* బుధవారం అఖిలపక్ష సమావేశం
పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం వల్ల “తీవ్రమైన దుష్ప్రభావాలు” ఉంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం హెచ్చరించారు. ఈ అలజడిని ఎదుర్కోవడానికి ఏడు సాధికార బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. కరోనా సమయంలో ఏర్పాటు చేసిన సాధికార బృందాల తరహాలోనే ఈ బృందాలను కూడా ఏర్పాటు చేశారు.
డిమాండ్, సరఫరాకు సంబంధించిన అంశాలు, ధరల హెచ్చుతగ్గులు, వాణిజ్యం, ఎగుమతులు వంటి ఇతర విషయాలను పరిగణనలోకి తీసుకుని, ఈ సంక్షోభానికి సమగ్రమైన జాతీయ ప్రతిస్పందనను ఈ బృందాలు అందిస్తాయి. మంగళవారం రాజ్యసభలో మాట్లాడుతూ, “ఈ సంక్షోభం వల్ల తీవ్రమైన దుష్ప్రభావాలు అనివార్యం” అని ప్రధాని స్పష్టం చేశారు.
పౌరులకు తగినంత ముడి చమురు నిల్వలు ఉంటాయని ఆయన హామీ ఇచ్చారు. దేశంలో తగినంత ముడి చమురు నిల్వలు ఉన్నాయని, నిరంతరం ముడి చమురును సరఫరా చేయగల స్థితిలో ఉన్నామని ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఆత్మనిర్భరతే ఏకైక మార్గమని నొక్కి చెప్పడానికి ఆయన ఈ సంక్షోభాన్ని ఉదహరించారు. పశ్చిమ ఆసియాలో శాంతిని నెలకొల్పడానికి చర్చలు, దౌత్యమే ఏకైక మార్గమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
శాంతిని నెలకొల్పేందుకు భారత్, ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్‌లతో సంప్రదింపులు జరుపుతోందని ఆయన తెలిపారు. పశ్చిమాసియా యుద్ధం ప్రభావం దేశంపై సాధ్యమైనంత వరకు తక్కువ ఉండేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల అంశంపై సమీక్ష నిర్వహించే నేపథ్యంలో బుధవారం కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
“యుద్ధంతో మొదలయ్యే మరో సవాల్.. భారత్‌లో వేసవి మొదలుకానున్నది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతల పెరుగుదలతో విద్యుత్తుకు డిమాండ్ పెరుగనున్నది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని పవర్ ప్లాంట్లలో తగినన్ని బొగ్గు నిల్వలు ఉన్నాయి” అని ప్రధాని పేర్కొన్నారు. భారత్ వద్ద 53 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు ఉన్నాయని, మరో 65 లక్షల మెట్రక్ టన్నులకు పైగా పెట్రోలియం నిల్వలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నదని ఆయన తెలిపారు.
పశ్చిమాసియా సంక్షోభంపై భారత పార్లమెంట్ నుంచి ప్రపంచానికి ఒకే గొంతుక వెళ్లాలని పిలుపునిచ్చారు. అనిశ్చితులతో నిండిన ఈ ప్రపంచంలో, భవిష్యత్తులో స్వావలంబన మాత్రమే ఏకైక ప్రత్యామ్నాయంగా ఉంటుందని ఆయన నొక్కి చెప్పారు. ప్రస్తుతం భారతదేశ వాణిజ్యంలో 90 శాతం విదేశీ నౌకల ద్వారానే జరుగుతున్న స్థితిని మార్చడానికి గాను, రూ. 700 కోట్ల వ్యయంతో చేపట్టిన ఒక కార్యక్రమం కింద, భారతదేశం ప్రస్తుతం నౌకా నిర్మాణం మరియు నౌకా విచ్ఛిన్నం రంగాలపై దృష్టి సారిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

More Stories
యుద్ధం ఆపాలని ట్రంప్ ను కోరిన మోదీ!
కాశ్మీర్ లో ‘లక్షిత’ హిందువుల హత్యలపై నివేదిక కోరిన ఎన్హెచ్ఆర్సి
అధికారిక కార్యక్రమాల్లో `వందేమాతరం’ తప్పనిసరి కాదు