ఒక గంటా 45 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి, కాంగ్రెస్ నేతలు ముకుల్ వాస్నిక్, తారిఖ్ అన్వర్, సమాజ్‌వాదీ పార్టీ నేతలు ధర్మేంద్ర యాదవ్, జావెద్ అలీ, సీపీఎం నేత జాన్ బ్రిట్టాస్, ఎల్‌జేపీ నేత అరుణ్ భారతి, డీఎంకే నేత పి.విల్సన్, ఆప్ ఎం సంజయ్ సింగ్, జేడీయూ నేత రాజీవ్ సింగ్, సంజయ్ ఝా తదితరులు పాల్గొన్నారు. టీఎంసీ నుంచి ఎవరూ హాజరుకాలేదు.
అఖిలపక్ష సమావేశానంతరం కిరణ్ రిజిజు మాట్లాడుతూ, సమావేశంలో అన్ని పార్టీలు చురుకుగా పాల్గొన్నాయని, ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం, భారత్‌పై దాని ప్రభావంపై సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశాయని తెలిపారు. ప్రభుత్వం సమగ్రంగా, సంపూర్ణంగా స్పందించిందని, విపక్షాలందరి ప్రశ్నలన్నింటికీ సంతృప్తికరంగా సమాధానాలిచ్చిందని చెప్పారు.
ప్రస్తుత పరిస్థితిని సమర్ధవంతగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వానికి మద్దతుగా నిలబడతామని విపక్ష పార్టీలు హామీనిచ్చాయని చెప్పారు. ‘ప్రస్తుత సంక్షోభ సమయంలో పరిస్థితికి అనుగుణంగా ప్రభుత్వం తీసుకునే చర్యలకు సమష్టిగా మద్దతు ఇస్తామని విపక్షాలు తెలిపాయి’ అని రిజిజు వివరించారు.
నాలుగైదు రోజుల్లో భారత్‌కు రానున్న 4 నౌకలు
కాగా, దేశంలో ఇంధన భద్రత స్థిరంగా, దేశ ఇంధన అవసరాలకు సరిపడా ఉందని అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం పేర్కొన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. సరకు కోసం అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడంతో పాటు వివిధ దేశాలతో సంప్రదింపులు సాగిస్తున్నామని, నిరంతరాయ ఇంధన సరఫరాకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు పేర్కొన్నాయి.
ఎల్‌జీపీ లభ్యత, హోర్ముజ్ జలసంధి మీదుగా షిప్‌మెంట్‌పై సమావేశంలో విపక్షాల ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే పరిస్థితి అదుపులోనే ఉందని, మరో నాలుగైదు రోజుల్లో నాలుగు నౌకలు పోర్టుకు చేరుకుంటాయని ప్రభుత్వం తెలిపింది. ఎలాంటి ఇంధన కొరత లేదని, తగినన్ని నిల్వలు ఉన్నాయని వివరించింది. అఖిలపక్షానికి హాజరైన అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని, విపక్షాలతో ఏ సమయంలోనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపింది. దేశ ప్రజల ప్రయోజనాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, విపక్షాలతో చర్చలకు తలుపులు తెరిచే ఉంటాయని రాజ్‌నాథ్ అఖిలపక్ష సమావేశంలో పేర్కొన్నారు.
యుద్ధంతో తలెత్తిన పరిణామాలు, ఇంధన భద్రతపై ఆందోళనలు, ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లను విదేశాంగ కార్యదర్శి మిస్రీ అఖిల పక్ష నేతలకు వివరించారు. మొత్తం మీద పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, దేశీయంగా ప్రజల ఆందోళనలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందనే సందేశాన్ని అఖిలపక్ష సమావేశం ఇచ్చింది.
ఇలా ఉండగా, దేశంలో ఇంధన సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రష్యా నుంచి భారీగా ముడి చమురును కొనుగోలు చేస్తోంది. తాజాగా రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును భారత రిఫైనరీలు కొనుగోలు చేసినట్టు ‘బ్లూమ్‌బర్గ్’ తన కథనంలో పేర్కొంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లోని బ్రెంట్ క్రూడాయిల్ ధర కంటే, బ్యారెల్‌కు 5-15 డాలర్లు అధికంగా చెల్లించి మరీ భారత రిఫైనరీలు ఈ కొనుగోళ్లు జరిపినట్టు సమాచారం.
ఫిబ్రవరిలో రష్యా నుంచి కొనుగోలు చేసిన ముడి చమురుతో పోల్చుకుంటే ఈ కొనుగోళ్లు దాదాపు రెట్టింపు కావడం గమనార్హం. హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసి ముడి చమురు సరఫరాకు ఆటంకం కలిగించిన నేపథ్యంలో.. రష్యా క్రూడాయిల్‌పై అమెరికా ఆంక్షలు సడలించింది. దీంతోనే భారత్ రిఫైనరీలు ఇంత భారీ స్థాయిలో కొనుగోళ్లు జరిపాయి. హోర్ముజ్ జలసంధి దగ్గర నౌకల ప్రయాణానికి అంతరాయం కొనసాగినంత కాలం రష్యా ముడి చమురుపై ఆంక్షల సడలింపును అమెరికా పొడిగించే అవకాశం కనిపిస్తోందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న ఇరాన్ చమురుపై కూడా ఆమెరికా ఆంక్షలు ఎత్తేసింది. ఆ చమురును కూడా భారత రిఫైనరీలు కొనుగోలు చేసినట్టు వార్తలు వచ్చాయి.

More Stories
ఎవరూ చర్చించని ‘డచ్ డిసీజ్’, కొద్దిమందే సిద్ధంగా `ఏఐ తుఫాను’
అమెరికా 15-సూత్రాల శాంతి ప్రతిపాదనను తిరస్కరించిన ఇరాన్!
కాశ్మీర్ లో ‘లక్షిత’ హిందువుల హత్యలపై నివేదిక కోరిన ఎన్హెచ్ఆర్సి