మోదీ సభకు స్పందన తెలంగాణాలో బీజేపీ ఎదుగుదలకు నిదర్శనం 

మోదీ సభకు స్పందన తెలంగాణాలో బీజేపీ ఎదుగుదలకు నిదర్శనం 
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభకు ఎన్నికలు లేని సమయంలో తెలంగాణ ప్రజలు స్వచ్ఛందంగా భారీ ఎత్తున తరలిరావడం తెలంగాణలో బీజేపీపై పెరుగుతున్న ఆదరణకు నిదర్శనమని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు తెలిపారు.  సాధు సమాజం నుంచి స్వామీజీలు, బంజారా మరియు లంబాడీ సమాజాల మహిళలు, డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, న్యాయవాదులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం సభను ఒక మహోత్సవంలా మార్చిందని తెలిపారు. 
 
తెలంగాణ సమాజంలోని ప్రతి వర్గం బీజేపీ వైపు ఆశతో చూస్తోందని పేర్కొంటూ దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రజలు మద్దతు ఇస్తున్న తరహాలోనే తెలంగాణలో కూడా రాజకీయ మార్పు అనివార్యమవుతోందని ఆయన స్పష్టం చేశారు. ప్రధానమంత్రి మోదీ నాయకత్వం తెలంగాణలో కొత్త రాజకీయ దిశను తీసుకురాబోతోందని, రాబోయే రోజుల్లో బీజేపీ తెలంగాణలో బలమైన ప్రత్యామ్నాయంగా అవతరించబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక, మహిళా వ్యతిరేక, యువత వ్యతిరేక విధానాలతో ముందుకెళ్తోందని విమర్శించారు. గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చి వాటిని పూర్తిగా విస్మరించిందని ధ్వజమెత్తారు. “మోదీ గ్యారంటీ అంటే తెలంగాణ అభివృద్ధి, యువతకు ఉద్యోగ అవకాశాలు, రాష్ట్ర ఆర్థిక పురోగతి” అని స్పష్టం చేశారు.  తెలంగాణలో ప్రజా సమస్యలపై బిజెపి ఉద్యమ పంథాలో పోరాటం కొనసాగిస్తుందని పేర్కొంటూ కార్యకర్తలు అధికారం లక్ష్యంగా మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దారిలో నడుస్తోందని ఆయన విమర్శించారు.  ఓటర్ జాబితా సవరణ ప్రక్రియపై జరుగుతున్న విమర్శలను ఖండించిన ఆయన, ఇది భారత ఎన్నికల సంఘం పర్యవేక్షణలో జరుగుతున్న సాధారణ ప్రక్రియ మాత్రమేనని చెప్పారు. దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, చనిపోయిన వారి పేర్ల తొలగింపే లక్ష్యమని, అసలైన ఓటర్ల హక్కులకు ఎలాంటి భంగం కలగదని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ మత రాజకీయాలను ప్రోత్సహిస్తోందని విమర్శించిన రాంచందర్ రావు  “ప్రభుత్వం అందరినీ సమానంగా చూడాలి. కానీ కాంగ్రెస్ పార్టీ తనను తాను ముస్లిం లీగ్ తరహా పార్టీగా మార్చుకుంటోంది అని మండిపడ్డారు. దేవాలయాల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందని కూడా ఆరోపించారు.  చివరిగా, సభను విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకు, ప్రజలకు, మీడియా ప్రతినిధులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో కమలం వికసించే దిశగా ప్రజల ఆశీర్వాదం బీజేపీకి లభిస్తుందని భరోసా వ్యక్తం చేశారు.