చమురు క్షేత్రాలపై ఇరాన్ దాడులతో భారత్ పై భారీ ప్రభావం

చమురు క్షేత్రాలపై ఇరాన్ దాడులతో భారత్ పై భారీ ప్రభావం

* చమురు, గ్యాస్‌ నిల్వల వివరాలు చెప్పమని ఆయిల్‌ కంపెనీలకు ఆదేశాలు

గల్ఫ్‌ దేశాల చమురు నిల్వ కేంద్రాల్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ వైమానిక దాడులకు పాల్పడుతోంది. ఇప్పటికే యూఏఈ, ఖతార్‌లోని చమురు నిల్వ కేంద్రాలపై దాడులు చేసిన ఇరాన్ తాజాగా సౌదీ అరేబియాలోని ప్రధాన పట్టణం యన్బులోని రెడ్ సీ పోర్టు వద్ద గల సౌదీ అరాంకో సంస్థకు చెందిన చమురు రిఫైనరీలపై దాడి చేసింది.   ఇప్పటికే హోర్ముజ్ జలసంధి మూసుకుపోయి చమురు రవాణా స్తంభించిన నేపథ్యంలో ఇప్పుడు గల్ఫ్‌లోని చమురు కేంద్రాలపై దాడులు జరగడం ప్రపంచాన్ని మరింత కలవరపెడుతోంది. 

గల్ఫ్ దేశాల్లో ఆయిల్, గ్యాస్ స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తుండటంతో భారత్ సహా పలు దేశాల స్టాక్ మార్కెట్లు భారీగా పఠనం అయ్యాయి. ఫిబ్రవరి 28 నుంచి ఆయిల్ ధరల్లో 57 శాతం మేర పెరుగుదల నమోదయ్యింది. ఇప్పుడు గల్ఫ్‌ కేంద్రాలపై దాడులు, అక్కడ చమురు ఉత్పత్తి నిలిచిపోతే ఆయిల్ సరఫరాకు ఇంకా ఇబ్బంది కలుగుతుంది.

ఖతార్‌కు చెందిన రాస్‌ లఫాన్‌ పారిశ్రామిక నగరంలోని ఇంధన సదుపాయంపై ఇరాన్‌ జరిపిన దాడి ముడి చమురులో 88 శాతం, గ్యాస్‌లో 50 శాతం వరకు దిగుమతులపై ఆధారపడిన భారత్‌కు చేదు వార్త కానున్నది. భారత్‌కు అతి పెద్ద సరఫరాదారైన ఖతార్‌ నుంచి వచ్చే గ్యాస్‌ దిగుమతులకు ఇదివరకే అంతరాయం ఏర్పడింది. భారత్‌కు అవసరమైన ఎల్పీజీలో మూడవ వంతు, లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌(ఎల్‌ఎన్‌జీ)లో దాదాపు సగం దిగుమతులు ఖతార్‌ నుంచే వస్తాయి.

ముఖ్యంగా పారిశ్రామిక రంగానికి, విద్యుత్ ఉత్పత్తికి ఎదురుదెబ్బ తగులుతుంది.  ప్రస్తుతం భారత్ ప్రతిరోజూ 189 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూమిక్ మీటర్స్ (ఎంఎంఎస్‌సీఎండీ) వినియోగిస్తోంది. ఇందులో 97.5 ఎంఎంఎస్‌సీఎండీ మాత్రమే భారత్ లో ఉత్పత్తి అవుతోంది.  ఈ నేపథ్యంలో దేశంలో ఇంధన, గ్యాస్ కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది.

ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పెట్రోల్, సహజవాయువు సరఫరా గొలుసును పర్యవేక్షించేందుకు ఒక కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేసే ఉద్దేశంతో నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయా కంపెనీలు పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ (పిపిఏసి) కి ఈ వివరాలు అందించాలని ఆదేశించింది.  దేశంలోని చమురు, గ్యాస్ కంపెనీల వద్ద ఉన్న చమురు, గ్యాస్‌ నిల్వలు, ఉత్పత్తి, వినియోగం, దిగుమతులకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆయా కంపెనీలకు ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు దేశంలోని చమురు, గ్యాస్ కంపెనీలకు ఒక నోటిఫికేషన్ ఇచ్చింది.