నల్సార్‌ యూనివర్సిటీలో గంజాయి కలకలం

నల్సార్‌ యూనివర్సిటీలో గంజాయి కలకలం
శామీర్‌పేటలోని నల్సార్‌ యూనివర్సిటీలో గంజాయి నెట్‌వర్క్‌ వెలుగులోకి వచ్చింది. గత నెలలో ఈ యూనివర్సిటీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థి జేబులో నుంచి గంజాయి ప్యాకెట్‌ మాయమైనట్టు పోలీసులు గుర్తించారు. ఈగల్‌ టీం విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదం విషయంలో గతంలో నమోదైన కేసుతో పాటు తాజాగా మరో నలుగురు విద్యార్థులపై కేసు నమోదైంది. 
 
ఫిబ్రవరి 21వ తేదీ రాత్రి శామీర్‌పేట నుంచి నల్సార్‌ యూనివర్సిటీ వైపు విద్యార్థులు ప్రియాంశు కుమార్‌ మీనా, సాక్షం, గోపీచంద్‌ బైక్‌పై వెళ్తున్నారు. పెద్దమ్మ కాలనీ సమయంలో నిలిపి ఉన్న ఓ ట్రక్కును వీరు ఢీకొట్టారు.  ఈగల్‌ టీమ్‌  ప్రవేశంతో ప్రమాదం జరిగిన రోజు విద్యార్థుల్లో కొందరు మత్తులో ఉన్నారని గుర్తించి, మృతి చెందిన సాక్షంతో ఉన్న నలుగురిని 24వ తేదీన పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. 
 
ఈ విచారణకు ద్రిషిక్‌ రాజ్‌, గోపీచంద్‌ హాజరయ్యారు. వీరికి డ్రగ్‌ టెస్ట్‌ చేయగా, ద్రిషిక్‌ రాజ్‌కు పాజిటివ్‌ వచ్చింది. తాను 2024 నుంచి గంజాయి తీసుకుంటున్నానని, యూనివర్సిటీకి చెందిన రుషి అనే విద్యార్థి వద్ద నుంచి 5 గ్రాముల గంజాయికి రూ. వెయ్యి ఇచ్చి కొన్నట్టు వెల్లడించాడు.  తన స్నేహితులు అభిషేక్‌, అర్యాన్‌ ప్రభులు కూడా గంజాయి సేవిస్తారని దర్యాప్తులో వివరించాడు.
రోడ్డు ప్రమాదానికి ముందు సాక్షం జేబులో చిన్న గంజాయి ప్యాకెట్‌ ఉందని, ఆ తరువాత అది కనిపించలేదని చెప్పాడు. దీంతో శామీర్‌పేట్‌ ఎస్‌ఐ శిశివర్ధన్‌రెడ్డి తాజాగా ఫిర్యాదు చేయడంతో నలుగురు విద్యార్థులపై ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు.

మరోవంక, తెలంగాణలో సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో నిందితులకు ఊరట లభించలేదు. అరెస్టయిన ముగ్గురు నిందితులకు రిమాండ్‌ను ఏప్రిల్ 8 వరకు పొడిగిస్తూ ఉప్పరపల్లి కోర్టు గురువారం నిర్ణయం తీసుకుంది. నేటితో నిందితుల కస్టడీ ముగియడంతో సిట్ అధికారులు వారిని కోర్టులో హాజరుపరిచారు.  ఈ సందర్భంగా మరో ఐదు రోజులు వారిని తమ కస్టడీకి ఇవ్వాలని కోరారు. కౌంటర్‌ దాఖలు చేసేందుకు సమయం కావాలని నిందితుల తరుపు లాయర్లు కోరడంతో కోర్టు రిమాండ్‌ పొడిగించింది.