రాజకీయ ప్రస్థానంలో పదవీ విరమణ అనేది కేవలం ఒక సాంకేతిక ప్రక్రియ మాత్రమేనని, ప్రజా సేవలో ఎప్పుడూ విరామం ఉండదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రాజ్యసభ సభ్యుల వీడ్కోలు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సభను వీడుతున్న వారు సమాజ శ్రేయస్సు కోసం తమ వంతు కృషిని కొనసాగించాలని పిలుపునిచ్చారు.
పార్లమెంటులో జరిగిన చర్చలు, భిన్నాభిప్రాయాలు అన్నీ ప్రజాస్వామ్య బలాన్ని చాటుతాయని ఆయన పేర్కొన్నారు.
దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరి అనుభవం ఎంతో విలువైనదని, అది వృధా పోదని మోదీ భరోసా ఇచ్చారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలు హెచ్‌డీ దేవెగౌడ, శరద్ పవార్, మల్లిఖార్జున ఖర్గే వంటి సీనియర్ల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవాలని ప్రధాని సూచించారు. దశాబ్దాల కాలం పాటు పార్లమెంటరీ సేవలో గడిపిన వీరి జీవితాలు యువ నాయకులకు మార్గదర్శకాలని కొనియాడారు.
సభలో క్రమశిక్షణతో పాటు హాస్యం, వ్యంగ్యం కూడా అవసరమని, రాందాస్ అథవాలే వంటి వారు సభను ఎప్పుడూ ఉత్సాహంగా ఉంచుతారని ప్రశంసించారు. ఈ క్రమంలోనే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్‌కు వీడ్కోలు తెలిపారు. సౌమ్యుడు, మృదుభాషి అయినా కఠిన నిర్ణయాలు తీసుకునే వ్యక్తిగా ఆయనను ప్రశంసించారు. విరామ సమయాల్లో కూడా హరివంశ్ దేశవ్యాప్తంగా పర్యటిస్తూ, జాతీయ ప్రాముఖ్యం గల అంశాలపై యువతతో మమేకమయ్యారని గుర్తు చేశారు.
పదవీ విరమణ చేస్తున్న కొందరు సభ్యులు పాత, కొత్త పార్లమెంట్ భవనాలు రెండింటిలోనూ పనిచేసిన అరుదైన ఘనతను సాధించారని మోదీ తెలిపారు. జీవితాన్ని తీర్చిదిద్దుకోవడానికి ఆరేళ్ల రాజ్యసభ పదవీకాలం అమూల్యమైన అవకాశమని చెప్పారు.
పార్లమెంట్ ప్రక్రియలో ఉన్న ఉభయసభల విధానం గురించి ప్రధాని మోదీ ప్రస్తావిస్తూ ఓ చట్టానికి ఆమోదం దక్కాలంటే రెండో అభిప్రాయం అవసరంమని, అలాంటి విధానం వల్ల ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. ఒక సభలో తీసుకున్న నిర్ణయం, రెండో ఓపీనియన్ కోసం మరో సభకు వెళ్తుందని, అక్కడ జరిగిన చర్చతో నిర్ణయాత్మక విధానం కొత్త రూపు సంతరించుకుంటుదని ప్రధాని తెలిపారు.
ఇదే కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తనదైన శైలిలో చమత్కరించారు. దేవెగౌడ గారితో తనకున్న 54 ఏళ్ల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, “ఆయన మమ్మల్ని ప్రేమించి, మోదీని పెళ్లి చేసుకున్నారు” అని అనడంతో సభలో నవ్వులు పూశాయి. రాజకీయాల్లో ఉన్నవారు అలసిపోరని, దేశం కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటారని ఖర్గే అభిప్రాయపడ్డారు.
ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో 26 మంది ఏకగ్రీవంగా ఎన్నికవ్వగా, మిగిలిన స్థానాలకు పోలింగ్ ద్వారా అభ్యర్థులు విజయం సాధించారు. పాత, కొత్త పార్లమెంట్ భవనాల్లో పనిచేసిన అరుదైన గౌరవం కొందరు సభ్యులకు దక్కింది.
More Stories
పశ్చిమాసియా నుంచి 2.44 లక్షల మంది భారతీయులు తరలింపు
సంక్షోభం ముగింపునకు చర్చలు, దౌత్యమే మార్గం
కేంద్ర మంత్రి కుమార్తెను ఎప్స్టీన్తో లింక్ పోస్టులు తొలగించాలి!