పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరాన్‌లోని అణు కేంద్రాలు గ్యాస్ క్షేత్రాలే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడులతో యుద్ధం మరింత తీవ్రంగా మారింది. దీంతో ఇరాన్ కూడా గల్ఫ్‌లోని ఇంధన కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. పశ్చిమాసియాలో కీలక గ్యాస్, చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ అర్ధరాత్రి దాడులు చేసింది.
తమ నేతలు నేతలు లారిజానీ, నిఘా వ్యవహారాల మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ మరణానికి ప్రతీకారంగా వీటిని చేపట్టింది. ఖతార్‌లోని అత్యంత కీలకమైన రస్ లాఫాన్ ఇండస్ట్రియల్ సిటీపై ఇరాన్ క్షిపణితో దాడి చేసింది. ఇది ఖతార్ ఆర్థిక వ్యవస్థకు పునాది. ఈ దాడిలో భారీ స్థాయిలో ఇది దెబ్బతిన్నట్లు ఆ దేశ వర్గాలు వెల్లడించాయి. ఇరాన్ చర్యలపై ఖతార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్ దాడులను ఖతార్ తీవ్రంగా ఖండించింది.
పౌర ప్రాంతాలు, కీలక మౌలిక సదుపాయాలపై దాడులు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని పేర్కొంది. దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే ఇలాంటి దాడులు ఉద్రిక్తతలను మరింత పెంచుతాయని ఖతార్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఘటనల నేపథ్యంలో ఖతార్ ప్రభుత్వం ఇరాన్ ఎంబసీలోని సైనిక, భద్రతా అధికారులను పర్సోనా నాన్ గ్రాటాగా ప్రకటించింది. వారిని 24 గంటల్లోగా దేశం విడిచిపోవాలని ఆదేశించింది.
మరోవైపు ఇరాన్ దాడులపై డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. మళ్లీ ఇలాంటి దాడులు జరిగితే ఇరాన్‌పై గతంలో మునుపెన్నడూ చూడనంత శక్తితో దాడి చేస్తామని హెచ్చరించారు. పార్స్ గ్యాస్ క్షేత్రం మొత్తాన్ని విధ్వంసం చేస్తామని పేర్కొన్నారు. అంతకు ముందు, దక్షిణ ఇరాన్ సముద్ర తీరంలో గల పార్స్ సహజ వాయు క్షేత్రానికి సంబంధించిన సదుపాయాలపై బుధవారం దాడి జరిగినట్లు ఇరాన్ ప్రభుత్వ ఆధీనంలోని మీడియా వెల్లడించింది.
ఇరాన్‌కు చెందిన దక్షిణ బుషెహర్ ప్రావిన్సులోని అసలుయేహ్ వద్ద ఉన్న సదుపాయాలపై దాడి జరిగిందని ఇరాన్ ప్రభుత్వ అధీనంలోని టెలివిజన్, ఇర్నా వార్తా సంస్థ తెలిపాయి. అయితే పూర్తి వివరాలను అవి వెల్లడించలేదు. పర్షియన్ గల్ఫ్‌లోని సముద్రతీర క్షేత్రాన్ని ఇరాన్ ఖతార్‌తో పంచుకుంటుంది. యుద్ధ సమయంలో ఇతర గల్ఫ్, అరబ్ దేశాలతోపాటు ఖతార్‌పై పదేపదే ఇరాన్ దాడి చేసింది. ఈ దాడి చేసింది ఇజ్రాయెలా లేదా అమెరికా అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
కాగా, అమెరికా ప్రధానంగా దక్షిణ ఇరాన్‌పైనే తన దాడిని కేంద్రీకృతం చేసింది. ఇరాన్‌కు చెందిన ప్రధాన చమురు నిల్వ కేంద్రమైన పర్షియన్ గల్ఫ్‌లోని ఖర్గ్ ద్వీపంపై అమెరికా ఇటీవల దాడి చేసింది. కాగా, పార్స్ సహజ వాయు క్షేత్రానికి సంబంధించిన సదుపాయాలపై జరిగిన దాడిపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈలోని చమురు, గ్యాస్ సదుపాయాలపై దాడి చేస్తామని హెచ్చరించింది.
ఇజ్రాయెల్ సైన్యం ఉపయోగించే పరిభాషనే వాడుతూ సౌదీ అరేబియాలోని సమ్రెఫ్ రిఫైనరీ, దాని జుబెయిల్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌పై దాడి చేస్తామని ఇరాన్ నిర్దిష్టమైన హెచ్చరికలు జారీచేసింది. యూఏఈకి చెందిన అల్ హసన్ గ్యాస్ క్షేత్రాన్ని, పెట్రోకెమికల్ ప్లాంట్లు, ఖతార్‌లోని రిఫైనరీని ధ్వంసం చేస్తామని ఇరాన్ హెచ్చరికలు జారీచేసింది. తన దక్షిణ పార్స్ గ్యాస్ క్షేత్రం, దాని అనుబంధ సదుపాయాలపై బుధవారం తెల్లవారుజామున దాడి జరిగినట్లు ఇరాన్ తెలిపింది.
ఇజ్రాయెల్‌కు చెందిన మొస్సాద్ నిఘా సంస్థకు గూఢచారిగా పనిచేశాడన్న ఆరోపణలపై ఓ వ్యక్తికి ఇరాన్ మరణశిక్ష అమలుచేసింది. ఆ వ్యక్తిని కౌరోష్ కెయ్యానీగా గుర్తించిన మిజాన్ వార్తా సంస్థ ఇరాన్‌కు చెందిన కీలక ఫొటోలు, ప్రదేశాలకు సంబంధించిన సమాచారాన్ని ఇజ్రాయెల్‌కు అతను చేరవేసినట్లు తెలిపింది. కాగా, దక్షిణ ఫార్స్ ప్రావిన్సులోని అరెస్థాన్‌లో ఓ కోర్టు సముదాయంపై ఇజ్రాయెల్, అమెరికా వైమానిక దాడి జరిపినట్లు మిజాన్ తెలిపింది. పలువురు సిబ్బంది, పౌరులు మరణించగా అనేకమంది గాయపడినట్లు వార్తా సంస్థ పేర్కొన్నది.
చమురు క్షేత్రాలకు నిలయమైన సౌదీ అరేబియాకు చెందిన తూర్పు ప్రావిన్సుతోపాటు కువైట్, బహ్రెయిన్, ఖతార్, యూఏఈపై ఇరాన్ దాడులు జరిపింది. యూఏఈలోని తమ రక్షణ స్థావరం వద్ద పడిన క్షిపణి వల్ల స్వల్పంగా మంటలు చెలరేగినట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ తెలిపారు. అయితే ఎవరూ గాయపడలేదని ఆయన చెప్పారు. పశ్చిమాసియాకు ట్రాన్సిట్ హబ్‌గా పశ్చిమ దేశాలు ఉపయోగించుకుంటున్న అల్ మిన్హద్ ఎయిర్ బేస్ సమీపంలో బుధవారం భారీ పేలుళ్లు వినిపించాయి. దుబాయ్ వ్యాప్తంగా సైరన్లు మార్మోగగా నింగిలోనే రక్షణ వ్యవస్థలు దాడులను అడ్డుకున్నాయి.
More Stories
చంద్రుడిని చుట్టి భూమికి చేరిన ఆర్టెమిస్-2 వ్యోమగాములు
యుద్ధాన్ని వ్యాపారంగా మార్చుకున్న వైట్‌హౌస్
సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతి రావు ఫూలే