ఎన్నికల ప్రకటనలకు ఎంసిఎంసి ధ్రువీకరణ తప్పనిసరి 

ఎన్నికల ప్రకటనలకు ఎంసిఎంసి ధ్రువీకరణ తప్పనిసరి 
నాలుగు రాష్ట్రాలకు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికలు జరగనున్న తరుణంలో, రాజకీయ పార్టీలు తమ ప్రకటనలు లేదా అడ్వర్టయిజ్‌మెంట్లను మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మోనిటరింగ్‌ కమిటీ (ఎంసిఎంసి)ల ద్వారా ముందస్తుగా ధృవీకరించుకోవాలని ఎన్నికల కమిషన్‌ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.  అలాగే అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేయడానికి ముందుగా తమ సోషల్‌ మీడియా ఖాతాల వివరాలను కూడా అందచేయాలని కోరింది.
ఏప్రిల్‌ 9నుండి 29 మధ్య అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు, ఆరు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.  ఎలక్ట్రానిక్‌ మీడియాలో (టివి, రేడియో, బహిరంగ ప్రదేశాల్లో ఆడియో-వీడియో డిస్‌ప్లేలు, ఇ పేపర్లు, పెద్ద సంఖ్యలో ఎస్‌ఎంఎస్‌లు లేదా వాయిస్‌ మెసేజ్‌లు వంటి వాటిని) తమ అడ్వర్టయిజ్‌మెంట్లను ప్రచురించడానికి ముందుగా సోషల్‌ మీడియా ఖాతాలతో సహా నమోదైన ఏ రాజకీయ పార్టీ లేదా గ్రూపు, సంస్థ లేదా సమాఖ్య, పోటీచేసే అభ్యర్ధి ఎవరైనా సరే ఎంసిఎంసికి దరఖాస్తు చేసుకోవాల్సిందేనని ఇసి స్పష్టం చేసింది. 
” సోషల్‌ మీడియా వెబ్‌సైట్లుతో సహా ఇంటర్‌నెట్‌ ప్రాతిపదిక గల మీడియా లేదా వెబ్‌సైట్లు, వేటికైనా ఎంసిఎంసి కోణంలో ముందుగా ధృవీకరించకపోతే రాజకీయ పార్టీలు లేదా అభ్యర్ధులు ఇచ్చే ఏ రాజకీయ అడ్వర్టయిజ్‌మెంట్లు విడుదల కాబోవు.” అని ఇసి ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.  అలాగే మీడియాలో వచ్చే అనుమానిత పెయిడ్‌ న్యూస్‌ కేసులపై కూడా ఎంసిఎంసి కఠినంగా దృష్టి పెడుతుందని ఆ ప్రకటన పేర్కొంది.
ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్‌ 77(1) నిబంధనలు, సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా, సోషల్‌ మీడియా వెబ్‌సైట్లతో సహా ఇంటర్‌నెట్‌ ద్వారా జరిగే ప్రచారానికి ఖర్చు పెట్టే మొత్తం వివరాలతో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన 75రోజుల్లోగా కమిషన్‌కు సమాచారాన్ని పంపాలని రాజకీయ పార్టీలను ఎన్నికల కమిషన్‌ కోరింది. 
ఇందుకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల సిఇఓలు, రాష్ట్ర పోలీసు నోడల్‌ అధికారులు, రాష్ట్ర ఐటి నోడల్‌ అధికారులు, సోషల్‌ మీడియా వేదికల ప్రతినిధులు అందరితో ఈనెల 19న జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల సమయంలో తప్పుడు సమాచారం లేదా నకిలీ సమాచార వ్యాప్తికి సంబంధించిన సంఘటనలు వుంటే వెంటనే వాటిపై సకాలంలో చర్య తీసుకోవాలని, అందుకు సంబంధించిన నిబంధనల గురించి అందరికీ తెలియచేయాలని సమావేశం కోరింది.