* వారిని ప్రోత్సహించిన హైదరాబాద్ యువతి అరెస్ట్
విజయవాడలో ముగ్గురు యువకుల అరెస్టుతో దేశవ్యాప్త ఉగ్రవాద నెట్‌వర్క్ గుట్టు రట్టయింది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలైన ఐఎస్‌ఐఎస్, ఆఖిస్ (ఎక్యూఐఎస్)లతో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిని మహమ్మద్ రహమతుల్లా షరీఫ్, ఎండి. డానిష్, మీర్జా సో హైల్ బేగ్‌లుగా గుర్తించారు.
సోషల్ మీడియా వేదికగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ముగ్గురు యువకులపై కొత్తపేట పోలీసులు ఉపా సహా పలు కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
అరెస్టయిన యువకులు అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ అనే పేరుతో ఒక రహస్య సంస్థను ఏర్పాటు చేసినట్లు విచారణలో వెల్లడైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దేశంలోని 7 రాష్ట్రాలకు చెందిన సుమారు 42 మంది యువకులతో ఒక రహస్య సోషల్ మీడియా గ్రూప్ నడుస్తోంది.
ఈ గ్రూప్ ద్వారా ఐఎస్‌ఐఎస్ (ఐఎస్‌ఐఎస్), కిలాఫత్ ఐడియాలజీని వ్యాప్తి చేస్తున్నారు. పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ వంటి దేశాల్లో ఉన్న ఉగ్రవాద సంస్థలతో వీరు నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నారు. వీరికి పాకిస్థాన్ హ్యాండ్లర్ల నుంచి నిధులు సమకూరుతున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అదుపులోకి తీసుకున్న యువకుల వద్ద నుంచి ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, కొన్ని అనుమానాస్పద పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
వీరి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లలో కీలకమైన ఆడియో క్లిప్పింగ్‌లు, జిహాదీ మెసేజ్‌లు లభించాయి. ప్రస్తుతం 42 మంది సభ్యుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అరెస్టయిన ముగ్గురు నిందితులను పోలీసులు విజయవాడ సీఎంఎం కోర్టులో హాజరుపరిచారు. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, వీరికి ఏప్రిల్ 6వ తేదీ వరకు రిమాండ్ విధించింది. విచారణ సందర్భంగా తమకు లాయర్ లేరని నిందితులు చెప్పడంతో, దీంతో ఈ విషయాన్ని రాతపూర్వకంగా తెలియజేయాలని కోర్టు ఆదేశించింది.
కాగా, వారిని ఉగ్రవాదం వైపు ప్రోత్సహించిన హైదరాబాద్‌కు చెందిన యువతిని కూడా అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ చంచల్‌గూడకు చెందిన సయిదా బేగంను కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం విచారణ నిమిత్తం ఆమెను విజయవాడకు తరలించారు. విదేశీ హ్యాండ్లర్ అల్ హకీమ్ షుకూర్ సూచనలతో సయిదా బేగం పనిచేస్తుంది. ఈ క్రమంలోనే విజయవాడకు చెందని సోహైల్ బెగ్, షరీఫ్, డానిష్ యువకులను తీవ్రవాద సంస్థల వైపు మళ్లించడంలో ఆమె కీలక పాత్ర పోషించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ మల్లేపల్లి ప్రాంతానికి చెందిన మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

More Stories
ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా భైరవకోన
ఏపీకి చెందిన టెకీ హర్యానాలో దారుణ హత్య
హామీల అమలుకై ‘గూగుల్’ నిర్వాసితులు పనుల అడ్డగింత