ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడుల్లో అప్పటి సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ కూడా తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. ప్రస్తుతం ఆయన కదలలేని స్థితిలో ఉన్నారని, అందుకే దేశంలో అస్థిరత కలగకుండా ఐఆర్జీసీ అంతా తానే అయి వ్యవహరిస్తోందని భారత నిఘా వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
మొజ్తబా పేరుతో వస్తున్న సోషల్ మీడియా పోస్టులు, ప్రకటనలన్నీ ఐఆర్జీసీ కట్టుదిట్టమైన పర్యవేక్షణలో రూపొందుతున్నట్లు తెలుస్తోంది. మొజ్తబా ఆరోగ్యంపై వస్తున్న వార్తలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు మరింత బలాన్నిస్తున్నాయి. ఖమేనీ బ్రతికే ఉన్నారని, కానీ దాడుల్లో ఆయన రూపురేఖలు మారిపోయి ఉండొచ్చని ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించారు.
దీనికి తోడు, సుప్రీం లీడర్‌గా తన సొంత ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా మొజ్తబా హాజరు కాలేదు. వేదికపై కేవలం ఆయన ఫోటోను మాత్రమే ఉంచడం ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందనే అనుమానాలకు ఆజ్యం పోసింది. కాగా, ఈ కథనాలను ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తీవ్రంగా తోసిపుచ్చారు. మొజ్తబా పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, ఇవన్నీ అమెరికా పన్నాగాలని ఆయన కొట్టిపారేశారు.
అయినప్పటికీ, క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం ఇరాన్లో నాయకత్వ సంక్షోభం నెలకొందని సూచిస్తున్నాయి. ప్రస్తుతం ఐఆర్‌జీసీయే పాలనా వ్యవహారాలను పరోక్షంగా నడుపుతున్నట్లు అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం పశ్చిమాసియాలో మరిన్ని రాజకీయ మార్పులకు దారితీసే అవకాశం ఉంది. మరోవైపు ఇరాన్లో అంతర్గత అస్థిరత ఏర్పడకుండా ఉండేందుకు ఐఆర్జీసీ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది.
మొజ్తాబా ఆరోగ్యంపై సమాచారం బయటకు పొక్కకుండా పూర్తి నియంత్రణను తన చేతుల్లోకి తీసుకుంది. ఇరాన్లో భయాందోళనలు కలగకుండా ఉండేందుకే ఆయన పేరుతో పాత ఫొటోలు లేదా రాతపూర్వక సందేశాలను విడుదల చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ సైనిక నాయకత్వం నియంత్రణలో మొజ్తాబా ఖమేనీ ప్రస్తుతం ఒక ‘తాత్కాలిక నేత’గా మాత్రమే పరిమితమయ్యారని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.

More Stories
సౌదీలో ఉన్న భారతీయులకు కీలక హెచ్చరిక
‘ఎస్ఐఆర్’ తరహాలోనే అమెరికాలో ఓటర్ల వెరిఫికేషన్!
గ్రీన్ కార్డుల కోసం చోరీలు.. 11 మంది భారతీయులు అరెస్ట్