లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత పాపారావు

లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత పాపారావు
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, డివిజనల్‌ కమిటీ కమాండర్‌, పాపారావు అలియాస్‌ మంగుదాదా అలియాస్‌ చంద్రన్న అలియాస్‌ సున్నం చంద్రయ్య  ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా పోలీస్‌ అధికారుల ఎదుట అనుచరులతో కలిసి మంగళవారం లొంగిపోయారు. ఆ పార్టీ కీలక నేత పాపారావు తన అనుచరులతో కలిసి ఏకే-47లు, సెల్ఫ్‌ లోడెడ్‌ రైఫిళ్లతో సహా లొంగిపోయినట్లు పోలీస్‌ అధికారులు ధ్రువీకరించారు. 
 
పాపారావు భార్య ఊర్మిళ 2025 నవంబర్‌లో బీజాపూర్‌ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో మృతిచెందారు. పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న పాపారావుపై సుమా రు రూ 2 కోట్ల రివార్డు ఉన్నది.  పాపారావుతోపాటు ఎసిఎం కొర్రం మనీష, ఎసిఎం పర్చాపి మంగేష్‌, సివైపిసిఎం కమాండర్‌ కేశా సోఢి, పరాతాపూర్‌ ఎసిఎం చందర్‌ కట్లం, పరాతాపూర్‌ ఎసిఎం రూపి, దక్షిణ బస్తర్డి విజన్‌ మిలిటరీ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ విజ్జా హేమలా కూడా ఉన్నారు. 
ఆయనతో పాటు లొంగిపోయిన 17మందిలో 8 మంది మహిళా మావోయిస్ట్‌లు ఉన్నారు.  రెండు దశాబ్దాలుగా ఇంద్రావతి- అబుజ్‌మడ్‌ అటవీ ప్రాంతం కేంద్రంగా పాపారావు తన కార్యకలాపాలను సాగించారు. గెరిల్లా యుద్ధ తంత్రంలో ఆరితేరిన వ్యక్తుల్లో మడావి హిడ్మా, బార్సే దేవా తర్వాత పాపారావు కూడా ఒకరు. పాపారావుపై 50కి పైగా కేసులు ఉన్నాయి. 
 
76 మంది భద్రతా సిబ్బంది హత్యలో పాపారావు హస్తముంది. సుక్మా జిల్లా కలెక్టర్ కిడ్నాప్ కేసులోనూ ఆయన పాత్ర ఉంది.  మరో కీలక నేత సుక్రు సైతం ఒడిశాలో లొంగిపోయారు. అతనిపై రూ.55 లక్షల రివార్డు ఉంది. ఈ నెల 31కల్లా దేశంలో మావోయిస్టులను అంతమొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టి ‘ఆపరేషన్‌ కగార్‌’ తుది దశకు చేరింది. 
 
వారం రోజులుగా దక్షిణ బస్తర్‌ ప్రాంతంలో భద్రతా బలగాలు ఇంటెలిజెన్స్‌ ఆధారిత ఆపరేషన్లను ముమ్మరం చేశాయి. దానికితోడు అధికారుల నుంచి పెరిగిన ఒత్తిడి కారణంగా ఆయన అజ్ఞాతాన్ని వీడాలని నిర్ణయించుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఓ జర్నలిస్టు ద్వారా అధికారులను సంప్రదించి సరెండర్‌ ప్రక్రియను పూర్తి చేసినట్టుగా సమాచారం. 
కాగా, బస్తర్‌ ప్రాంతంలో చివరి అగ్రనేత పాపారావు లొంగిపోవడం వల్ల దక్షిణ బస్తర్‌ ప్రాంతంలో మావోయిస్టుల ఉనికి నామమాత్రంగా మారే అవకాశం ఉందని పోలీస్‌ అధికారులు భావిస్తున్నారు.