* నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంకు ప్రధాని మోదీ ప్రారంభం
పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల ప్రపంచం ఆందోళన చెందుతున్న తరుణంలో, భారత్ మాత్రం ఆ సంక్షోభాన్ని పూర్తి శక్తితో ఎదుర్కొంటోందని ప్రధాని మోదీ తెలిపారు. ఆ భారం సామాన్య కుటుంబాలతోపాటు రైతులపై పడకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రజలు, రైతులపై యుద్ధ భారం పడకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు.
సంక్షోభ సమయంలో కూడా ఎలాంటి అంతరాయం లేకుండా దేశంలో అభివృద్ధి కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఇలాంటి సమయాల్లో ప్రజలు ఐక్యతతో ఉండాలని, ప్రశాంతతను పాటించాలని మోదీ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులు కూడా పాల్గొన్నారు.
2004లో ప్రతిపాదించినప్పటికీ పదేళ్ల పాటు కేంద్రంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న ఎస్పీ ప్రభుత్వం దీనిని ముందుకు తీసుకెళ్లడంలో విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఉత్తర ప్రదేశ్ పశ్చిమ ప్రాంత అభివృద్ధిని గత పాలకులు అడ్డుకున్నారని ఆరోపించారు. 2014 తర్వాత దేశంలో, 2017 తర్వాత ఉత్తరప్రదేశ్‌లో వచ్చిన మార్పుల వల్ల ఆగిపోయిన ప్రాజెక్టులన్నీ వేగవంతమయ్యాయని మోదీ చెప్పుకొచ్చారు.
పర్యావరణ, భూసేకరణ వంటి క్లిష్టమైన సమస్యలను పరిష్కరించి ప్రాజెక్టులను పట్టాలెక్కించినట్లు తెలిపారు. జేవార్ ఎయిర్పోర్ట్ కేవలం విమానాశ్రయం మాత్రమే కాదని, ఇది ఈ ప్రాంతానికి ‘లాజిస్టిక్స్ గేట్‌వే’గా మారుతుందని ఆయన అభివర్ణించారు. ఈ ప్రాజెక్టు ద్వారా లక్షలాది మంది యువతకు ఉపాధి లభించడమే కాకుండా, పశ్చిమ యూపీ పారిశ్రామిక హబ్‌గా మారుతుందని స్పష్టం చేశారు. ఈ ఎయిర్పోర్ట్ దేశ విమానయాన రంగంలో సరికొత్త రికార్డులకు వేదిక కానుంది.
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఏర్పడుతున్న విపరీతమైన రద్దీని తగ్గించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యంగా ఉంది. దాదాపు రూ.11,200 కోట్ల వ్యయంతో, 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడితో (ఎఫ్‌డీఐ)జ్యూరిచ్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ దీనిని నిర్మించింది. నోయిడా, మీరట్, ఘజియాబాద్, మథుర, ఆగ్రా తదితర ప్రధాన నగరాలకు ఇది ప్రధాన కేంద్రంగా మారనుంది. నేడు ప్రధాని పర్యటన నేపథ్యంలో జేవార్‌లో ఐదు అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. సుమారు 5 వేల మంది పోలీసులు, ఎస్పీజీ, ఏటీఎస్, సీఐఎస్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి.
భద్రతా కారణాల దఅష్ట్యా ఈ ప్రాంతాన్ని ‘నో ఫ్లై జోన్’గా ప్రకటించారు. మరోవైపు, ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు యమునా ఎక్స్‌ప్రెస్‌వే, పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వే మీదుగా వెళ్లే భారీ వాహనాలను పోలీసులు మళ్లించారు. అయితే, అంబులెన్స్‌లు, ఇతర అత్యవసర వాహనాలకు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
పూర్తిస్థాయి అభివృద్ధి తర్వాత నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ఆసియాలోనే అతిపెద్దదిగా, ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద విమానాశ్రయాలలో ఒకటిగా రికార్డు సృష్టిస్తుంది. ఈ ప్రాజెక్టు మొత్తాన్ని నాలుగు దశలలో రూపొందిస్తున్నారు. ప్రాజెక్టు విస్తీర్ణం కూడా దశలవారీగా పెంచనున్నారు. మొదటి దశలో సుమారు 3296ఎకరాలలో విమానాశ్రయం విస్తరించి ఉంది. ఇందులో 3900మీటర్ల పొడవైన రన్ వే, ఒక ప్యాసింజర్ టెర్మినల్, కార్గో టెర్మినల్, ఏటీసీ టవర్, టాక్సీవేస్ వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి.
ఈ దశ పూర్తయితే సంవత్సరానికి 12 మిలియన్ల మంది ప్రయాణికులు ఇక్కడి నుండి ప్రయాణం చేసే అవకాశం ఉంది. భారతీయ వారసత్వాన్ని, సంప్రదాయ ఘాట్ లను, హవేలీలో సౌందర్యాన్ని మేళవించి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునిక మౌలిక సదుపాయాలను ఈ విమానాశ్రయాన్ని రూపొందించారు .ఈ విమానాశ్రయాన్ని ప్రపంచ స్థాయి విమాన కేంద్రంగా మార్చటంపై దృష్టి పెట్టిన కేంద్రం ఆ దిశగా అడుగులు వేస్తుంది.

More Stories
‘బాధితురాలి కార్డు’ను వాడుతున్న మమతా
10 లక్షల సైనికులతో అమెరికాను ఢీకొట్టేందుకు ఇరాన్ సన్నద్ధం
పరిపూర్ణ మానవత్వానికి ప్రతిరూపం శ్రీ రాముడు