*గవర్నర్ శుక్లాకు బిజెపి వినతిపత్రం
తెలంగాణ శాసనసభలో జాతీయ గీతం ‘వందేమాతరం’ ఆలాపన జరుగుతుండగా వాకౌట్ చేసిన ఎంఐఎం ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు నేతృత్వంలోని పార్టీ ప్రతినిధి బృందం రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాకు బుధవారం వినతిపత్రం సమర్పించింది.
ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిగా నిలిచిన వందేమాతరం గీతాన్ని ఆలపిస్తున్నప్పుడు ఎంఐఎం ఎమ్మెల్యేలు బయటకు వెళ్లడం అంటే దేశాన్ని, జాతీయ గీతాన్ని, రాజ్యాంగాన్ని అవమానించడమే అని స్పష్టం చేశారు. మజ్లిస్ నాయకులకు ‘‘భారత్ మాతా కీ జై’’ అనడం రాదు, ‘‘జై హింద్’’ అనడం రాదు కానీ ‘‘జై పాలస్తీనా’’ అంటారని ఎద్దేవా చేశారు.
వందేమాతర గీతం ఆలపించే సమయంలో వాకౌట్ చేయడం అంటే కేవలం సభా నిబంధనల ఉల్లంఘన మాత్రమే కాదు, జాతీయ గీతానికి, దేశానికి జరిగిన తీరని అవమానంగా భావించాలని ఆయన తెలిపారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండి, జాతీయ చిహ్నాల పట్ల కనీస గౌరవం లేని ఎంఐఎం సభ్యుల తీరును తప్పుబట్టారు. ఇది వారి సంకుచిత మనస్తత్వాన్ని బయటపెట్టిందని విమర్శించారు.
సభ గౌరవాన్ని, జాతీయ గీత ప్రతిష్టను దిగజార్చిన ఎంఐఎం ఎమ్మెల్యేలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, వారి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశ గౌరవం కంటే ఏ రాజకీయ పార్టీ లేదా మతం ముఖ్యం కాదని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవడమే ఏకైక మార్గమని రాంచందర్ రావు చెప్పారు.
గవర్నర్ ను కలిసిన ప్రతినిధివర్గంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. కాసం వెంకటేశ్వర్లు, శ్రీమతి జయశ్రీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డా. ఎన్. గౌతం రావు, శ్రీ వీరేందర్ గౌడ్, శ్రీ వేముల అశోక్ తదితరులు ఉన్నారు.

More Stories
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులోఎ1గా కేటీఆర్
మూడు ప్రత్యేక జోన్లుగా హైదరాబాద్ నగరం విభజన
ఉద్రిక్తంగా మారిన బీజేపీ ‘అసెంబ్లీ ముట్టడి’