తెలంగాణాలో ఆర్ఎస్ఎస్ శతాబ్దిలో 375 కొత్త శాఖలు 

తెలంగాణాలో ఆర్ఎస్ఎస్ శతాబ్దిలో 375 కొత్త శాఖలు 
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శతాబ్ది సంవత్సరంలో దేశవ్యాప్తంగా కార్యక్రమాల విస్తరణకు చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా తెలంగాణాలో కొత్తగా 375 ఆర్ఎస్ఎస్ శాఖలు ప్రారంభం అయ్యాయని  ప్రాంత కార్యవాహ కాచం రమేశ్ తెలిపారు.   హర్యానాలోని సమాల్ఖాలో మార్చి 13 నుంచి 15 తేదీల మధ్య జరిగిన ఆర్ఎస్ఎస్ అఖిల భారత ప్రతినిధి సభల విశేషాలను మీడియా సమావేశంలో వివరిస్తూ తెలంగాణలో మొత్తం 2,112 స్థలాలలో 3,492 శాఖలు నడుస్తున్నాయని, వారంవారీ సాప్తాహిక్ మిలన్లు 337, నెలవారీగా 69 శాఖలు జరుగుతున్నాయని చెప్పారు.  
 
దేశవ్యాప్తంగా మొత్తం 55,683 స్థలాల్లో సంఘ్ దైనందిన శాఖలు 88,949 నడుస్తున్నాయని, వీటితో పాటు 32,606 శాఖా మిలన్లు (వీక్లీ), 13,211 నెలవారీ శాఖలు (మండలి) నడుస్తున్నాయని, మొత్తంగా దైనందిన శాఖలు, మిలన్లు, మండలితో కలిపి 1,90,449 శాఖాపరమైన కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన వివరించారు.  దేశంలో మారుమూల ప్రాంతాలకు కూడా సంఘ్ శాఖలు వ్యాప్తి చెందేందుకు ఈ సందర్భంగా విశేషమైన కృషి జరిగిన్నట్లు తెలిపారు. 
 
సంఘ్ శతాబ్ది కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని మొత్తం 22 ప్రాంతాలలో సర్‌సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ పర్యటనలు జరిపి సామాజిక సద్భావ సమావేశాలు, ప్రముఖ పౌరులతో సమావేశాలు, హిందూ సమ్మేళనాలు, సమాజంలో ప్రభావవంతులైన వ్యక్తులతో సంభాషణలు వంటి కార్యక్రమాలలో పాల్గొన్నారని తెలిపారు. కొన్ని ప్రాంతాలలో యువ పారిశ్రామికవేత్తలు, పరిశోధకులు మరియు జనజాతి బంధువులతో ప్రత్యేక సంభాషణ కార్యక్రమాలు కూడా నిర్వహించిన్నట్లు చెప్పారు. 
 
సంఘం 100 సంవత్సరాల ప్రయాణాన్ని ప్రజల ముందుంచి వారి సందేహాలకు సమాధానం ఇచ్చి కార్యక్రమాలలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారని రమేష్ వివరించారు.  గృహ సంపర్క కార్యక్రమం ద్వారా సంఘం ఆలోచనలు ఇంటింటికి చేరేవిధంగా కృషి జరుగుతోందని తెలిపారు.  “పంచ పరివర్తన” ద్వారా సమాజంలో, ప్రజల దైనందిన జీవనంలో నాణ్యతమైన మార్పుకోసం సంఘ్ కార్యకర్తలు విశేషమైన కృషి ప్రారంభించారని చెప్పారు. 
 
విస్తృతంగా చేపట్టిన ఈ కార్యక్రమాల ద్వారా సంఘ్ గురించి తెలుసుకోవాలని, సంఘ్‌లో చేరాలనే ఆసక్తి ప్రజలలో పెరుగుతుండటం గమనిస్తున్నామని,  సంఘ్ చేపట్టే సామాజిక కార్యాలపై ప్రజలు దృష్టి సారిస్తున్నట్లు స్పష్టం అవుతున్నదని రమేష్ వివరించారు.  దేశవ్యాప్తంగా 23,143 గ్రామాలలో, 13,905 బస్తీలలో నిర్వహించిన హిందూ సమ్మేళనాలలో 3.5 కోట్లమంది ప్రజలు పాల్గొన్నారని చెబుతూ త్వరలో తెలంగాణాలో కూడా పెద్ద ఎత్తున ఈ సమ్మేళనాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.