ఇరాన్ నౌకాదళ అధిపతి తంగ్సిరి వైమానిక దాడిలో మృతి

ఇరాన్ నౌకాదళ అధిపతి తంగ్సిరి  వైమానిక దాడిలో మృతి

* రుష్యా చమురుతో వెళ్తున్న ట్యాంకర్‌పై దాడి 

ఇజ్రాయెల్‌తో యుద్ధంలో వరుసగా అగ్రనాయకత్వాన్ని కోల్పోతున్న ఇరాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది.  అత్యంత శక్తివంతమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) నావికా దళం చీఫ్‌ అలీరెజా తాంగ్సిరి మరణించాడు.  అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన ఉమ్మడి  వైమానిక దాడుల్లో అతడు ప్రాణాలు కోల్పోయినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. 

ఇరాన్ నావికా దళానికి నాయకత్వం వహిస్తున్న టాప్ కమాండర్‌ అలీరెజాను ఐఆర్‌జిసి నావికాదళ సీనియర్ కమాండర్లతో సమావేశమవుతున్న సమయంలో ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ ఓడరేవు నగరంలో తంగ్సిరిని లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయిల్ అధికారులు తెలిపారు.   ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ మాట్లాడుతూ, నావికాదళ కమాండర్ అలీరెజా తంగ్సిరి ఇజ్రాయెల్ దాడిలో హతమయ్యారని తెలిపారు.

 “హోర్ముజ్ జలసంధిలో మైనింగ్‌లు అమర్చి, సముద్ర రవాణాను నిరోధించే ఉగ్రవాద చర్యకు ప్రత్యక్షంగా బాధ్యుడైన ఐఆర్‌జిసి నావికాదళ కమాండర్‌ను ఐడిఎఫ్ హతమార్చింది,” అని కాట్జ్ పేర్కొన్నారు. ఈ దాడి ఐఆర్‌జిసికి ఒక “సందేశం” అని కాట్జ్ చెబుతూ ఐడిఎఫ్ మిమ్మల్ని వేటాడి, ఒక్కొక్కరినీ హతమారుస్తుందని హెచ్చరించారు. 

 2018 నుండి  ఐఆర్‌జీసీ  నావికాదళ బాధ్యతలు చేపట్టిన తంగ్సిరి, ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయ వంటి హోర్ముజ్ జలసంధిపై పట్టు సాధించడంలో అగ్రగామిగా నిలిచారు. జలసంధిని మూసివేయడం ద్వారా అంతర్జాతీయ చమురు సరఫరాను అడ్డుకుంటామన్న ఇరాన్ హెచ్చరికల వెనుక ఈయనే ప్రధాన వ్యూహకర్తగా ఉండేవారు.

ఇరాన్, దేశ భద్రతా దళాలు ఈ విషయాన్ని ధృవీకరించలేదు. ఇరాన్ నావికా దళ సామర్ధ్యం పెంచడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. దేశంలో తొలి డ్రోన్ క్యారియర్ నౌకను ఆవిష్కరించాడు. తమకు ఎదురొస్తే నరకాన్ని చూపిస్తామని శతృవులను హెచ్చరించాడు. అలాగే, తమతో సముద్ర ప్రాంతంలో పోరాడే స్తాయి అమెరికాకు లేదని గత ఏడాది అలీరెజా తెలిపాడు.

కాగా, రష్యా చమురు రవాణా చేస్తున్న ట్యాంకర్‌ నౌకపై టర్కీ తీరం సమీపంలోని నల్ల సముద్రంలో డ్రోన్ బొట్టు దాడి జరిగింది. ఈ దాడి వల్ల నౌక బ్రిడ్జిపై పేలుడు సంభవించిందని, ఇంజిన్ రూమ్‌లోకి నీరు ప్రవేశించిందని టర్కీ మీడియా పేర్కొంది. షిప్ ట్రాకింగ్ డేటా ప్రకారం సియెర్రా లియోన్ జెండా కలిగిన ‘అల్టురా’ నౌక సుమారు 10 లక్షల బ్యారెల్స్‌ ముడి చమురుతో రష్యాలోని నోవోరోస్సిస్క్ ఓడరేవు నుంచి బయలుదేరింది. 

అయితే యూరోపియన్ యూనియన్, బ్రిటన్ దీనిపై ఆంక్షలు విధించాయి. ఇస్తాంబుల్ బోస్ఫరస్ జలసంధికి సుమారు 15 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న ఈ ట్యాంకర్‌ను డ్రోన్ బోటు ఢీకొట్టినట్లు తెలిపింది.