తెలంగాణలో ప్రస్తుతం 17 లోక్సభ స్థానాలు, 119 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజనతో 50 శాతం సీట్లు పెరుగాలి. అంటే కొత్తగా తెలంగాణలో 8.5 (17లో సగం) లోక్సభ స్థానాలు, 59.5 (119లో సగం) అసెంబ్లీ స్థానాలు పెరుగాలి. అయితే, 50 శాతం స్థానాలు పెంచేటప్పుడు 0.5 లెక్కన స్థానాలు వస్తే, దాన్ని ఒకటిగానే పరిగణిస్తారు. దీంతో తెలంగాణలో లోక్సభ సీట్లు 17 నుంచి 26కు పెరుగుతాయి. అసెంబ్లీ సీట్లు 119 నుంచి 179కు చేరుతాయి.
ప్రతి పదేండ్లకూ జనగణనను కేంద్రం నిర్వహిస్తున్నది. అయితే కరోనా సంక్షోభం కారణంగా 2021లో జరుగాల్సిన జనగణన వాయిదా పడింది. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకూ తొలి విడుత, 2027 ఫిబ్రవరిలో రెండో విడత జనగణన నిర్వహించనున్నారు. అయితే, ఈ లెక్కలు తేలేవరకూ సమయం పట్టే అవకాశం ఉండటంతో 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది.
కానీ, జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేపడితే, జనాభా నియంత్రణ పాటించిన తాము తీవ్రంగా నష్టపోయి, నియంత్రణ పాటించని ఉత్తరాది రాష్ర్టాలు లబ్ధి పొందే అవకాశం ఉంటుందని దక్షిణాది రాష్ర్టాలు ఎప్పటి నుంచో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన అని కేంద్రం పైకి చెప్తున్నప్పటికీ, జనాభాతో సంబంధం లేకుండా అన్ని రాష్ర్టాల్లో సగటున లోక్సభ, అసెంబ్లీ సీట్లు 50 శాతం పెంచాలని కేంద్రం నిర్ణయించింది.
దీంతో అన్ని రాష్ర్టాలకు గంపగుత్తగా ఏకరీతిన సీట్లు (50 శాతం) పెరిగే అవకాశం దక్కనున్నది. తద్వారా అన్ని రాష్ర్టాలకు లోక్సభలో ఇప్పుడున్న ప్రాతినిధ్య శాతం యథాతథంగా కొనసాగనున్నది. దేశంలో ప్రస్తుతం ఎస్సీ రిజర్వ్డ్ లోక్సభ స్థానాలు 84 ఉన్నాయి. ఎస్టీ రిజర్వ్డ్ లోక్సభ స్థానాలు 47 ఉన్నాయి. పునర్విభజన సీట్ల పెంపు నేపథ్యంలో అదే దామాషాలో ఎస్సీ, ఎస్టీల స్థానాలు కూడా పెరుగనున్నట్టు సమాచారం.
అంటే ఇప్పుడున్న 84 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలకు అదనంగా 42 చేరి మొత్తంగా 126 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు, ప్రస్తుతం ఉన్న 47 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలకు అదనంగా 24 చేరి మొత్తంగా 71 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు పెరుగనున్నాయి. ఇక, 2023లో ఆమోదించిన బిల్లు ప్రకారం 2034 నుంచి మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమల్లోకి రావాలి. రాజ్యాంగ అధికరణలు 170(3), 81(3) ప్రకారం 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల ఆధారంగా దేశంలో నియోజకవర్గాల పునర్విభజన చేయాలి.
అందువల్ల మహిళా రిజర్వేషన్ 2034 తర్వాతే అమల్లోకి వస్తుంది. దీంతో మహిళా రిజర్వేషన్ల అమలులో ఆలస్యం జరుగకుండా ఉండేందుకు 2011 జనాభా లెక్కల ఆధారంగానే మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేసేందుకు కూడా కేంద్రం సమాయత్తమైంది. 2011 జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన చేపట్టాలన్నా, 33 శాతం మహిళా రిజర్వేషన్లను అమల్లోకి తీసుకురావాలన్నా పార్లమెంట్లో పలు చట్ట సవరణలు చేయాల్సి ఉంటుంది.
ఈ చట్ట సవరణలు జరుగాలంటే పార్లమెంట్ ఉభయసభల్లో హాజరైన సభ్యుల్లో మూడింట రెండు వంతుల మంది ఆమోదం లభించాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 368(2) చెప్తున్నది. లోక్సభలో 240 మంది ఎంపీలు, రాజ్యసభలో 103 మంది ఎంపీల బలం ఉన్న బీజేపీకి విపక్షాల మద్దతు లేకుండా ఈ సవరణలు సాధ్యపడదు.

More Stories
రాజ్యసభలో ఖర్గే వ్యాఖ్యలపై దుమారం… `మనుస్మృతి’ వ్యాఖ్యలు తొలగింపు
నిర్భయంగా వ్యవహరించండి.. మీ చర్యలకు నాదే బాధ్యత
మోదీపై అభ్యంతరకర పోస్టులపై ఎఫ్ఐఆర్