పాక్‌ హ్యాండ్లర్లతో సంబంధాలు.. పోలీసుల అదుపులో ముగ్గురు

పాక్‌ హ్యాండ్లర్లతో సంబంధాలు.. పోలీసుల అదుపులో ముగ్గురు

* ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ పోస్టులు

విజయవాడలో ఉగ్రలింకులు బయట పడ్డాయి. పాకిస్థాన్‌లోని హ్యాండ్లర్లతో సంబంధాలు ఏర్పరుచుకుని, సామాజిక మాధ్యమాల ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న యువకులు మొహ్మద్‌ రహమతుల్లా షరీఫ్, మీర్జా సొహైల్‌ బేగ్, మొహ్మద్‌ డానిష్‌లను కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం (సీఐ సెల్‌) అధికారులు, విజయవాడ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సోమవారం విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు.

ఆ యువకుల్ని రహస్యంగా ప్రశ్నించగా  విదేశాల్లోని ఉగ్రవాద చర్యలకు ఆకర్షితులై సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టినట్లు అంగీకరించినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ఉగ్రమూలాల చర్యలపై నిఘా పెట్టిన ఇంటెలిజెన్స్‌ వర్గాలు రాష్ట్రాల్లోని పోలీసులతోనూ సమాచారాన్ని పంచుకుంటున్నాయి. ఇటీవల ఏపీలో ఇటువంటి చర్యలు పెరగడంతో రాష్ట్ర సీఐ సెల్‌ అధికారులు నిరంతర నిఘా పెట్టారు.
ఈ నేపథ్యంలో సీఐ సెల్‌ పోలీసులు విజయవాడలో యువకులు ఉగ్రవాద సంస్థలకు అనుకూలంగా పోస్టులు పెట్టినట్లు పసిగట్టారు. వీరు ఇన్‌స్టాగ్రాం, టెలిగ్రాం సహా వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా యువతను ఉగ్రవాద భావజాలం వైపు ఆకర్షిస్తున్నట్లు గుర్తించారు. ఉగ్రవాద రిక్రూట్‌మెంట్, జిహాదీ కార్యకలాపాల కోసం అవసరమైన నిధులను వీరికి పాకిస్థాన్‌లోని హ్యాండ్లర్లు సమకూరుస్తున్నట్లు నిఘా వర్గాలకు సమాచారముంది.
దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువకులతో గ్రూపులు ఏర్పాటు చేసి, వారిని జీహాదీ కోసం సన్నద్ధమవ్వాలంటూ పురిగొల్పుతున్నట్లు సీఐ సెల్‌ తేల్చింది.  విజయవాడ వించిపేట నారాయణస్వామి వీధిలో మొహ్మద్‌ రహమతుల్లా షరీఫ్, అబ్దుల్‌రజాక్‌ వీధిలో మీర్జా సొహైల్‌ బేగ్, భవానీపురం ఇందిరా ప్రియదర్శినీ కాలనీలో మొహ్మద్‌ డానిష్‌ ఉన్నట్లు గుర్తించిన సీఐ సెల్‌ అధికారులు.. విజయవాడ టాస్క్‌ఫోర్స్‌ బృందాలతో కలిసి వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

నిందితుల్లో మొహ్మద్‌ రహమతుల్లా షరీఫ్‌ ర్యాపిడో, ఉబర్, ఓలా బైక్‌ డ్రైవర్‌గా, సోహైల్‌ బేగ్‌ ఓ బిర్యానీ దుకాణంలో క్యాషియర్‌గా, డానిష్‌ ఆటోనగర్‌లో వర్కర్‌గా పనిచేస్తున్నారు. విజయవాడ వన్‌టౌన్‌లో ఓ మసీదు వద్ద వీరు కలుసుకునేవారు. దేశవ్యాప్తంగా వీరితో మరో పది మంది టచ్‌లో ఉన్నట్లు గుర్తించారు. రహమతుల్లా షరీఫ్‌ పేలుడు పదార్థాల తయారీ, వాటిని ఎలా వినియోగించాలనే దానిపై ఇంటర్నెట్‌లో సెర్చ్‌ చేసినట్లు సీఐ సెల్‌ అధికారులు గుర్తించారు.

పోలీసులు రహమతుల్లా షరీఫ్‌ ఇంటికి వెళ్లినప్పుడు ‘మీరు వస్తారని తెలుసు. సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నందుకే వచ్చారు కదా?’ అని ప్రశ్నించడం గమనార్హం. నిందితులు ముగ్గురిపై చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం, ఐటీ చట్టం, సహా బీఎన్‌ఎస్‌లోని పలు సెక్షన్ల కింద విజయవాడ రెండో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.