గోవులను తల్లిగా భావించే దేశంలో ఆవులకు రక్షణ లేకుండా పోతుంది. దేశ వ్యాప్తంగా నిత్యం ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ అక్రమమంగా గోవులను తరలిస్తున్న వాహనం బోల్తా పడటంతో గుట్టు రట్టయింది. మంగళవారం తెల్లవారుజామున హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గోవులను అక్రమంగా తరలించారు. ఈ వాహనం పోలీసులకు దొరకకూడదనే ఉద్దేశంతో అత్యంత వేగంగా నడిపారు.
వాహనం అకస్మాత్తుగా యూటర్న్ తీసుకున్న క్రమంలో రోడ్డుపై పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న 10 ఎడ్లు, 4 ఆవులకు తీవ్ర గాయాలయ్యాయి. మూగజీవాలు రోడ్డుపై పడి విలవిలలాడటం చూసి స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం చేరవేయంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వాటిని సురక్షితంగా వేరే వాహనంలో యుగతులసి గోక్షేత్రానికి తరలించారు.
తెలంగాణ రాష్ట్రంలో గోవధ నిషేధ చట్టాలు పూర్తిగా నీరుగారిపోయాయని, అక్రమ రవాణాదారులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని యుగతులసి ఫౌండేషన్ చైర్మన్, టీటీడీ పాలక మండలి మాజీ సభ్యులు కె. శివకుమార్ ఈ సందర్భంగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో గోవధ నిషేధ చట్టాలను ప్రభుత్వం పూర్తిగా తుంగలో తొక్కిందని మండిపడ్డారు. అక్రమ రవాణాకు ప్రభుత్వం పరోక్షంగా సహకరిస్తోందని ఆరోపించారు.
రానున్న బక్రీద్ పండుగను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే సరిహద్దుల్లో పటిష్టమైన చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గోరక్షకుల సహకారంతో ఒక్క అక్రమ వాహనం కూడా హైదరాబాద్‌లోకి ప్రవేశించకుండా చూడాల్సిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి గోవధ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయకపోతే, యుగతులసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, దీనివల్ల కలిగే తీవ్ర పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

More Stories
మహిళా బిల్లుపై కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు
దేశంలో తొలిసారి ఖనిజ అన్వేషణ లైసెన్స్
కేశవ్ కాలేజీ విద్యార్థికి జాతీయ స్థాయిలో ప్రశంసలు