ప్రతి ఇంటికి ఫ్రీ ఫ్రిజ్, మహిళలకు స్కూటీకి రూ.25 వేలు

ప్రతి ఇంటికి ఫ్రీ ఫ్రిజ్, మహిళలకు స్కూటీకి రూ.25 వేలు

* అన్నాడీఎంకే ఎన్నికల మేనిఫెస్టో 

తమిళనాడులో ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఉచిత పథకాల వేలం మొదలైంది. తాజాగా, ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే తన ఎన్నికల మ్యానిఫెస్టోను మంగళవారం ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి ఉచితంగా రిఫ్రిజిరేటర్, మహిళలకు అమ్మ టూవీలర్ పథకం కింద స్కూటీ కోసం రూ.25 వేలు సబ్సిడీ అందజేస్తామని హామీ ఇచ్చింది.  దీని ద్వారా ఏటా 5 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని పేర్కొంది.

రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి నెలకు రూ.2,000 నేరుగా ఖాతాల్లో బదిలీ చేస్తామని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి  ఎడప్పాడి కె. పళనిస్వామి తెలిపారు. పేదలకు అమ్మ ఇల్లును నిర్మించనున్నట్టు తెలిపారు. అలాగే, రేషన్‌తో పాటు కిలో కిందపప్పు, లీటర్ వంట నూనె కూడా ఇస్తామని తెలిపింది.  ఇక, మహిళతో పాటు పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నట్టు అన్నాడీఎంకే పేర్కొంది. 

ప్రతి కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సాయం. పింఛన్లు రూ.2,000 పెంపు. గ్రామీణ ఉపాధి హామీ పథకం 150 రోజులకు పెంపు. జల్లికట్టు బాధితులకు రూ.10 లక్షల సాయం. ఇలా సామాజిక, ఆర్థిక అంశాల్ని పరిగణనలోకి తీసుకుని తమ మేనిఫెస్టో రూపొందిందని ఏఐఏడీఎంకే తెలిపింది తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న నటుడు విజయ్ పార్టీ టీవీకే కూడా ఉచిత హామీలో పోటీ పడుతున్నది.   తమిళనాట ఎన్నికలు అంటే ఉచితాలే గుర్తుకొస్తాయి. అక్కడ కొత్త కొత్త పథకాలు, హామీలు పుట్టుకొస్తాయి. 

ఓ రకంగా చెప్పాలంటే దేశంలోని అన్ని రాష్ట్రాలు ఉచిత హామీల విషయంలో తమిళనాడును ఆదర్శంగా తీసుకుంటాయనడంలో సందేహం లేదు. ప్రస్తుత డీఎంకే ప్రభుత్వం మూడు నెలల సొమ్మును ఒకేసారి మహిళ ఖాతాల్లో జమ చేసింది. మరో 1000 బోనస్‌గా ఇచ్చింది. తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుండగా.. మే 4 ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు. 

కాగా, 1967 నుంచి తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకేలే ప్రభుత్వాలను ఏర్పాటుచేస్తున్నాయి. ఎన్నికలు వచ్చినప్పుడు ఈ రెండు పార్టీలు ఉచితాల ప్రకటనలో పోటీపడుతున్నాయి. 1978లో నాటి దివంగత సీఎం ఎంజీఆర్ మధ్యాహ్న భోజనం.. రేషన్ బియ్యం పథకాన్ని మొదలుపెట్టారు. అప్పట్లో వీటి అవసరం ఉండేది. 

ఇక, దాదాపు మూడు దశాబ్దాల తర్వాత 2006లో డీఎంకే ఉచిత కలర్ టీవీలు, 2011లో జయలలిత ఉచిత మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు ప్రకటించారు. ఈ పరంపర అలాగే కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు పథకాలకు తమిళనాడే ఆదర్శం. 2014లో ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ.. తమిళనాడులోని అమ్మ క్యాంటీన్లను స్ఫూర్తిగా తీసుకుని అన్న క్యాంటీన్లను ప్రాారంభించింది.