకూ ముఖ్యమంత్రిపై ఆరోపణలు సంధించిన ప్రతిపక్ష నాయకుడొకరు తెల్లారేసరికల్లా పార్టీ ఫిరాయించి కేబినెట్ మంత్రి అయ్యారు. ఆ విధంగా అన్నిరకాల ప్రలోభాలతో, పదవుల ఎరతో అందర్నీ బుట్టలో వేసుకొని కాంగ్రెస్ తనకు ఎదురే లేదనుకుంది. అధికారం కోసం కాంగ్రెస్ అధిష్టానం అన్ని రకాల ప్రజాస్వామిక విలువలకు తిలోదకాలు ఇచ్చింది.
అటువంటి నేపథ్యంలోనే ఎన్టీఆర్ ప్రాంతీయ పార్టీ ఏర్పాటుకు సన్నద్ధం అయ్యారు. చలనచిత్ర రంగ సన్నిహితులు కొందరు ఆయనను ‘రాజకీయాలు బురదగుంట లాంటివి.. తెలిసి తెలిసీ అందులోకి దిగడం ఎందుకు? ఇక్కడ మీకు ఎదురులేదు. లక్షల సంపాదన వదులుకొని వెళ్లడం శుద్ధ దండగ’ అంటూ హెచ్చరించారు. సినిమా రంగంలో ఎన్టీఆర్ అప్పటికే నెంబర్ వన్. సినిమాల్లో కొనసాగితే బోలెడు డబ్బొస్తుందన్న విషయం ఎన్టీఆర్‌కు తెలుసు. కానీ, ఆయన దృష్టి డబ్బు మీద లేదు.
తెలుగు ప్రజల ఆత్మగౌరవం 
తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఢిల్లీ కాంగ్రెస్ నేతల పాదాల వద్ద తాకట్టు పెట్టడాన్ని ఆయన సహించలేక పోయారు. అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ కుమారుడు రాజీవ్ గాంధీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చారు. ఆయనకు ఘన స్వాగతం చెప్పడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అంజయ్య భారీ ఏర్పాట్లు చేశారు. అవన్నీ చూసిన రాజీవ్‌గాంధీ విమానాశ్రయంలోనే ముఖ్యమంత్రి అనే గౌరవం లేకుండా అందరి ముందు అంజయ్యను చెడామడా తిట్టారు.
ఆ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. అంజయ్యకు జరిగిన ఆ అవమానం తమకే జరిగినట్లుగా తెలుగు ప్రజానీకం భావించింది. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు దెబ్బతీయడాన్ని ఏ ఒక్కరూ సహించలేకపోయారు. కాగా, రాజకీయాల్లోకి రావాలని గట్టి నిర్ణయం తీసుకున్న ఎన్టీఆర్ ముందుగా తాను ఒప్పుకున్న చిత్రాల షూటింగ్ పూర్తి చేసుకొన్నారు.  1982 మార్చి 21న ఎన్టీఆర్ ఊటీ నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు.
అభిమానులు పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి వెళ్లి ఆయనకు ఘన స్వాగతం పలికారు. రాజకీయ పార్టీ ఏర్పాటుపై ఎన్టీఆర్ రామకృష్ణా స్టూడియోలో కొద్దిమంది సన్నిహితులతో చర్చించారు. పత్రికల వారితో ముచ్చటించారు. మార్చి 28న జూబ్లీహిల్స్‌లోని నాదెండ్ల గృహంలో ఎన్టీఆర్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో 13 మంది నేతలతో స్టీరింగ్ కమిటీ ఏర్పాటయింది. ఎన్టీఆర్‌ను పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 
మార్చి 29న మధ్యాహ్నం 2.30 గంటలకు నూతన పార్టీని ప్రారంభించడానికి ముహూర్తం నిర్ణయించారు. అనుకున్నట్లుగానే మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాద్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో చిన్న హాలులో కొద్దిమంది సమక్షంలో పార్టీ ఆవిర్భావాన్ని ప్రకటించాలనుకున్నారు. కానీ, ఆ ఉదయం నుంచే రాష్ట్రం నలుమూలల నుంచి ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు చేరుకున్నారు. వారంతా దిక్కులు పిక్కటిల్లేటట్లు ‘ఎన్టీఆర్ జిందాబాద’ అంటూ నినాదాలు చేస్తున్నారు.
న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆవరణలో పార్టీ ప్రకటన
దాంతో, పార్టీ ప్రకటన వేదికను న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆవరణలోని పచ్చిక మైదానంలోకి మార్చారు. ముహూర్తం సమయానికి కొన్ని నిముషాల ముందు ఎన్టీఆర్ న్యూఎమ్మెల్యే క్వార్టర్స్ చేరుకున్నారు. ఆయనను చూడగానే అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఎన్టీఆర్ వారిని ఉద్దేశించి ‘నా ప్రియమైన సోదర సోదరీమణులారా! కొన్ని నెలలుగా నేను రాజకీయాలలో ప్రవేశించడంపై తీవ్రంగా ఆలోచిస్తున్నాను.
ప్రజల స్పందన ఏ విధంగా ఉంటుందోనని అనుకున్నాను. కానీ ఎటువంటి ఆహ్వానం లేకుండానే మీరందరూ ఇక్కడకు రావడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. మీ అభిమానానికి పులకించిపోతున్నాను. ఈ క్షణాన నేను రాజకీయాలలో అడుగుపెడుతున్నాను’ అంటూ క్లుప్తంగా ఆయన తన ఉపన్యాసాన్ని ముగించగానే ఆ ప్రాంతమంతా చప్పట్లు, ఈలలు, నినాదాలతో మారు మ్రోగిపోయింది.
‘మీ పార్టీ పేరేంటి సార్?’ ఎవరో విలేకరి గుంపులోంచి ప్రశ్నించాడు. ఒక్క క్షణం అంతటా నిశ్శబ్దం. ఎన్టీఆర్ తన లాల్చీ జేబులోంచి ఓ కాగితం బయటకు తీశారు. దానిపై కొన్ని అక్షరాలు రాసి ఉన్నాయి. ఎన్టీఆర్ ‘తెలుగుదేశం’ అని అంటూ ‘నేను తెలుగువాణ్ణి. ఈ రోజు నుంచి నా జీవితాన్ని తెలుగు ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం అంకితం చేస్తున్నాను. మహోన్నతమైన తెలుగు సంస్కృతిని, తెలుగు భాష ఔన్నత్యాన్ని, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుతాను. అందుకే మా పార్టీ పేరును ‘తెలుగుదేశం’ గా నామకరణం చేస్తున్నాను’ అని ప్రకటించారు.
ఆ విధంగా 44 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. పార్టీ ఏర్పాటు తర్వాత ఎన్టీఆర్ చైతన్య రథంపై ప్రజల వద్దకు వెళ్లారు. రాష్ట్ర వ్యాప్తంగా పగలు, రాత్రి అనే తేడా లేకుండా 36వేల కిలోమీటర్లు ప్రయాణం చేశారు. ఆదిలాబాద్, శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు మారుమూల గ్రామీణ ప్రాంతాలకుసైతం వెళ్లి ప్రజల ఇబ్బందులను ప్రత్యక్షంగా చూశారు. వారిలో భరోసా నింపారు. పేద వాడికి పట్టెడన్నం పెట్టడమే తన పార్టీ మూల సిద్ధాంతం అని స్పష్టం చేశారు.
ఎన్టీఆర్ పిలుపు రాష్ట్రంలో ప్రభంజనం
ప్రజలే దేవుళ్లు.. సమాజమే దేవాలయం.. తెలుగుదేశం పిలుస్తోంది రా.. కదలిరా అంటూ ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపు రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించింది. వయస్సుతో నిమిత్తం లేకుండా యువత, మహిళలు, వ ద్ధులు ప్రతి ఒక్కరూ చైతన్య రథం వెంట పరుగులు తీశారు. వినూత్నమైన ప్రచారశైలి, మీ ఉన్నతమైన సిద్ధాంతాలు, సామాన్యులు బడుగుబలహీన వర్గాలకు ఇచ్చిన రాజకీయ భాగస్వామ్యం, ఉవ్వెత్తున లేచిన తెలుగువారి ఆత్మగౌరవ బావుటా.. అన్నిటికి మించి ఎన్టీఆర్ నిబద్ధత ఇలా అనేక అంశాలు కలిసి రావడంతో ఎన్నికల్లో తెలుగుదేశం ఘన విజయం సాధించి చరిత్ర స ష్టించింది.
తొలి రోజు నుంచి నేటి వరకు రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, పరిపాలనా రంగాల్లో తెలుగుదేశం పార్టీ ముద్ర సుస్పష్టంగా కనిపిస్తుంది. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ నేతృత్వంలో దాదాపు 8 సంవత్సరాలు, చంద్రబాబునాయుడు గారి సారథ్యంలో 9 సంవత్సరాలు అధికారంలో కొనసాగిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రయోజనాలే పరమార్ధంగా ఎక్కడా రాజీపడకుండా పరిపాలన సాగించింది. ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలతోపాటు దేశ రాజకీయాలను సైతం శాసించగలిగే స్థానానికి చేరుకుంది.
ఆ క్రమంలో ఎన్నో ఎన్నెన్నో అరుదైన మైలురాళ్లను నెలకొల్పింది. తెలుగుదేశం పార్టీ చరిత్రలో అడుగడుగునా అద్భుత ఘట్టాలు కనిపిస్తాయి. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రప్రదేశ్‌లో 2014-19 మధ్య ఐదేళ్లు; తిరిగి 2024 నుంచి నారా చంద్రబాబునాయుడి సారథ్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో వడివడిగా ముందుకు తీసుకువెళుతున్న తెలుగుదేశం పార్టీ అన్ని విధాలా ఆదర్శప్రాయంగా నిలుస్తోంది.
ఈ నాలుగున్నర దశాబ్దాల ప్రస్థానంలో తెలుగుదేశం తన మూల సిద్ధాంతంలో ఎటువంటి మార్పు లేకుండా ఎన్టీఆర్ ఆశయాలు, చంద్రబాబునాయుడి విధానాలను కొనసాగిస్తూనూ నేడు 3.0 అధ్యాయంలోకి ప్రవేశించింది. యుతనేత నారా లోకేష్ ఆధునిక ఆలోచనలకు అనుగుణంగా మరింత వినూత్నంగా ముందుకుసాగుతోంది. ఒకప్ప్పుడు ఎన్టీఆర్ సారథ్యంలో తెలుగువారి అస్థిత్వానికి, గౌరవానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించగా.. నేడు చంద్రబాబునాయుడి గారి నాయకత్వంలో తెలుగువారు ప్రపంచంలోని అన్ని రంగాల్లో సమున్నత స్థానాల్లో రాణిస్తున్నారు. నాలుగున్నర దశాబ్దాల తెలుగుదేశం పార్టీ సాధించిన ఘనత ఇది!