ఇరాన్‌తో యుద్ధానికి రూ.18.6 లక్షల కోట్లు కోరిన పెంటగాన్

ఇరాన్‌తో యుద్ధానికి రూ.18.6 లక్షల కోట్లు కోరిన పెంటగాన్
ఇరాన్‌పై డొనాల్డ్ ట్రంప్ చేస్తోన్న యుద్ధంపై సొంత దేశంలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇజ్రాయెల్‌తో కలిసి కొనసాగిస్తున్న ఈ యుద్ధానికి అమెరికా భారీగానే ఖర్చు చేస్తోంది. యుద్ధం మొదలైన మొదటి వారంలోనే 11.3 బిలియన్ డాలర్లు, అంటే దాదాపు రూ. లక్ష కోట్లు వెచ్చించినట్లు నివేదికలు వచ్చాయి. 
ఈ క్రమంలో ఇరాన్‌పై సైనిక చర్యకు 200 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.18.6 లక్షలు కోట్లు నిధులను మంజూరు చేయాలని వైట్‌హౌస్‌ను పెంటగాన్ కోరిందనే నివేదికలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. దాదాపు రూ. 81 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్ కలిగిన పెంటగాన్ అదనంగా మరో 200 బిలియన్ డాలర్లు కోరడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఫిబ్రవరి 28న మొదలైన ఈ యుద్దం మొదటి ఏడు రోజుల్లోనే రూ.లక్ష కోట్లు కేవలం క్షిపణులు, బాంబుల వంటి మందుగుండ సామాగ్రి కోసం ఖర్చయ్యింది. సైన్యం, ఇతర రవాణా వ్యయం కలిపితే ఈ లెక్క ఇంకా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్ పై దాడులకు కేవలం 48 గంటల్లోనే రూ. 51.400 కోట్లు ఖర్చయింది.  ఈ యుద్ధ వ్యయం అమెరికన్ల ముఖ్యమైన అవసరాల బడ్జెట్‌ల కంటే చాలా అధికం కావడం గమనార్హం. 
 
ఉదాహరణకు అగ్రరాజ్యం పర్యావరణ పరిరక్షణ వార్షిక బడ్జెట్ రూ.79, 200 కోట్లు, వ్యాధి నియంత్రణ కేంద్రం (సీడీసీ) బడ్జెట్ రూ.82, 800 కోట్లు మాత్రమే. అంటే ఏడాదిలో అమెరికన్ల ఆరోగ్యం, పర్యావరణం కోసం ఖర్చుపెట్టే నిధుల కంటే.. వారం రోజుల్లో యుద్ధానికి చేసిన ఖర్చే ఎక్కువగా ఉంది. ఈ అంశం అమెరికాలో తీవ్ర రచ్చ రేపుతోంది. ట్రంప్‌కి మతి భ్రమించిందని, ఆయన బుద్దిలేని పనులు చేస్తున్నారా? అంటూ అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, సైన్స్, పరిశోధనలు, ప్రజారోగ్య సంరక్షణకు నిధుల్లో ట్రంప్ సర్కారు భారీగా కోత విధిస్తోంది. కేన్సర్‌ రిసెర్చ్, క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు నిధులు నిలిపివేసి యుద్ధానికి బిలియన్ డాలర్లు ఖర్చుచేయడంపై డెమొక్రాట్ సెనేటర్ ఆడమ్ షిఫ్ వంటి నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.  స్వదేశంలో పరిశోధనలు, ఉద్యోగాల్లో కోత విధించి, యుద్ధానికి ప్రాధాన్యత ఇవ్వడం వెనుక ట్రంప్ వ్యూహమేంటో అర్థం కాక సామాన్యులు విస్తుపోతున్నారు.