2024-25 సంవత్సరంలో ఇతర పార్టీలతో పోలిస్తే పది రెట్లు అధికంగా బిజెపి విరాళాలు అందుకున్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఎడిఆర్) పేర్కొంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2024-25లో జాతీయ పార్టీలకు అందిన విరాళాలు 161శాతం పెరిగాయి. ఇందులో పాలక బిజెపిదే అగ్ర స్థానంగా వుంది. జాతీయ స్థాయిలో ఇతర రాజకీయ పార్టీలన్నీ అందుకున్న మొత్తాల కంటే పది రెట్లు పైనే బిజెపికి విరాళాలు వచ్చాయని ఎడిఆర్ నివేదిక వివరించింది.
జాతీయ పార్టీలు ప్రకటించిన రూ.20వేల పైచిలుకు విరాళాలు, 11,343 మంది నుండి రూ.6,648.563 కోట్లు మేరకు అందాయని ఆ నివేదిక పేర్కొంది. ఇందులో కేవలం బిజెపికే 5,522 విరాళాల ద్వారా రూ.6,074.015 కోట్లు వచ్చాయి. ఆ తర్వాత కాంగ్రెస్‌కు 2,501 విరాళాల ద్వారా రూ.517.394 కోట్లు అందాయి. కాంగ్రెస్, ఆప్, సిపిఎం, నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పిఇపి)లు ఇదే కాలంలో అందుకున్న మొత్తం విరాళాల కన్నా బిజెపి విరాళాలు పదిరెట్లు దాటిపోయాయని నివేదిక పేర్కొంది.
కాగా తమకు రూ.20వేల పైచిలుకు విరాళాలేవీ రాలేదని బహుజన సమాజ్ పార్టీ (బిఎస్‌పి) వెల్లడించింది. గత 19ఏళ్ళ నుండి ఈపార్టీ ఇదే తీరున ప్రకటిస్తూ వస్తోంది. మొత్తం విరాళలో బిజెపి పార్టీ ఒక్కటే 5,522 విరాళాల ద్వారా రూ.6,074.015కోట్లు పొందింది. తరువాతి స్థానంలో కాంగ్రెస్ పార్టీకి 2,501 విరాళాల ద్వారా రూ.517.394కోట్లతో తరువాతి స్థానంలో నిలిచింది. 2023-24తో పోలిస్తే 2024-25లో జాతీయ పార్టీలకు వచ్చిన మొత్తం విరాళాలు రూ.4,104.265 కోట్లు మేరా పెరిగాయి. కేవలం బిజెపి వసూళ్ళే రూ.2,243.947 కోట్ల నుండి 171 శాతం మేరా పెరిగాయి.
అదే సమయంలో కాంగ్రెస్‌వి 84శాతం మేరా పెరిగాయి. రూ.281.48కోట్ల నుండి రూ.517.394 కోట్లకు పెరిగాయి. ఇక ఇతర పార్టీల్లో ఆప్‌కు రూ.27.044కోట్లు రాగా, 244శాతం పెరుగుదల నమోదైంది. ఎన్‌పిఇపికి రూ.1.943కోట్లు రాగా, 1313శాతం మేరా పెరుగుదల నమోదైందని నివేదిక పేర్కొంది. రాజకీయ నిధుల్లో కార్పొరేట్ విరాళాలదే ఆధిపత్యం. 3,244 విరాళాల ద్వారా అందిన మొత్తం విరాళాల్లో 6,128.787 కోట్లు అంటే 92.18శాతం వాటా వీటిదే.
ఇక వ్యక్తిగతంగా దాతలు అంటే 7900 మంది అందించిన విరాళాలు రూ.505.66కోట్లుగా వున్నాయి. మొత్తంలో వీటి వాటా 7.61శాతంగా వుంది. 2,794 కార్పొరేట్ విరాళాల ద్వారా బిజెపికి రూ.5,717.167కోట్లు అందాయి. ఇతర జాతీయ పార్టీలన్నీ కలిసి అందుకున్న మొత్తాలు రూ.411.62కోట్లతో పోలిస్తే బిజెపి అందుకున్నది 13 రెట్ల కన్నా ఎక్కువగానే వుంది. 2,627 మంది దాతల నుండి రూ.345.94కోట్లు కూడా అందుకుంది. 112 కార్పొరేట్ విరాళాల ద్వారా కాంగ్రెస్ రూ.383.86కోట్లు అందుకుంది. 2,357 మంది వ్యక్తుల నుండి రూ.132.39కోట్లు అందుకుంది.
అందరికంటే అధికంగా విరాళాలు అందించిన దాతల్లో ప్రూడెండ్ ఎలక్టోరల్ ట్రస్ట్ ముందుంది. బిజెపి, కాంగ్రెస్, ఆప్‌లకు కలిపి ఈ సంస్థ మొత్తంగా రూ.2413.465 కోట్లు విరాళమిచ్చింది. ఇందులో, బిజెపికి రూ.2,180.7110కోట్లు (పార్టీ అందుకున్న మొత్తం నిధుల్లో 35.90శాతం) ఇచ్చింది. కాంగ్రెస్‌కు రూ.216.335 కోట్లు (ఈ పార్టీ అందుకున్న మొత్తం నిధుల్లో 41.81శాతం) రాగా, ఆప్‌కు రూ.16.4178కోట్లు (ఈ పార్టీ అందుకున్న మొత్తంలో నిధుల్లో 43.08శాతం) వచ్చాయి.
More Stories
ఖార్గ్ ద్వీపం కోసం అమెరికా, ఇరాన్ సేనల మోహరింపు
ఆపరేషన్ సిందూర్‌పై వివేక్ అగ్నిహోత్రి సినిమా
పశ్చిమ ఆసియా సంక్షోభంపై ప్రభుత్వంకు ముస్లిం ఎంపీ మద్దతు!