* శ్రీరామజన్మభూమి మందిరం నిర్మాణం పూర్తి సందర్భంగా రాష్ట్రపతి ముర్ము
సాక్షాత్ పూజ్యులు కంచి శంకరాచార్యుల తయారు చేయించి అనేక సంవత్సరాలుగా జపం చేసిన శ్రీరామయంత్రాన్ని మందిరంలోని మూడవ అంతస్తులో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము తన చేతుల మీదుగా వేద పండితులు శుక్రవారం ప్రతిష్టాపన గావించారు. అనంతరం బాల రాముడికి హారతి ఇచ్చి సేవలు చేశారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, ప్రభు శ్రీరాముడు జన్మించిన పవిత్ర నగరమైన అయోధ్యలోని పుణ్యధూళిని స్పృశించడం తన పరమ భాగ్యమని రాష్ట్రపతి పేర్కొన్నారు.
నవరాత్రి మొదటి రోజును సూచించే ‘చైత్ర శుక్ల పాడ్యమి’ పర్వదినాన ఇక్కడ స్వయంగా ఉండటం తనకు నిజంగా ఒక అదృష్టకర సందర్భమని ఆమె అభివర్ణించారు. అత్యంత పవిత్రమైన ఈ శ్రీరామ జన్మభూమి మందిరానికి సంబంధించిన భూమి పూజ, ఇక్కడ రామలల్ల దివ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, భక్తుల దర్శనార్థం ‘రామ దర్బార్’ ప్రారంభం, ఆలయ శిఖరంపై ధార్మిక పతాక ఆవిష్కరణ వంటి చారిత్రక ఘట్టాలు మన చరిత్రలోనూ, సంస్కృతిలోనూ సువర్ణాక్షరాలతో లిఖించదగినవని రాష్ట్రపతి తెలిపారు.
సమ్మిళిత సమాజ నిర్మాణం, అభివృద్ధి చెందిన దేశం దిశగా మనమందరం ముందుకు సాగుతున్నామని రాష్ట్రపతి చెప్పారు. ప్రభు శ్రీరాముని ఆశీస్సులతో, 2047 నాటికి, బహుశా అంతకంటే ముందే మనం ఈ లక్ష్యాలను సాధించగలమని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. 21వ శతాబ్దపు సందర్భంలో, మన సమ్మిళిత సమాజం, అభివృద్ధి చెందిన దేశం గురించిన ఆశయాలు ‘రామరాజ్యం’ వర్ణనలో ప్రతిధ్వనిస్తున్నాయని ఆమె తెలిపారు.
రామరాజ్యంలో ఎవరూ దుఃఖితులుగా, నిరాశ్రయులుగా, ఇతరులపై ఆధారపడేవారిగా, బుద్ధిహీనులుగా లేదా నైతిక విలువలు లోపించినవారిగా ఉండరని గోస్వామి తులసీదాసు పేర్కొన్నారని రాష్ట్రపతి గుర్తుచేశారు. రామరాజ్యం అనే ఆదర్శం ఆర్థిక శ్రేయస్సు, సామాజిక సామరస్యానికి సంబంధించిన అత్యున్నత ప్రమాణాలను ప్రతిబింబిస్తుందని రాష్ట్రపతి తెలిపారు.
ప్రభు శ్రీరాముని జీవితంలోని అనేక ఘట్టాలు, సర్వవ్యాపకమైన, అందరినీ కలుపుకుపోయే జీవన తత్వాన్ని ఆచరించాలనే ఆదర్శానికి నిదర్శనంగా నిలుస్తాయని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుత సందర్భంలో, సామాజిక సమ్మిళితత్వం, ఆర్థిక న్యాయంతో సహా వివిధ జాతీయ లక్ష్యాలు నిర్దేశించబడ్డాయని, అంతేకాక అవి ఆచరణలోకి తీసుకురాబడుతున్నాయని గమనించడం తనకు సంతోషాన్ని కలిగించిందని ఆమె చెప్పారు.
రామరాజ్య ఆదర్శాలను పాటిస్తూ ముందుకు సాగడం ద్వారా, నైతికత, ధర్మబద్ధమైన ప్రవర్తనపై ఆధారపడిన ఒక బలమైన దేశాన్ని మనం నిర్మించుకోగలమని ఆమె తెలిపారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలతో సహా అన్ని కోణాలలోనూ మన దేశ పునరుజ్జీవనం జరుగుతోందని రాష్ట్రపతి పేర్కొన్నారు.
గత రెండు సంవత్సరాల క్రితం మొదటి అంతస్తులో బాలరాముడు విగ్రహ ప్రతిష్టాపన జరుగగా, రెండవ అంతస్తులో శ్రీసీతారామ లక్ష్మణ భరత శత్రుజ్ఞ హనుమత్ సమేతుడైన శ్రీరామదర్భార్ ఉండగా, గత నవంబర్ 25న కలశం పక్కన కాషాయ ధ్వజం ఎదురు వేయడం మరోముఖ్య ఘట్టంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మూడవ అంతస్తులో యంత్రస్థాపనతో 500 సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్న ఆలయం నిర్మాణం పూర్తయినట్లయ్యింది.
సమరసతను చాటి చెప్పిన అయోధ్య రామ జన్మభూమి మందిరంకు 1989 నవంబర్ 9న శంకుస్థాపన జరిగింది. బీహార్‌కు చెందిన విశ్వహిందూ పరిషత్ కార్యకర్త తరతరాలుగా ఉపేక్షకు గురైన వర్గాలకు ప్రతినిధి అయిన కీర్తిశేషులు కామేశ్వర్ చౌపాల్ 1989లో మొదటి ఇటుకను వేసి శంకుస్థాపన చేయడం ద్వారా ఆలయ నిర్మాణం ప్రారంభించినట్లుగా ప్రకటించారు.
కామేశ్వర్ చౌపాల్ జనవరి 22న బాల రాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఫిబ్రవరి 2025లో మరణించారు. తన జీవిత లక్ష్యం పూర్తయినట్లుగా చెప్పేవారు. ఇప్పుడేమో కొండ కోనల్లో ఉండే వర్గాలకు ప్రతినిధిగా, సంపూర్ణ భారతదేశానికి రాష్ట్రపతిగా ఉన్న శ్రీమతి ద్రౌపది ముర్ము శ్రీరామ యంత్ర పూజ చేయడం ఒక గొప్ప సామాజిక సమరసతకు, భారత దేశపు ఔన్నత్యానికి, అవసరం లేని పట్టింపులను వదిలిపెట్టి సకారాత్మకమైన మార్పున స్వీకరించగలిగే హిందువుల ఘనమైన స్వభావానికి ప్రతీకగా చెప్పవచ్చు.

More Stories
కాంగ్రెస్ అస్సాం ఎన్నికల ఇన్ ఛార్జ్ గా ప్రియాంకకు చుక్కెదురు
17 శాతం ఎల్ఎన్జీ ఎగుమతుల సామర్థ్యం కోల్పోయిన ఖతార్
పశ్చిమాసియాలో శాంతి స్థాపనకై ప్రపంచ నేతలకు మోదీ విజ్ఞప్తి